నామినేటెడ్ పదవులపై దృష్టిసారించిన కేసీఆర్

నామినేటెడ్ పదవులపై దృష్టిసారించిన కేసీఆర్
x
Highlights

తెలంగాణలో మారుతోన్న రాజకీయ సమీకరణాలు పలువురికి పదవులు కట్టబెట్టేలా ఉన్నాయ్. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న నామినేటెడ్ పదవుల భర్తీపై గులాబీ బాస్...

తెలంగాణలో మారుతోన్న రాజకీయ సమీకరణాలు పలువురికి పదవులు కట్టబెట్టేలా ఉన్నాయ్. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న నామినేటెడ్ పదవుల భర్తీపై గులాబీ బాస్ కసరత్తు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత జోష్ మీద కనిపిస్తున్న బీజేపీ టీఆర్ఎస్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి నేతలను కమలం గూటికి లాగేస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య తమ పార్టీలో ఉన్న నేతలపై కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల భర్తీ జోలికి గులాబీ బాస్ వెళ్లలేదు. అత్యవసరం అనుకున్న ఒకటి రెండు పోస్టులను మాత్రమే భర్తీ చేశారు.

2018 ఎన్నికల సమయంలో నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేసినవారిలో 10మందికి రెన్యువల్ చేశారు. మొత్తం 64కార్పొరేషన్లలో మరో 50వరకు నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. వాటి మీద ఆశపెట్టుకున్న వాళ్లుకూడా చాలామందే ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవి ఆశించి భంగపడినవారు కూడా కార్పొరేషన్ పదవుల మీద కన్నేసినట్లుగా తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, ఆర్టీసీలాంటి కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయ్.

బీసీ కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయింది. ఇక త్వరలోనే కీల‌క‌మైన ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ చైర్మన్ పోస్టుతో సహా ఇతర సభ్యులు పోస్టులు ఖాళీ కానున్నాయ్. అటు మ‌హిళా క‌మిష‌న్‌ నియ‌మించాల‌ని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. వీటితోపాటు ఇత‌ర కార్పోరేష‌న్ల చైర్మన్ పోస్టుల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. బీజేపీ మ‌రింత‌ దూకుడు పెంచి, త‌మ నేత‌ల‌పై ఫోకస్ చేయ‌క‌ముందే నామినేటెడ్ పోస్టుల‌ను పంచాల‌ని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జ‌న‌వ‌రి రెండో వారంలో ప్రక‌ట‌న చేసేందుకు వీలుగా జిల్లాలవారీగా నేత‌ల ప్రొఫైల్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

నామినేటెడ్ పోస్టులకు గతంలో రాజీనామా చేసినవాళ్లతో పాటు ఉద్యమ సమయం నుంచి పనిచేస్తున్న మరికొందరు కూడా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా అటు బీజేపీ ప్రభావం ఇటు పార్టీలో అంతర్గత ఒత్తడితో పదవుల పందేరంపై కారు పార్టీ దృష్టిసారించింది. దీంతో ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories