ఇద్దరూ కమలం యోధులే. తెలుగు వీరులే. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీని బలోపేతం చెయ్యాలని తపిస్తున్నవారే. కానీ ఏపీలో రాజకీయాలు చేయాల్సిన నాయకుడు, తెలంగాణలోనూ...
ఇద్దరూ కమలం యోధులే. తెలుగు వీరులే. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీని బలోపేతం చెయ్యాలని తపిస్తున్నవారే. కానీ ఏపీలో రాజకీయాలు చేయాల్సిన నాయకుడు, తెలంగాణలోనూ జోక్యం చేసుకోవడం, తెలంగాణ లీడర్‌కు అస్సలు నచ్చడం లేదట. అందుకే పైపైకి విభేదాలేమీ లేవని అంటున్నా, లోలోపల మాత్రం ఒకరిపై ఒకరు కత్తులు నూరుతున్నారట. హార్డ్‌కోర్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రసయిన బీజేపీలో, ఈ కోల్డ్‌వార్ రాజకీయమేంటి? ఎవరా కీలక నేతలు?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బలపడేందుకు రకరకాల వ్యూహాలు వేస్తున్న బీజేపీలోనే, అంతర్గత పోరు శ్రుతిమించుతోందని, ఆ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా కనిపించిన, ఇద్దరు నేతల కోల్డ్‌వార్ తాజాగా ఆ పార్టీ కీలక నేత కామెంట్లతో కొంత బయటినట్టు కనిపిస్తోంది.
మురళీధర్ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. రాంమాధవ్, అదే బీజేపీలో మరో జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇద్దరూ తెలుగు నాయకులు, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వారు. అయితే ఇప్పడు ఈ ఇద్దరి మధ్యే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కోల్డ్ వార్ సాగుతోందన్న చర్చ సాగుతోంది. తెలంగాణకు చెందిన మురళీధర్ రావుకు, జాతీయస్థాయిలో మంచి పరిచయాలున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నాయకుడిగా చలామణి అయ్యారు. నేషనల్ లెవల్‌లో పలు కీలక బాధ్యతలను పార్టీ ఆయనకు అప్పగించింది. అంతేకాదు, మొన్నటి వరకు తెలంగాణలోనూ ఆయన ఆధ్వర్యంలో కొన్ని చేరికలు జరిగాయి. అయితే ఇప్పుడు తగ్గాయి.
అయితే, ఏపీతో పాటు తెలంగాణ కమలంలోనూ ఏపీకి చెందిన రాంమాధవ్ జోక్యం పెరిగిందని మురళీధర్ రావు వర్గీయులు అసహనంతో రగిలిపోతున్నారట. డీకే అరుణతో పాటు చాలామంది కీలక నేతలను, బీజేపీలో చేర్పించింది రాంమాధవే. ఇంకా పార్టీలో చేరాలనుకుంటున్న చాలామంది ఇతర పార్టీల నాయకులు, రాంమాధవ్ ద్వారా అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరతామని పట్టుబడుతున్నారట. ఈ పరిణామాలు సహజంగానే మురళీధర్ రావు వర్గీయుల అసంతృప్తికి కారణమయ్యాయని అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ రాంమాధవ్ ఆధిపత్యంపై, మురళీధర్ రావు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు కూడా రాంమాధవ్‌కు ఇచ్చిన ఇంపార్టెన్స్‌ను తనకివ్వడంలేదని మురళీధర్ రావు వర్గీయులు రగిలిపోతున్నారట.
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి రాంమాధవ్ చరిష్మా పెరగటం, ఇక్కడి పార్టీ నాయకులు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి పరిణామాలతో మురళీధర్ రావు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, తాజాగా మీడియా పర్సన్స్‌తో చిట్‌చాట్‌లో, తన మనసులోని మాటలను, బయటకు చెప్పి, కమలంలో కాస్త కలకలం రేపారు మురళీధర్ రావు.
తనకు, రాంమాధవ్‌కు మధ్య పోటీ ఉందనే వార్తలను ఖండించారు మురళీధర్ రావు. రాంమాధవ్ వేరు, మురళీధర్ రావు వేరు అని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో రాంమాధవ్‌కు పోటీ లేదని కానీ తెలంగాణలో తనకు పోటీ ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కంటే ఏపీలోనే బీజేపీ ఎక్కువగా బలపడుతుందని అభిప్రాయపడ్డారు మురళీధర్ రావు. సొంత రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంటేనే జాతీయస్థాయిలో తమలాంటి వారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
అంతేకాదు, ఇదే చిట్‌చాట్‌లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారాయన. కేసీఆర్, తాను ఒకే సామాజికవర్గమైనందుకు, ఇద్దరి మధ్య లోలోపల సత్సంబంధాలున్నాయన్న విమర్శలపై స్పందించారు. ఇద్దరి సామాజికవర్గం ఒకటే కాబట్టి, కేసీఆర్ సర్కారుపై తాను పెద్దగా విమర్శలు చేయడం లేదన్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు మురళీధర్. తెలంగాణలో కేసీఆర్‌పై అందరికంటే ఎక్కువ విమర్శలు చేసిందని తానేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలకు స్కోపు వుంటుంది కానీ, తెలంగాణలో ఉండదన్నారు. అసలు కుల రాజకీయాలు తనకు తెలియదని, తన కులం వారితో పెద్దగా సంబంధాలు కూడా లేవన్నారట మురళీధర్ రావు. తెలంగాణలో పార్టీ ఎంత స్ట్రాంగ్ అయితే, ఢిల్లీలో తాము అంత స్ట్రాంగ్ కాగలుగుతామన్న మురళీధర్, దీంతో ఇకముందు తన ఫోకస్ అంతా, తెలంగాణపైనేనని చెప్పకనే చెప్పినట్టయ్యిందని అర్థమవుతోంది.
తెలంగాణలో బలపడేందుకు బీజేపీ రకరకాల వ్యూహాలు వేస్తోంది. అనేకమంది ఇతర పార్టీల సీనియర్లను పార్టీలో చేర్చుకుంటోంది. త్వరలో పార్టీ రాష్ట్ర అధ‌్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాను సైతం రేసులో ఉన్నాను అనేందుకే, మురళీధర్ రావు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు రాంమాధవ్ వంటి నేతలు అడ్డుతగులుతున్నారన్న అసంతృప్తి ఆయన మాటల్లో ప్రతిధ్వనించిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంలో సీరియస్‌గానే మురళీధర్ రావు, ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ వార్తలను ఆయన పూర్తిగా ఖండించడం లేదు. అయితే మరోవైపు రాంమాధవ్‌కు సన్నిహితంగా ఉండే కొందరు నాయకులు, ఆయన ద్వారా పార్టీ అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. అదే ఇద్దరి మధ్యా కోల్డ్‌వార్‌ను మరింత మండిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి.
మొత్తమ్మీద, రోజురోజుకి తెలంగాణలో పార్టీ బలపడుతుండటం, అదే సమయంలో రాంమాధవ్ చరిష్మా కూడా పార్టీలో పెరుగుతుండటంతో, మురళీధర్ రావు జాగ్రత్త పడ్తున్నారని పార్టీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. అందుకే తెలంగాణపై ఫోకస్ చేస్తున్నారని, ఎక్కువ సమయం హైదరాబాద్ లో ఉండటానికే కేటాయిస్తున్నారని చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో దూసుకుపోతున్న కమలం పార్టీ, వచ్చే టర్మ్‌లో అధికారం కైవసం చేసుకుంటే, సీఎం అవకాశం తమకు రాకపోదన్న ఆశతోనే కొందరు నాయకులు తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెడ్తున్నారని పార్టీలో కింది స్థాయి నాయకులు మాట్లాడుకుంటున్నారట. చూడాలి, తెలంగాణ బీజేపీ తలరాత ఎలా మారుతుందో, ఆశావహుల ఆధిపత్య పోరు ఇంకెలాంటి స్థాయికి చేరుతుందో.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire