లక్కీ కౌశిక్.. ఈటల కంటే ముందు కూర్చునే ప్లాన్..

CM KCR Gives Lucky Chance to Kaushik Reddy
x

లక్కీ కౌశిక్.. ఈటల కంటే ముందు కూర్చునే ప్లాన్.. 

Highlights

Kaushik Reddy: పాడి కౌశిక్‌‌రెడ్డి జాక్‌పాట్‌ కొట్టేశారు.

Kaushik Reddy: పాడి కౌశిక్‌‌రెడ్డి జాక్‌పాట్‌ కొట్టేశారు. గవర్నర్‌ కోటా పోతే పోయింది కానీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వచ్చి పడింది. రాజ్‌భవన్‌ ఫైల్‌ పెండింగ్‌లో పడితే పడింది కానీ మండలి మెట్లు ఎక్కే మార్గం సుగమైంది. అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో అందె వేసిన చేయిగా ఉండే అధినేత కౌశిక్‌ విషయంలో ఊహకందని డిసిషన్‌ తీసుకున్నారు. ఎందుకు? కౌశిక్‌రెడ్డిని అందరు వ్యతిరేకించినా కేసీఆర్‌ ఎందుకంత ప్రయారిటీ ఇచ్చారు?

పాడి కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముందు, తర్వాత ప్రముఖంగా వినిపించింది. ఈటల రాజీనామా, మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌, బైపోల్‌ ఇష్యూ అయ్యాక, కౌశిక్‌ పేరు అందరి నోటా నానింది. హుజూరాబాద్‌లో ఈటలకు పోటీగా కౌశిక్‌రెడ్డిని బరిలోకి దించాలని అనుకున్నా అది సాధ్యం కాలేదు. గులాబీ పార్టీలోకి వస్తూవస్తూనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి పొంది చర్చనీయాంశంగా మారిన కౌశిక్‌రెడ్డి భవిష్యత్తు బంగారు మయమే అని అంతా చర్చించుకున్నారు. అయితే గవర్నర్ తమిళ సై సౌందరాజన్ ఫైల్ పెండింగ్‌లో పెట్టడంతో ఇక కౌశిక్ పరిస్థితి ఖతమే అనుకున్నారు. కాని గులాబీ బాస్ కేసీఆర్ అనూహ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడం, కౌశిక్‌రెడ్డి అసంతృప్తితో ఉండటంతో ఆయన్ను ఎమ్మెల్యే కోటా కౌశిక్‌ను ప్రమోట్‌ చేశారు కేసీఆర్‌.

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి తర్వాత అనేక రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో ఈటల ఓటమి కోసం అనేక వ్యూహాలు అమలు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ నుంచి కౌశిక్‌రెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గవర్నర్‌ ఆ ఫైల్‌ను అలా పెండింగ్‌లో పెట్టడంతో కౌశిక్‌ అభిమానులు టీఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహపడ్డారు. మరోవైపు హుజూరాబాద్ ఎన్నిక కోసమే కౌశిక్‌రెడ్డిని వాడుకుని వదలిస్తారని కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ప్రచారం చేశారు. దీంతో గులాబీబాస్ కౌశిక్‌రెడ్డికి పదవిపై ఎన్నికలప్పుడే హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ విజయం కోసం గట్టిగా కృషిచేశారు. ఆయినా గెల్లు ఓటమి తర్వాత కేసీఆర్ తన మాట నిలుపుకున్నారని చెబుతున్నారు గులాబీ శ్రేణులు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఆరు స్థానాలు ఖాళీగా ఉండటంతో డజను మందికి పైగా అభ్యర్దులు పదవిని ఆశించారు. దీంతో పార్టీ వివిధ సామాజిక వర్గాల సమతూకం ఆధారంగా నిర్ణయం తీసుకుంది. పార్టీలోకి వచ్చిన నేతలను వాడుకొని అధినేత వదిలేస్తారన్న అపవాదు నుంచి తప్పించుకోవడానికే కౌశిక్‌కు పదవి కట్టబెట్టారన్న టాక్‌ నడుస్తోంది. సహజంగా దూకుడు మీద ఉండే పాడి కౌశిక్‌రెడ్డికి, రానున్న రోజుల్లో హుజురాబాద్‌లో పార్టీ పట్టు కోల్పోకుండా చేయడానికే ఈ ఎత్తుగడ వేశారని చెప్పుకుంటున్నారు. దీంతో అనేక మంది పోటీ పడ్డా కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కేటీఆర్, మంత్రి హరీష్‌రావులు పట్టబట్టి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని చెప్పుకుంటున్నారు.

మరోవైపు, రానున్న రోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు గట్టి చెక్ పెట్టడానికే టీఆర్ఎస్ అధిష్టానం కౌశిక్‌రెడ్డికి గట్టి టాస్క్ ఇచ్చిందని అంటున్నారు. ఎమ్మెల్సీ చేయడంతో పాటు ఆయనకు త్వరలో విప్ పదవి ఇచ్చి ప్రోటోకాల్ ప్రకారం ఈటల కంటే ముందు కూర్చునే ప్లాన్ వేశారని అంటున్నారు. దీంతో పార్టీ క్యాడర్ మొత్తం చేజారకుండా చూసుకుంటూనే, వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి బలమైన అభ్యర్థిగా నిలపాలనే యోచన ఉందట. అందుకోసమే ముందస్తుగా రాజ్‌భవన్‌లో కౌశిక్‌రెడ్డి ఫైల్ పెండింగ్‌లో ఉన్నా కూడా ఆ విషయం జోలికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా కారు పార్టీ అధినేత పని కానిచ్చేశారని అంటున్నారు.

మొత్తానికి, పాడి కౌశిక్‌రెడ్డి నక్క తోక తొక్కి వచ్చారనే గుసగుసుల వినిపిస్తున్నాయి. అప్పుడు గవర్నర్ కోటా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కొట్టేశారని చెప్పుకుంటున్నారు. రానున్న రోజల్లో పార్టీ అభ్యర్థిగా హుజూరాబాద్‌ నుంచి కౌశిక్‌రెడ్డిని ప్రమోట్ చేస్తారని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories