Revanth Reddy: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష

CM Revanth Reddy review of irrigation projects
x

Revanth Reddy: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష

Highlights

Revanth Reddy: ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేసిన సీఎం

Revanth Reddy: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టును సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. ఈ వరుసలో రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నెరవేర్చందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

అయిదేండ్లకు ఆరేండ్లకు పూర్తి కాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టి అక్కడ నిధులు ఖర్చు చేస్తే లాభం లేదని అన్నారు. ఇప్పటికే 75 శాతం, అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్ లోగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశముందని సీఎం తెలిపారు. అటు గోదావరి బేసిన్, ఇటు కృష్ణా బేసిన్ లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు చేయాలని చెప్పారు.

ఇక పనులు పూర్తి చేసేందుకు ఉన్న అడ్డంకులు, అవరోధంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రధానంగా విద్యుత్ విభాగంతో కొన్ని బిల్లుల చెల్లింపుల సమస్యలున్నాయని అధికారులకు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇతర విభాగాలతో సమన్వయం లోపిస్తే పనులు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని, వెంటనే ట్రాన్స్​కో, జెన్​కో , డిస్కంలతో ఇరిగేషన్ విభాగం జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

భూసేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవిన్యూ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టులను వేగంగా చేపట్టేందుకు ఈ మూడు విభాగాలు కలిపి సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. ఇంజనీర్లు ఆఫీసుల్లో ఉండే కుదరదని, ఐఏఎస్ అధికారుల నుంచి ఇంజనీర్లు అందరూ క్షేత్రస్థాయికి వెళ్లాలని సీఎం ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో సాగునీటి విభాగంలో పని చేసిన ఇంజనీర్లు అత్యంత కీలకమైన పాత్ర పోషించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అందుకే ఇరిగేషన్ విభాగంలో పని చేసే ఇంజనీర్లందరూ తమది సాదాసీదా ఉద్యోగం కాదని.. నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగంతో ముడిపడి ఉందని పని చేయాలని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. భూసేకరణలోనూ మానవీయత ఉండాలని, భూములు ఇచ్చే వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరపాలని చెప్పారు.

సీఈలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్ఈలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న మేజర్, మీడియం ప్రాజెక్టులో పూడిక తీతపై ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నవిధానాలు, సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో జరుగుతున్న పనులను అధికారులు వివరించారు.

రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పరిధిలో సగటున 25 శాతం పూడిక, ఇసుక మేటలున్నాయని ఇటీవల ఒక ఏజెన్సీ అధ్యయన నివేదికలో వెల్లడయిందని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా చెప్పారు. పూడికతీతపై జాతీయ పాలసీని అన్వయం చేసుకునే ముందు మరోసారి సాధ్యాసాధ్యాలు, ఏయే పద్ధతులను అనుసరించాలి.. వాటితో ఉండే లాభనష్టాలను మరోసారి బేరీజు వేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories