తెలంగాణలో రాజకీయ దూకుడు తగ్గించిన కేసీఆర్.. జోష్ పెంచిన బీజేపీ

CM KCR Vs BJP in Telangana | TS News
x

తెలంగాణలో రాజకీయ దూకుడు తగ్గించిన కేసీఆర్.. జోష్ పెంచిన బీజేపీ

Highlights

*అధికారమే లక్ష్యంగా కాషాయ దళం అడుగులు

Telangana: సమయానుకూలంగా రాజకీయాలు వ్యూహాలు మార్చడంలో గులాబీ బాస్ అందెవేసిన చెయ్యి అయితే కొన్నిసార్లు కాలం కలిసి రాక అవి వికటించే సందర్భాలు లేకపోలేదు. తెలంగాణలో పుంజుకుంటున్న కాంగ్రెస్ కు విరుగుడుగా. బిజెపిని పెద్దదిగా చేసి చూపిన KCR ఇప్పుడు తలపట్టుకునే పరిస్థితి నెలకొన్నది. ఇంతకాలం చూసీచూడనట్లు ఉన్న కాషాయ పార్టీ అగ్రనేతలు కారు పార్టీ కలవరం పుట్టిస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి చూస్తుంటే.. మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయా .. అనేలా పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు బీజేపీ రాజకీయ దూకుడు చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం కేసీఆర్ చేసిన రాజకీయ హడావిడితో ముందస్తు ఎన్నికలు వస్తాయని అంతా అనుకున్నారు. బీజేపీ అదే రకమైన ఆలోచనలో ఉంటూ వచ్చింది. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ చోట్ల విజయం సాధించడంతో సీన్ మారిపోయింది. కేసీఆర్ తన రాజకీయ దూకుడును కొంచెం తగ్గించారు. కానీ బీజేపీ మాత్రం టార్గెట్ తెలంగాణ విషయంలో మరింత దూకుడు పెంచింది. తమ తదుపరి లక్ష్యం తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే అన్నట్టుగా దూసుకుపోతోంది.

నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారని.. ఈ ఏడాది చివర్లో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీజేపీ హైకమాండ్ భావించింది. గుజరాత్‌తో కాకపోయినా.. కర్ణాటకతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధపడతారని అంచనా వేసింది. కేసీఆర్ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లినా ఈసారి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాల్సిందే అన్నట్టుగా ఆ పార్టీ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అధికార పార్టీకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా లో భారీ బహిరంగ సభలతో పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు.

రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర బిజెపిలో ఉత్సాహం నెలకొంది. అందుకు తగ్గట్టుగా చాలా నెలల ముందు నుంచే తెలంగాణపై తమ వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై రాజకీయ దండయాత్ర మొదలుపెట్టారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ పైచేయి అన్నట్టుగా ఉండే కేసీఆర్ కాస్త వెనుకబడిపోయారా ? అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. ఓ వైపు బీజేపీ నేతలు తెలంగాణపై టార్గెట్ చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం బీజేపీని జాతీయ స్థాయిలో టార్గెట్ చేసేందుకు ఇతర రాష్ట్రాలకు వెళుతూ అక్కడి నేతలను కలుస్తున్నారు. అయితే అవి ఆశించిన ఫలితాలు ఇస్తాయా అన్న సందేహం గులాబీ వర్గాల్లో నెలకొంది. బలంగా ఉన్న తెలంగాణలో వదిలి భారత రాజకీయాల్లో కేసీఆర్ వెళ్లడాన్ని టిఆర్ఎస్ శ్రేణులు బహిరంగంగా విమర్శించ లేకపోతున్నారు.

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కెసిఆర్... సమయాన్ని బట్టి తనదైన వ్యూహాలను అమలు చేసి విజయం సాధించడంలో దిట్ట. ఇక ఇప్పుడు బీజేపీని ఢీ కొట్టేందుకు తగిన వ్యూహాలతో సరైన సమయంలో ముందుకు వస్తారని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి ధీటుగా తాను కూడా రాజకీయ విమర్శలు చేస్తే.. తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. సమయాన్ని బట్టి పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తారనే చర్చ సాగుతోంది. వివిధ ప్రాంతీయ పార్టీ నేతల మద్దతు కూడ గట్టి బీజేపీకి గట్టి సవాల్ విసిరారని చర్చించుకుంటున్నారు. అయితే అంతే స్థాయిలో కెసిఆర్ పై పగ సాధించడానికి కాషాయ పార్టీ అగ్ర నాయకత్వం హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతోందని అంటున్నారు.

మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్ వుంటేనే లాభిస్తుందనే అంచనాలో ఉన్న కేసీఆర్ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు.అయితే ఇప్పుడు బీజేపీ రివెంజ్ రాజకీయాల దూకుడుకు కేసీఆర్ ఏ విధంగా కళ్లెం వేస్తారన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories