Musi River Development Plan: మూసీ నదికి ప్రాణం పోసే ప్లాన్ ఇదేనా?

Musi River Development Plan: మూసీ నదికి ప్రాణం పోసే ప్లాన్ ఇదేనా?
x
Highlights

Revant Reddy About Musi River Development Plan: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు పనులకు 2024 నవంబర్ 1న శంకుస్థాపన చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ....

Revant Reddy About Musi River Development Plan: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు పనులకు 2024 నవంబర్ 1న శంకుస్థాపన చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. బాపూఘాట్ నుంచి వెనక్కి 21 కిలోమీటర్లు మూసీని తొలుత అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి మూసీలోకి గోదావరి నీటిని తరలించేందుకు టెండర్లను ప్రభుత్వం పిలువనుంది. రాజకీయంగా నష్టం జరిగినా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మూసీ పునరుజ్జీవనంపై ముందడుగే

మూసీ పునరుజ్జీవనంపై ముందుకే వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌లో ఈ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవనున్నారు. తొలివిడతలో బాపుఘాట్ నుంచి వెనక్కి అంటే గండిపేట, హిమాయత్ సాగర్ వరకు 21 కిలోమీటర్లు ఈ పనులు ప్రారంభిస్తారు. అదే సమయంలో మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని మూసీలో కలిపేందుకు అవసరమైన పనులు చేసేందుకు టెండర్లను పిలుస్తారు. జీహెచ్ఎంసీ మేయర్, ఇతర అధికారులు అక్టోబర్ మూడో వారంలో దక్షిణ కొరియాలోని సియోల్‌లో హన్ నది పునరుజ్జీవనాన్ని పరిశీలించి వచ్చారు. హైద్రాబాద్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధులను సియోల్‌కు పంపనున్నారు. మూసీ చుట్టు నైట్ సిటీని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. బాపుఘాట్ వద్ద అతి పెద్ద గాంధీ విగ్రహాం ఏర్పాటు చేస్తారు.

నిర్వాసితుల పిల్లలకు ఉచిత విద్య

మూసీ పునరుజ్జీవం కోసం ఈ ప్రాంతంలో ఉంటున్నవారికి పునరావాసం కల్పించనున్నారు. ఇప్పటికే 33 బృందాలు సర్వే నిర్వహించాయి. హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మూసీ వెంట 12 వేల అక్రమ నిర్మాణాలున్నాయని గుర్తించారు. ఇప్పటికే ఆయా నిర్మాణాలకు RBX అంటూ అధికారులు మార్క్ చేశారు. మూసీ గర్భంలో ఉన్న 1600 మందిలో మూడొంతుల మంది ఖాళీ చేసి ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి వెళ్లేందుకు అంగీకరించారు. ఇలా 250 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించారు. బఫర్ జోన్‌లో ఉంటున్నవారు మాత్రం తమకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

నిర్వాసితులకు సుమారు 800 ఎకరాలు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. నగరంలో రెండు లేదా మూడు చోట్ల ఈ స్థలాన్ని సేకరించనున్నారు. నిర్వాసితులకు 150 నుంచి 200 గజాల స్థలం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బాధితుల పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు మూసీ నిర్వాసితులకు ఎలా న్యాయం చేయాలనే దానిపై రాజకీయపక్షాలతో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

నవంబర్ మొదటి వారంలో ఆల్ పార్టీ సమావేశం ఉండే అవకాశం ఉంది. బాధితులకు ఎలా న్యాయం చేయవచ్చో ఈ సమావేశంలో పార్టీలు తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు. మూసీపై తమ అభిప్రాయాలను నేరుగా సీఎస్ లేదా మంత్రుల వద్దకు వెళ్లి చెప్పవచ్చని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు సూచించారు.

డీపీఆర్‌కు రూ. 140 కోట్లతో టెండర్లు

మూసీ పునరుజ్జీవనం కోసం మెయిన్ హర్డ్, రియోస్, కష్ మ్యాన్ వక్ ఫీల్డ్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మూడు సంస్థలతో ఝా, ఎస్ఓఎం సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. మూసీని బాగు చేసేందుకు ఏం చేయాలనే దానిపై ఈ సంస్థలు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను అందిస్తాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలకు రూ. 141 కోట్లను ఖర్చు చేస్తోంది. మూసీ పునరుజ్జీవన ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, ఇప్పుడు డీపీఆర్ ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాము అధికారంలో ఉన్న సమయంలో 5 కిలోమీటర్లు మూసీని అభివృద్ది చేశాం. కానీ, ఎక్కడా కూడా పేదవాడి పొట్టకొట్టలేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పాకిస్తాన్‌లోని రావి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు తీసుకొని మెయిన్ హార్డ్ సంస్థ అంచనాలు పెంచిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. అలాంటి సంస్థకు మూసీ పునరుజ్జీవనంపై డీపీఆర్ తయారు చేయాలని టెండర్ ఇవ్వడంపై కేటీఆర్ మండిపడ్డారు.

సబర్మతి రివర్ ఫ్రంట్ అనుభవాలు

1960 లో ఫ్రెంచ్ అర్కిటెక్ట్ బెర్నార్డ్ కోహ్న్ గుజరాత్‌లోని సబర్మతి నదిని ప్రక్షాళన చేయాలని ప్రతిపాదించారు. అయితే 1966లో టెక్నికల్ స్డడీస్ పూర్తైన తర్వాత అప్పటి గుజరాత్ ప్రభుత్వం దీనికి అంగీకరించింది. డ్రైనేజీ కాలువ, పంపింగ్ స్టేషన్లు, మురుగు శుద్దిచేసే ప్లాంట్లను అప్ గ్రేడ్ చేయాలని 1992లో నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ సూచించింది. ఆ తర్వాతే రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు.ఈ నదిని రెండు విడతల్లో పుజరుజ్జీవం చేస్తున్నారు.1997లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సబర్మతి రివర్ ఫ్రంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. ఈ నదికి రెండు వైపులా 34 కిలోమీటర్లలో రూ.2 వేల కోట్లతో ప్రక్షాళన చేయాలని భావించారు. తొలి విడతలో 1400 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడతలో 850 కోట్లను కేటాయించారు. 2027 నాటికి సెకండ్ ఫేజ్ ను పూర్తి చేస్తారు. ఈ నది వెంట ఉన్న ఉన్నవారిలో 11 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ప్రాజెక్టు పరిధిలో బాధితులు కొందరు కోర్టును ఆశ్రయించారు. అధికారిక లెక్కల మేరకు 4 వేల మంది బాధితులకు అహ్మదాబాద్ నగర శివార్లలో మార్ట్ ల్యాండ్ లో పునరావాసం కల్పించారు. పునరావాసం విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించారు.

మూసీ పునరుజ్జీవనాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. అయితే బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రభుత్వం వైఖరిపై స్పష్టత కోరుతున్నారు. కీలక విషయాలపై స్పష్టత లేకుండానే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ముందుకు రావడంపైనే రాజకీయపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై అన్ని పార్టీల సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని కోరుతున్నాయి. ప్రజలకు మంచి చేయాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. అయితే ఆ మంచి ఏ రూపంలో అనేదే తేలాలి. దీనిపై విపక్షాలు పట్టుబడుతున్నాయి

Show Full Article
Print Article
Next Story
More Stories