Puvvada Ajay: అజయ్‌ ఆగమాగం.. ఇదంతా అజయ్‌కి చెక్ పెట్టేందుకేనా?

CM KCR Satirical Comments on Puvvada Ajay Kumar
x

Puvvada Ajay: అజయ్‌ ఆగమాగం.. ఇదంతా అజయ్‌కి చెక్ పెట్టేందుకేనా?

Highlights

Puvvada Ajay: రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సొంత శాఖలో రావణకాష్టం రగులుకుంటుందా?

Puvvada Ajay: రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సొంత శాఖలో రావణకాష్టం రగులుకుంటుందా? ఇన్నాళ్లూ అజేయంగా సాగిన అజయ్ ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతున్నాయా? మంత్రిగా రెండేళ్ల పదవీకాలం పూర్తయినా ఏమాత్రం పట్టు సాధించకపోవడంపై అధిష్టానం కన్నెర్ర చేసిందా? తాజాగా బస్సుల లెక్క కూడా తేలియదన్న సీఎం కామెంట్‌‌‌తో చర్చనీయాంశంగా మారుతున్న అంశాలేంటి? తన శాఖపై పువ్వాడకు పట్టు సడలడానికి కారణాలేంటి?

తెలంగాణ రవాణ శాఖ మంత్రిగా రెండేళ్లుగా కొనసాగుతున్న అజయ్ తన శాఖపై ఏమాత్రం పట్టు సాధించలేదన్న అపవాదు మూటకట్టుకున్నారు. ఆర్టీసీని గాడిని పెట్టే మార్గాలను అన్వేషించడంలో గాని, కార్మికుల్లో భరోసా నింపేవిధంగా కార్యక్రమాలు చేపట్టడంలో గానీ, పూర్తిగా వైఫల్యం చెందారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ సభ కోసం బస్సులెన్ని ఉన్నాయని సీఎం కేసీఆర్ అడగ్గానే బయటకొచ్చి అధికారులకు ఫోన్ చేయడంతో నీ శాఖలో బస్సులెన్ని ఉన్నాయో నీకు తెలియదా అంటూ కేసీఆర్‌ సెటైర్‌ వేయడంతో ఆ శాఖపై పువ్వాడకు ఉన్న పట్టేందో తెలిసిపోయిందన్న చర్చ జరుగుతోంది.

తెలంగాణలో 2019 అక్టోబరులో జరిగిన సమ్మె నుంచి ఆర్టీసీ గాడిలో పడకపోవడంతో ఆ శాఖమంత్రి అజయ్‌కి పుండు మీద కారం చల్లేలా సీఎం కేసీఆర్‌ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. టీఎస్‌ఆర్టీసీ ఎండీగా సెన్సెషనల్ ఐపీఎస్ అధికారి సజ్జనార్, ఆర్టీసి ఛైర్మన్‌గా కేసీఆర్ సమకాలికుడు బాజిరెడ్డి గోవర్థన్ నియామకం కావడం అజయ్‌కి చెక్ పెట్టేందుకేనన్న టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఇన్నాళ్లు కేటీఆర్‌కు సన్నిహితుడుగా హవా నడిపిన రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ప్రయాణం భవిష్యత్‌లో ముళ్ల బాటగా మారనుందనే ప్రచారం ఆయన వర్గానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన అజయ్ ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే తుమ్మలపై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత కేటీఆర్‌తో ఉన్న స్నేహ సంబంధాలతో కారు పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రిగా ఉన్న తుమ్మల అనూహ్యంగా ఓడిపోవడంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంత్రి పదవిని సాధించారు. మంత్రిగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నా ఉమ్మడి జిల్లాలో పార్టీకి ఊపు తేవడంలో అజయ్ అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదనే అసంతృప్తి అధిష్టానం ముందు చర్చకు వస్తోందని సమాచారం.

సొంత ఊరు ఖమ్మంలో అట్టహాసంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన కొత్త బస్టాండ్ నిర్మాణంలో అవకతవకలపై లోకాయుక్త వరకూ వెళ్లిన ఫిర్యాదులు ఆయన కెరీర్‌కు మచ్చ తెచ్చేవిధంగా మారాయనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మరోవైపు జిల్లాలో సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా ఉన్న నేతలు, కార్యకర్తలను పోలీసుల సాయంతో ఉక్కుపాదంతో అణిచివేసేందుకు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఖమ్మం నియోజవర్గాన్ని భారీ నిధులతో అభివృద్ది చేసినా గత కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ బడ్జెట్‌తో పోటీకి దిగినా పది మందికి పైగా విపక్షాల అభ్యర్థులు విజయం సాధించడం కూడా ఆయన వ్యూహాలపై అనుమానాలను రేకెత్తించింది. సొంత సామాజిక వర్గం బలంగా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం కూడా మింగుడు పడని అంశంగా మారింది.

ఇన్ని అంశాలపై సమాచారాన్ని తెప్పించుకున్న అధిష్టానం అజయ్‌ అడుగులపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టిందంట. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్‌ బస్సుల లెక్క కూడా తెలియదా అంటూ అందరిలో కామెంట్‌ చేయడం కూడా ఇందులో భాగమేనన్న చర్చ జరుగుతోంది. మరి ముందు ముందు అజయ్‌ రాజకీయ భవిష్యత్‌ ఏ మలుపు తిరుగనుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories