CM KCR: రాష్ట్రంలోని పెండింగ్‌ అంశాలపై సీఎం కేసీఆర్‌ ఫోకస్

CM KCR Focus on Pending Issues in Telangana
x

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

CM KCR: ధరణి, పోడు భూముల సమస్యలపై దృష్టి

CM KCR: ముందున్న ఒక్కొక్క సమస్యను ఒక్కోటిగా పరిష్కారం చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధం అవుతున్నారా..? ప్రభుత్వం తీసుకువచ్చిన కార్యక్రమాలపై మరోసారి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా..? పాలనపై దృష్టిపెట్టిన సీఎం.. పెండింగ్ సమస్యలు, వాటి పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేసి ఇబ్బందులను తొలగించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారా..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పలు పథకాలకు స్వీకారం చుట్టారు సీఎం కేసీఆర్. అందులో భాగంగానే మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో గత ఏడాది అక్టోబర్ నెలలో భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి పోర్టల్ ప్రారంభించారు. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీంతో అన్ని రకాల రిజిస్ట్రేషన్లు అన్‌లైన్‌లోనే జరగాలని సర్కార్ నిర్ణయించింది. భూములను డిజిటిలైజేషన్ చేయడం ద్వారా భూసమస్యలు ఉండవని, భూముల రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీస్ ల చుట్టు తిరగాల్సిన పనిలేదని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.

అయితే.. ధరణిలో మ్యూటేషన్, ప్రొహిబిటెడ్ ల్యాండ్ లకు సంబంధించిన అంశాలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. భూముల సమస్యలు ఎక్కడవక్కడే ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ రోజుకు ఐదు వందలకు పైగా ఫిర్యాదులు వస్తున్నా.. అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అటు రైతుబంధు రాక, క్రాప్‌లోన్‌ అందక, అవసరాలకు భూములు అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో మూడు, నాలుగు సార్లు అప్లయ్‌ చేసుకున్నా.. పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి పెట్టింది. గతంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన సబ్‌ కమిటీ ఏర్పాటు అయింది. రెండురోజుల్లో ఆ అంశాలపై సబ్‌ కమిటీ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

ఇక.. రాష్ట్రంలో పోడు భూములపై గిరిజన రైతులకు, అటవీ అధికారులకు మధ్య పోరాటం తారాస్థాయికి చేరింది. దీనిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో మొత్తం దాదాపు 11 జిల్లాలో పోడు భూములు అత్యధికంగా ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ భూములనే నమ్ముకొని గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే హరితహారం పథకం పేరిట అధికారులు అటవీ భూముల్లో మొక్కల పెంపకం చేపడుతుండటంతో వివాదం చెలరేగుతోంది. మొక్కలను నాటేందుకు వెళ్లిన అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న అటవీ అధికారుల ఫిర్యాదులతో ఇప్పటికే చాలామంది గిరిజనులపై కేసులు కూడా నమోదయ్యాయి. దీనికి కూడా శాశ్వత పరిష్కారం కోసం మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ నియమించబడింది. ఇప్పటికే పోడుభూముల అంశంపై ఈ నెల 18 న సమావేశం అయిన కమిటీ.. ఈ నెల 24న మరోసారి భేటీ అవుతోంది.

ఇటు ధరణి సమస్యలు, అటు పోడు భూములపై సుదీర్ఘంగా చర్చించి.. తుది నివేదికను త్వరలో సీఎం ముందు ఉంచనున్నారు మంత్రులు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాల్లో పెండింగ్‌ అంశాలపై ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే సీఎం కేసీఆర్.. సబ్‌ కమిటీలు వేశారని టాక్‌ వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories