Revanth Reddy: పీసీసీ న్యూ బాస్‌కు స్వాగతం పలుకుతున్న సవాళ్లేంటి?

Revanth Reddy
x

Revanth Reddy: పీసీసీ న్యూ బాస్‌కు స్వాగతం పలుకుతున్న సవాళ్లేంటి?

Highlights

Revanth Reddy: ఎప్పుడు పార్టీలోకి వచ్చామన్నది కాదన్నయ్యా పీసీసీ పీఠం దక్కించుకున్నామా లేదా అన్నట్టుంది కాంగ్రెస్‌లో రేవంత్‌ జర్నీ.

Revanth Reddy: ఎప్పుడు పార్టీలోకి వచ్చామన్నది కాదన్నయ్యా పీసీసీ పీఠం దక్కించుకున్నామా లేదా అన్నట్టుంది కాంగ్రెస్‌లో రేవంత్‌ జర్నీ. అలా కండువా మార్చాడు ఇలా సింహాసనం ఎక్కేశాడు మరి ప్రెసిడెంట్‌గా డే వన్‌‌...డేరింగ్‌గా ఓపెన్‌ అయినట్టేనా?

రేవంత్‌ రెడ్డి. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ న్యూ బాస్. అనుకున్నట్టుగానే రేవంత్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, అట్టహాసంగా సాగింది. తెలంగాణలో మరోసారి కాంగ్రెస్‌పై చర్చ జరిగేలా, ఈ ప్రోగ్రాం దుమ్మురేపింది. పెద్దమ్మ గుడిలో పూజలు, నాంపల్లి దర్గా సందర్శన, గాంధీభవన్‌ వరకు ర్యాలీ, ఉత్తమ్‌ నుంచి బాధ్యతల స్వీకరణ, సంతకాలు, ఆ తర్వాత అధ్యక్షునిగా తొలి ప్రసంగం. పలు జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, నేతలతో గాంధీభవన్‌ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కళకళలాడినట్టయ్యింది. రేవంత్ రెడ్డి నూతన ప్రస్థానం మొదలైంది. మరి చచ్చీ, చెడి, మంచం పట్టిన హస్తాన్ని తిరిగి లేపే సత్తా రేవంత్‌కు వుందా? కార్యకర్తలు, హంగామా, విజిల్స్, నినాదాలు, జయహో ద్వానాలు సరే, పార్టీ పునరుజ్జీవానికి రేవంత్‌ దగ్గర ప్రణాళిక వుందా?

రేవంత్‌లాగే ఆయన రాజకీయ ప్రస్థానమూ మెరుపు వేగమే. స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా గెలవడం, తర్వాత టీడీపీలో చేరిక, ఎమ్మెల్సీ, స్థానికేతరుడైనా కొడంగల్‌ నుంచి గెలిచారు. కాంగ్రెస్‌లో చేరారు. అదే కొడంగల్‌ నుంచి ఓడారు. తనకెలాంటి సంబంధంలేని మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచి, గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చారు. దశాబ్దాల ఉద్దండులున్నా, కాంగ్రెస్‌లో చేరిన కొద్దికాలంలోనే పీసీసీ పీఠాన్ని ఒడిసిపట్టారు. తన ప్రమాణస్వీకారాన్ని అత్యంత ఆర్భాటంగా నిర్వహించి, టాక్‌ ఆఫ్ ది టౌన్‌ అయ్యారు. మొన్నటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క.

రేవంత్‌ రెడ్డి అంటే దూకుడు. జజ్జనకరి జనారే అన్నట్టుగా ఊగిపోతారు. చుట్టూ వున్నవారిని ఊపేస్తారు. మాటలతో కనికట్టు చేస్తారు. సబ్జెక్టు ఏదైనా ఇరగదీస్తారు. ప్రత్యర్థులను చీల్చిచెండాడే విద్యలో రెండాకులు ఎక్కువే చదివారు. ధర్నాలు, దీక్షల కోసం గోడలెక్కుతారు. పరుగులు పెడతారు. పిట్టకథలతో ప్రసంగాలను రక్తికట్టిస్తారు. ఆవేశం రగిలే ప్రసంగాలనూ దంచికొడతారు. సందర్భం ఏదైనా అనుకూలంగా మలచుకుంటారు. తన ప్రమాణస్వీకారం సమయంలో దంచికొట్టిన వానకు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పేశారు రేవంత్.

రేవంత్‌ రెడ్డికి పర్సనల్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆ‍యన ప్రసంగాలు వినడానికి చాలామంది యువత ఉత్సాహపడతారు. ప్రమాణస్వీకారానికి కూడా తండోపతండాలుగా అభిమానులు వచ్చారు. అదేపనిగా రేవంత్ జైజై అంటూ నినాదాలు చేశారు. అసలే తనకు పీసీసీ పీఠం పట్ల సీనియర్లు కుతకుత రగిలిపోతుంటే, వ్యక్తిగత జయజయధ్వానాలతో వాళ్లు మరింత ఉడికిపోతారని భావించిన రేవంత్, పర్సనల్ స్లోగన్స్ వద్దు అని సుతిమెత్తగా ఫ్యాన్స్‌ను హెచ్చరించి, ఇటు సీనియర్లు, అటు హైకమాండ్‌నూ మెప్పించే ప్రయత్నం చేశారు.

రేవంత్‌ ప్రసంగంలో రామాయణం కూడా ప్రతిధ్వనించింది. లంకలో బందీ అయిన సీతమ్మను విడిపించేందుకు శ్రీరాముడికి వానర సైన్యం ఎలా తోడ్పడిందో, ఫాంహౌజ్‌ చెరలో వున్న తెలంగాణ తల్లినీ విడిపించేందుకు, కాంగ్రెస్ కార్యకర్తలు వానర సైన్యంలా కష్టపడాలన్నారు రేవంత్.

మొత్తానికి హోరెత్తే జడివానలో సైతం తన తొలి ప్రసంగం హోరెత్తించారు రేవంత్‌ రెడ్డి. మాట మాటలో సోనియా, రాహుల్ పేర్లు ప్రస్తావిస్తూ, మాణిక్కం ఠాగూర్‌కు కృతజ్నతలు చెబుతూ, సీనియర్ల పేర్లు ప్రస్తావిస్తూ, టీఆర్ఎస్, బీజేపీలను తూర్పారబడుతూ, ఇక మరో సమరానికి సిద్దంకావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరి పట్టాభిషేకంలో పూలు కురిసినట్టు రేవంత్‌ ముందు పూలబాటేనా? ముళ్లబాటనా? కొత్త పీసీసీ అధ్యక్షుడి ముందున్న సవాళ్లేంటి? అటు పార్టీపరంగా, ఇటు ప్రభుత్వపరంగా ఎలాంటి ఛాలెంజెస్‌ వెల్‌కమ్‌ చెబుతున్నాయి? రెండు అధికార పార్టీలను ఢీకొట్టేందుకు ఎలాంటి ప్రణాళికలను పట్టాలెక్కిస్తారు?

రేవంత్‌ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పట్టాభిషేక కార్యక్రమం అదరహో అనిపించింది. కానీ అసలు కథ ముందుంది అంటున్నారు రాజకీయ పండితులు. పూలబాట కాదు, ముళ్లబాట తప్పదంటున్నారు. స్వపక్షం నుంచి, ప్రత్యర్థి పక్షం నుంచి, అటు తనను ఓవర్‌ టేక్ చేసేందుకు పరుగులు పెడుతున్న కమలం, ఇలా అనేక ఛాలెంజెస్ రేవంత్‌ ఫేస్‌ చెయ్యాల్సి వుంటుందంటున్నారు. ఇంతకీ ఏంటా సవాళ్లు?

అఖిల భారత కాంగ్రెస్. శతాధిక పార్టీ. స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన రాజకీయ శక్తి. దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ. బీజేపీ, లేదా ప్రాంతీయ పార్టీల్లా, కాంగ్రెస్‌లో భావప్రకటనా సంకెళ‌్లు వుండవు. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. సొంత పార్టీని కూడా తిట్టొచ్చు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ. అదే దాని బలం, బలహీనత కూడా. రేవంత్‌ రెడ్డికి కూడా అదే మొదట సవాల్‌ విసరబోతోంది. ఎందుకంటే, శతాధిక కాంగ్రెస్‌లో దశాబ్దాల అనుభజ్ణులే ఎక్కువ. ఎవరికి వారు ముఖ్యమంత్రి అభ‌్యర్థులుగా ఫీలవుతుంటారు. ప్రతి సీనియర్‌కూ ఒక గ్రూపు. జిల్లా, మండలం, గ్రామస్థాయిలో రకరకాల గ్రూపులు, కులాల గుంపులు, మతాల బృందాలు. డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచ్‌లు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కలగూర గంప. ప్రచ్చన్నయుద్ధాలు నిత్యకృత్యం. ఇలాంటి కలగూరగంపలాంటి కాంగ్రెస్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారు? అందరూ తన మాట వినేలా ఎలా చేసుకుంటారన్నది నిజంగా రేవంత్ ముందున్న పెను సవాలు.

రేవంత్‌కు మొట్టమొదటి సవాల్‌ పార్టీ నుంచే. తెలుగుదేశం నుంచి వచ్చాడు, అనేక కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, అలాంటి వ్యక్తికి పీసీసీ ఇవ్వకూడదని నెలల పాటు కొందరు నాయకులు భీష్మించుకు కూర్చున్నారు. అడ్డంకులు సృష్టించారు. కానీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఫైనల్ నిర్ణయం ప్రకటించారు. దీంతో అందరూ గప్‌చుప్. రేవంత్‌ రెడ్డి కూడా తనను వ్యతిరేకించినవారిలో చాలామందిని కలిశారు. శ్రీధర్‌ బాబు, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శశిధర్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కలిసి మాట్లాడారు. ఎవరైతే వ్యతిరేక గళం వినిపించారో, వారిని కలిశారు, ఆలింగనం చేసుకున్నారు, ఇక కలిసి సాగుతారు, సమరశంఖం పూరిస్తారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, కాంగ్రెస్‌లో అందరూ కలిసివున్నట్టే వుంటారు, కానీ కడుపులో కత్తెర్లు దాచుకుంటారని, ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటారు. రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారమే అందుకు నిదర్శనం. చాలామంది కీలక సీనియర్ నేతలు, ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. మరి వీరి మనసులు కలిసినట్టా? కలవనట్టా? వీరందర్నీ కలుపుకుపోవడం రేవంత్‌కు ఛాలెంజే.

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కీలకం. అప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. కారు ఊపులోనూ రెండు పార్లమెంట్‌, ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ ఇక్కడ. అలాంటి జిల్లాలో కీలకమైన కోమటిరెడ్డి బ్రదర్స్‌, రేవంత్‌కు వ్యతిరేక గళం వినిపించారు. రేవంత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెం‌‌ట్‌ కావడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ, రేవంత్‌ను విమర్శించారు. తననెవరూ కలవొద్దని, పరోక్షంగా రేవంత్‌కు చెప్పినట్టయ్యింది. అటు తమ్ముడు రాజగోపాల్ రెడ్డి సైతం రేవంత్‌‌తో కలిసి సాగడంపై అనుమానాలు. మరి కాంగ్రెస్‌కు కీలకమైన నల్గొండలో, కోమటిరెడ్డి బ్రదర్స్‌ మనసు మార్చడం, తనను అంగీకరించేలా మెప్పించడం రేవంత్‌కు సంకటమే.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎంత చెప్పుకున్నా, రాష్ట్రాన్ని తెచ్చుకున్న పార్టీగా టీఆర్ఎస్‌నే గుర్తించారు జనం. స్టేట్‌ బైఫర్‌కేషన్‌ క్రెడిట్‌ను జనంలోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. టీఆర్ఎస్ విసిరిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు కారెక్కేశారు. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లాస్థాయి, మండలస్థాయి నాయకులు చాలామంది గులాబీ గూటికి చేరారు. రాష్ట్రస్థాయి నేతలు కమలం కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వారిని రీప్లేస్ చెయ్యడం, ప్రత్యామ్నాయ ముఖాలను గుర్తించడం రేవంత్‌కు పరీక్ష. ఎమ్మెల్యే స్థాయి వున్న నేతలను అన్వేషించాలి. వీలైతే టీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిన నేతలను ఘర్‌ వాపసీ చేయించాలి. క్షేత్రస్థాయిలో కొత్త నాయకులను తయారు చెయ్యాలి. సామాజికీ సమీకరణాలు పక్కాగా చూసుకోవాలి. లీడర్లు ఎంతమందిపోయినా, కాంగ్రెస్‌కు గ్రౌండ్‌లెవల్లో క్యాడర్‌ మాత్రం వుంటుంది. అందులోంచి కొత్తతరం వారికి అవకాశాలివ్వాలి. కోల్డ్‌వార్‌ తలెత్తకుండా ఛాన్స్ ఇవ్వాలి. ఈ తంతులో కొంత మిస్‌ హ్యాండిల్‌ అయినా, క్యాడర్‌ గోవింద. పీసీసీకి మరో కొత్త కమిటీ వెయ్యాలి. అందులో సీనియర్ల అనుచరులకు చోటు కల్పించాలి. లేదంటే ఇబ్బందే. ఇది రేవంత్‌కు అగ్ని పరీక్షే.

ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజురాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమవుతోంది. ఈటల బీజేపీకి వెళ్లారు. దీంతో ఈటల, బీజేపీకి బైపోల్‌ జీవన్మరణ పోరు. అటు అధికార టీఆర్ఎస్‌కు సైతం, హుజురాబాద్‌ అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్‌ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోవడం, హుజురాబాద్‌ ఉప ఎన్నిక రూపంలో అతిపెద్ద సవాల్ ఎదురైనట్టయ్యింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌కు ఇది తొలి ఎన్నిక. తనకు రాష్ట్రమంతా క్రేజ్‌ వుందని, తాను బలమైన నాయకుడినని నిరూపించుకోవాలంటే, హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకుని తీరాల్సిందే. గెలిస్తే మాత్రం రేవంత్‌ రేంజ్‌ మరో రేంజ్‌లో. ఓడితే మాత్రం, స్వపక్ష, విపక్ష ప్రత్యర్థుల నుంచి దెప్పిపొడుపులు కమాన్‌ అంటాయి.

పార్టీ రాష్ట్ర అధ‌్యక్షుడిగా బాధ్యతల చేపట్టారు కాబట్టి, క్షేత్రస్థాయిలో రేవంత్‌ పర్యటించడం ఖాయం. హస్తం పార్టీ హస్త రేఖలు మార్చాలంటే గ్రామస్థాయిలో ఒళ్లు వంచాల్సిందే. వినూత్న కార్యక్రమాలతో జనంలోకి వెళ్లాల్సిందే. ప్రభుత్వంపై నిరసనలకు క్యాడర్‌ను పరుగులు పెట్టించాల్సిందే. అందులో భాగంగా తాను సైతం పాదయాత్ర చెయ్యాలని రేవంత్‌ భావిస్తున్నారట. దీని ద్వారా గ్రామగ్రామానికి తిరిగి, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారట. మరి పాదయాత్రకు నీరాజనం పట్టేందుకు సీనియర్లు సహకరిస్తారా? తమ నియోజకవర్గంలోకి న్యూ బాస్ వచ్చినప్పుడు స్వాగతాలు పలుకుతారా?

ఓటుకు నోటు కేసు ఇఫ్పటికీ, ఎప్పటికీ రేవంత్‌ రెడ్డిని వెంటాడుతూనే వుంటుంది. అది టీఆర్‌ఎస్‌ చేతిలో అస్త్రమే. రేవంత్‌పై వేలాడుతున్న కత్తే. ఎప్పుడు కేసును తిరగదోడుతుందో తెలీదు. పార్టీ ఫిరాయించిన నేతలను రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్‌ అన్న వెంటనే, మీడియా ముందుకొచ్చిన నేతలు, మొదట లేవనెత్తింది ఓటుకు నోటు కేసునే. ఈ కేసును రేవంత్‌ ఎలా ఎదుర్కొంటారు? జనంలో ప్రత్యర్థులు విసిరే ఈ ఆయుధాన్ని ఎలా తిప్పికొడతారన్నది పరీక్షే. కేవలం కేసుల పరంగానే కాదు, వలసలను ప్రోత్సహించి రేవంత్‌ను దెబ్బకొట్టేందుకూ అధికార పార్టీ ఎత్తులు వెయ్యడం ఖాయం. మరి ఉన్నవారిని ఎలా కాపాడుకుంటారన్నది కూడా సవాలే.

టీఆర్ఎస్‌కు ప్రత్నామ్నాయం తానేనంటోంది బీజేపీ. బండి సంజయ్ నేతృత్వంలో ఇప్పటికే కమలం అక్కడక్కడా వికసించింది. అనేక చోట్ల భావోద్వేగాలను మండిస్తూ బలపడే ప్రయత్నం చేస్తోంది. అనేకమంది కాంగ్రెస్ నేతలను చేర్చుకుంది. బీజేపీ బలపడితే, తెలంగాణాలో ట్రయాంగిల్ వారే. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ కలిసే ప్రసక్తేలేదు. దీంతో ప్రతిపక్ష ఓట్లు చీలి, అంతిమంగా టీఆర్ఎస్‌కే లబ్ది. మరి ఓట్లు చీలకుండా, బీజేపీ బలడపకుండా, రెండు అధికార పార్టీల మధ్య కాంగ్రెస్‌ను మాత్రమే ప్రత్యామ్నాయంగా, జనానికి నమ్మకం కలిగించడం రేవంత్‌కు అసలుసిసలు పరీక్ష.

ఇన్ని సవాళ్లు, ఇన్ని సమస్యలు, గట్టి ప్రత్యర్థుల నడుమ రేవంత్‌ రెడ్డి, పీసీసీ బాధ్యతలు చేపడుతున్నారు. ఇల్లు అలకగానే పండగకాదన్నట్టుగా, ముందుంది ముసళ్ల పండుగ అని అనేక ఛాలెంజెస్ గుర్తు చేస్తున్నాయి రేవంత్‌కు. మరి అలకలు, చీలికలు, పేలికలు, పవర్‌సెంటర్లున్న కాంగ్రెస్‌లో అందర్నీ కలుపుకుపోయే వ్యూహం సక్సెస్‌ఫుల్‌గా అప్లై చేస్తారా? ఇటు రెండు అధికార పార్టీలను ఢీకొట్టి తిరిగి కాంగ్రెస్‌ను ఆల్టర్నేటివ్‌గా నిలబెడతారా? వెయిట్‌ అండ్ సీ.

Show Full Article
Print Article
Next Story
More Stories