కేటీఆర్‌కు ప్రమోషన్‌ డౌటే.. రూమర్స్‌కు చెక్‌ పెట్టబోతున్నారా?

CM KCR Break To KTR CM Post
x

కేటీఆర్‌కు ప్రమోషన్‌ డౌటే.. రూమర్స్‌కు చెక్‌ పెట్టబోతున్నారా?

Highlights

KTR: ఇదిగో అదిగో అన్నారు. వచ్చే దసరాకే ముహుర్తం అన్నారు.

KTR: ఇదిగో అదిగో అన్నారు. వచ్చే దసరాకే ముహుర్తం అన్నారు. లేదు లేదు హుజూరాబాద్‌ బైపోల్‌ తర్వాత పీఠమెక్కడం ఖాయమన్నారు. ప్రమోషన్‌ పక్కాగా చెప్పుకున్నారు. కానీ సీన్‌ ఒక్కసారిగా సితారైంది. అనూహ్యంగా మారిపోయింది. 2023 ఎన్నికలయ్యే వరకూ నో సీఎం ఛేంజ్‌ అన్న సంకేతాలు వచ్చేశాయ్‌. మరి ఇన్నాళ్లూ ఊరిస్తున్న సీఎం పదవి కేటీఆర్‌కు ఇంకెంత దూరం? అప్పుడో, ఇప్పుడో అన్న ప్రచారానికి ఎండ్‌ కార్డ్‌ అలా ఎందుకు పడింది?

ఎవరు అవునన్నా... కాదన్నా గులాబీ దళపతి మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే. అందులో నో డౌట్‌. కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ వస్తుందని జరుగుతున్న ప్రచారం అంతా రూమర్సేనని తేలిపోయింది. టీఆర్ఎస్‌కు అధ్యక్షుడిగా కేసీఆరే ఉండాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు, ఇతర రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో అన్ని రకాల రూమర్స్‌కి గులాబీ బాస్‌ అలా చెక్‌ పెట్టినట్టయింది.

తెలంగాణలో తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమ సంస్థగా నడిచిన టీఆర్ఎస్ తెలంగాణ సాధనతో ఫక్తు రాజకీయ పార్టీగా అవతరించింది. సాధించిన తెలంగాణలో రెండుసార్లు అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ముచ్చటగా మూడోసారి పాగా వేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ట పరిచే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ప్రతి రెండేళ్లకోసారి పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవడం ఆనవాయితీ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీల నియామకం పూర్తయిన తర్వాత అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అలా కారు పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఈనెల 25వ తేదీన జరగనుంది.

2017లో చివరిసారిగా ఎన్నికలు జరగ్గా, వరుసగా 8వసారి కేసీఆరే ఏకగ్రీవంగా అధ్యక్షుడయ్యారు. 2019లో పార్లమెంట్ ఎన్నిక‌లు, కిందటేడాది క‌రోనా వల్ల పార్టీ ప్లీన‌రీ నిర్వహించ‌లేదు. ఈసారి కరోనా పరిస్థితుల కాస్త సద్దుమణిగడంతో హైటెక్స్‌లో పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో ఆహ్వానించిన టీఆర్ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారు. ఇందులో, తొమ్మిదోసారి టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్‌నే బలపరుస్తూ పార్టీ సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. నామమాత్రంగా అధ్యక్ష పదవి కోసం 22వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23న స్క్రూటినీ ఉంటుంది. 25న టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ జరుగనుంది. ఆ ప్లీనరీలోనే అధ్యక్షుడిని ప్రకటిస్తారు.

మామూలుగా అయితే ఈ ఎన్నిక అత్యంత సాఫీగానే జరిగిపోతుంది. కానీ గులాబీ బాస్ ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటారా అని ఆలోచన చేసిన వారికి చెక్ పెట్టేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కూడా పార్టీ అధ్యక్షుడిగానే ఎదుర్కోబోతున్నట్టు కేసీఆర్‌ పూర్తి క్లారిటీ ఇచ్చారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ను ప్రెసిడెంట్‌ చేస్తారన్న ఊహాగానాలకు తెరదించారట. ఇప్పటికే కేటీఆర్‌ను సీఎం చేయాలని ఆయన అభిమానులు పెద్దఎత్తున కోరుకుంటున్నారు.

ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా చాలాసార్లు చాలారకాలుగా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడం అనవసరం అన్న అంచనాతో ఉన్న కేసీఆర్‌ అంతా తానై పార్టీని ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడపాలని భావిస్తున్నారట. రానున్న రోజుల్లో మరోమారు పార్టీని విజయవంతంగా ముందుకు నడిపి తెలంగాణలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాతనే, కేటీఆర్ విషయంలో గులాబీ బాస్ కీలక నిర్ణయం తీసుకునే ఆలోచన ఉందని పార్టీ సీనియర్లు అంటున్నారు. అప్పటివరకు సీఎం కేసీఆర్ అప్పగించే కీలక పనులను నిర్వహిస్తూ తన సామర్థ్యాన్ని మరింతగా నిరూపించుకునే పనిలో ఉంటారట కేటీఆర్‌.

మొత్తంగా చూస్తే ఇప్పుడున్న ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల్లో పార్టీ, ప్రభుత్వ పగ్గాలు కేటీఆర్‌కు అప్పగించడం కేసీఆర్‌కు ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. తొమ్మిదోసారి కూడా పార్టీ అధ్యక్షుడిగా తానే ఉండేందుకు సిద్ధమైన అధినేత తన మాస్టర్‌ ప్లాన్‌‌తో కారును రీడిజైన్‌ చేయబోతున్నారట. మొత్తంగా వాట్ నెక్స్ట్ అనే విష‌యంలో కేసీఆర్ చాలా క్లారిటీగా ఉన్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మరి కేసీఆర్‌ మైండ్‌లో ఉన్న ఆ మాస్టర్‌ ప్లాన్‌ ఏంటో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories