పాత కేసీఆర్ మళ్లీ కనిపిస్తున్నారా.. రాజకీయాలు ఈటల చుట్టు తిరగడం ఇష్టం లేదా?
CM KCR: గులాబీ చీఫ్, సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు దూకుడు పెంచారు?
CM KCR: గులాబీ చీఫ్, సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు దూకుడు పెంచారు? తన ఫుల్ టార్గెట్ బీజేపీయే అంటూ ఎందుకు డిసైడ్ అయ్యారు.? అటువైపు ఎందుకు షిఫ్ట్ అయ్యారు? ఇక మీకు రేపటి నుంచి ఇదే బాదుడు అంటూ మీడియాతో చెప్పి మరీ మీట్ అవడం వెనుక మర్మమేంటి? ఆయన వ్యూహం ఏంటి? కేసీఆర్ రాజకీయ అడుగులపై పొలిటీకల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చేంటి.?
కేసీఆర్ మూడక్షరాల ఈ పదం ఓ సంచలనం. ఆయన పలికిన ప్రతీ పలుకు సంచనలమే. ఏది మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా ఎలా మాట్లాడినా కేసీఆర్ తాను అనుకున్నదే చెప్తారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రజల్లో తన ఉనికిని పదిలపరుచుకునే, సీఎంగా పట్టు సాధించేందుకు కొన్ని సందర్భాల్లో మొండితనంతో వ్యవహరించే కేసీఆర్ శైలే విభిన్నం. తన పరిపాలనను అమాంతం పైకెత్తినా, ఆపై వ్యూహాత్మకంగా మౌనం దాల్చినా అంతా ఆయన కనుసన్నల్లోనే. చెప్పాలనుకున్నవి సూటిగా చెప్పడమే కాదు ఎంతటి వారితోనైనా తన వాదనతో ఏకీభవించేలా చేయడంలో ఆయనకెవరూ సాటిలేరు. మాటలను తూటాలుగా వాడటంతో కేసీఆర్‌కు సాటి మరే నాయకుడూ లేరు. ఇవన్నీ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపించే మాటలు. అలాంటి పాత కేసీఆరే మళ్లీ కనిపిస్తున్నారన్న చర్చ నడుస్తోంది.
హుజూరాబాద్ ఉపఎన్నికకు ముందు, ఆ తర్వాత కేసీఆర్‌లో ఓ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు. బీజేపీ నేతలు ఎన్ని తిట్టినా జానేదేవ్ అన్నారు. కానీ హుజూరాబాద్ రిజల్ట్స్ తర్వాత రూటు మార్చారు. ఉన్నట్టుండి గతానికి భిన్నంగా ఉంటున్నారు. ప్రతిరోజు వీడియా సమావేశాలతో బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఇదే రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, కేసీఆర్‌ను అతి దగ్గర నుంచి చూసిన వారు ఎవరైనా ఆయన గురించి తెలిసిన వారు ఎవరైనా అనే మాట ఒకటే. కచ్చితంగా దీని వెనుక చతుర్మఖ వ్యూహం ఉందని!
ఎలానో చూద్దాం. హుజురాబాద్ బైపోల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న తన పాత సామెతకు పదును పెట్టారు. బలమైన శత్రువును అసెంబ్లీ కనపడకుండా చేయాలన్న తన కల నెరవేరలేదు. అనూహ్యంగా అక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది. దమ్ముంటే ఓడించాలని సవాల్ విసిరి మరీ గెలిచారు ఈటల రాజేందర్. అంతే హుజూరాబాద్ గెలుపు తర్వాత అందరి దృష్టి పూర్తిగా ఈటల వైపు మళ్లింది. రాజకీయ చర్చంతా ఆయన చుట్టే జరుగుతోంది. అసలు రాష్ట్ర స్థాయి నేతగా ఈటలను చూడొద్దనుకున్న కేసీఆర్‌కు రాష్ట్ర రాజకీయాలు ఈటల చుట్టూ తిరగడం ఏ మాత్రం ఇష్టం లేదట. అందుకే దాని నుంచి ప్రజల దృష్టి తన వైపు మళ్లించుకోవడానికి వేసిన ఎత్తుగడగా దీన్ని అంచనా వేస్తున్నారు.
ఇక, హుజురాబాద్‌లో గెలిచిన ఊపుతో ఉన్న కమలనాథులు టీఆర్‌ఎస్ సర్కార్‌పై దూకుడు పెంచారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టిన కాషాయం క్యాంప్ పలు సమస్యలపై తమ కార్యాచరణ ఏంటో ఓపెన్‌గానే చెప్పింది. అందులో అతి ముఖ్యమైంది, అతి ప్రధానమైన దళితబంధును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా దండోరా వేసింది. అన్ని కేంద్రాల్లో భారీ స్థాయలో నిరసన తెలపాలని పిలుపునిచ్చింది.
అందుకే మొదటగా కేసీఆర్ తన రాజకీయ చతురుతతో కూడిన అడుగు ఇక్కడే వేశారట. తెలంగాణలో దళితబంధును ఆపే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పారు. వచ్చే మార్చికల్లా హుజురాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన మండలాలకు ప్రతి నియోజకవర్గంలో వందమందికి దళితబంధు అందిస్తామని కుండ బద్ధలు కొట్టారు. వచ్చే బడ్జెట్లో 20 వేల కోట్లతో రెండు లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేస్తామని క్లిస్టర్ క్లియర్‌గా చెప్పారు. అలా దళితబంధుతో పేరుతో ఆందోళనలు నిర్వహించి, లబ్ధి పొందాలనుకున్న బీజేపీ ఎత్తుగడను ఆదిలోనే తిప్పికొట్టే వ్యూహాన్ని కేసీఆర్ అంతే వ్యూహంతో అమలు చేశారని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
ఇక బీజేపీ, విద్యార్థి నిరుద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టింది. ఉద్యోగ నోటిఫికేషన్ రాక గుర్రుగా ఉన్న నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేలా ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 16న నిరుద్యోగ మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. విద్యార్థులు, నిరుద్యోగ యువతను భారీగా సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దాంతో అప్రమత్తమైన గులాబీబాస్ కేసీఆర్ నిరుద్యోగులను చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే కొత్త జోనల్ విధానం ప్రకారం 60 నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇలా నిరుద్యోగ మిలియన్ మార్చ్‌కు వెళ్లాలనుకున్న కమలనాథులకు విద్యార్థి నిరుద్యోగుల వెళ్లకుండా కేసీఆర్ గీసిన మరో స్కెచ్‌గా చర్చించుకుంటున్నారు.
వరి ధాన్యం కొనుగోలుపై మిల్లర్లతో కుమ్మక్కైన కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం పండించొద్దని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిపై కమలనాథులు మండిపడుతున్నారు. కేసీఆర్ మెడలు వంచైనా సరే ధాన్యం కొనుగోలు చేయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. దీంతో కేసీఆర్ వెంటనే అలెర్ట్ అయ్యారు. వరి ధాన్యం కొనుగో కు కేంద్రం ముందుకు రావడం లేదని కేంద్రంలోని మోడీ సర్కార్‌ను కార్నర్ చేశారు. ఏకంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. ఈనెల 12న ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్న రోజునే అన్ని నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోలుపై ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇక మరో దఫా పాదయాత్రకు సిద్ధమవుతున్న బండి యాత్రని అడుగడుగున అడ్డుకోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇది బండి సంజయ్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టే మరో ఎత్తుగడగా విశ్లేషిస్తున్నారు.
మొత్తానికి, సమయానుకూలంగా రాజకీయ వ్యూహాలు మార్చే కేసీఆర్ ఇప్పుడు తానే స్వయంగా రంగంలోనికి దూకి పొలిటికల్ ఎటాక్ చేస్తున్నారు. దీంతో పార్టీ నైతిక స్థైర్యం పెంచే పనితో పాటు ప్రతిపక్షాల వాదనకు చోటు లేకుండా చేసే ఎత్తుగడ దాగుందంటున్నారు రాజకీయ నిపుణులు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire