పాపం చకిలం అనిల్‌ అని ఎందుకంటున్నారు?

పాపం చకిలం అనిల్‌ అని ఎందుకంటున్నారు?
x
Highlights

ఆయన కుటుంబ రాజకీయ చరిత్ర ఘనం. పీవీ, వైఎస్‌ వంటి హేమాహేమీలతో వారి అనుబంధం. అదే గ్రాండ్ పొలిటికల్ హిస్టరీ చూసి, గులాబీ అధినేత, ఆయనను పార్టీలోకి అంతే...

ఆయన కుటుంబ రాజకీయ చరిత్ర ఘనం. పీవీ, వైఎస్‌ వంటి హేమాహేమీలతో వారి అనుబంధం. అదే గ్రాండ్ పొలిటికల్ హిస్టరీ చూసి, గులాబీ అధినేత, ఆయనను పార్టీలోకి అంతే గ్రాండ్‌గా ఆహ్వానించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి, నేటి వరకు ఆయన అదే పార్టీలో వున్నారు. ఎమ్మెల్సీనో, రాజ్యసభ ఎంపీనో చేస్తారని ఆయన వెయిట్‌ చేస్తూనే వున్నారు. కానీ ఆ పదవీయోగం మాత్రం ఇప్పటిదాకా రాలేదు. అయినా ఎదురుచూస్తునే వున్నారు. ఇంతకీ ఎవరాయన?

చకిలం అనిల్ కుమార్ అలియాస్ అనిల్ పంతులు. అనిల్ తండ్రి, చకిలం శ్రీనివాస్ రావు, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అనుచరునిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. శ్రీనివాసరావు కాంగ్రెస్‌లో ఉంటూ, అప్పటి రాజకీయ ప్రత్యర్ధులకు పగటి పూటే చుక్కలు చూపించారని అంటారు. దీంతో స్వతహాగానే, తండ్రి శ్రీనివాస రావు అడుగు జాడల్లో అనిల్ కుమార్ పంతులు రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌లో తండ్రికి తోడుగా పనిచేశారు. అయితే తండ్రి శ్రీనివాస రావు పంతులు కాలం చేశాక, కొన్నాళ్ళు రాజకీయాల్లో అంతంతమాత్రంగా ఉన్న అనిల్ కుమార్, 2001లో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అదేపార్టీలోనే ఉన్నారు.

తండ్రి శ్రీనివాస రావుతో కేసీఆర్‌కు సాన్నిహిత్యం, మంచి సంబంధాలు అనిల్ కుమార్‌ను టిఆర్ఎస్ పార్టీలో చేరేలా చేశాయి. దీంతో 2001 నుంచి 2014 వరకు నల్గొండ నియోజకవర్గం బాధ్యతలు నిర్వహించారు చకిలం అనిల్ కుమార్. సుదీర్ఘ కాలం నియోజకవర్గంలో, టిఆర్ఎస్ కోసం ఆర్ధికంగా చేయుతనిచ్చారు. కానీ 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందని ఆశించినా, దక్కలేదు. వచ్చే ప్రభుత్వంలో చకిలం అనిల్‌కు మంచి అవకాశం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారట.

అప్పటి నుంచి పార్టీ కోసం ఉమ్మడి జిల్లాలో, లాయల్‌గా పనిచేస్తున్న నేతల్లో చకిలం అనిల్ కుమార్ ఒకరు. తీరా 2018 ఎన్నికల్లో కూడా చకిలంకు నిరాశే ఎదురైంది. నల్గొండ టికెట్ ఆశించినప్పటికీ, ఇటు అనిల్ కుమార్, దుబ్బాక నర్సింహా రెడ్డిని కాదని కంచర్ల భూపాల్ రెడ్డికి ఇచ్చారు. ఆ సందర్భంలో కూడా చకిలంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారట. దీంతో ఆ ఎన్నికల్లో కూడా చకిలం అనిల్ కుమార్, కంచర్ల కోసం పనిచేశారట. ‌తీరా ఎన్నికలు ముగిసి ఎమ్మెల్యేగా‌ భూపాల్ రెడ్డి ఉన్నా, తనకెప్పుడు ఎమ్మెల్సీ పదవి అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారట చకిలం అనిల్ కుమార్.

అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోవడం, ఇస్తానన్న పదవి రాకపోవడంతో, తన అనుచరుల వద్ద, తన ఆర్థిక కష్టాలు, రాజకీయ ఇబ్బందులు చెప్పుకోవడమే తప్ప, చేసేదేం లేదని వాపోతున్నారట అనిల్ కుమార్. తన సామాజిక వర్గం ఓట్లను బూచిగా చూపి, పదవి ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అంటూ అనుచరగణం వద్ద వాపోతున్నారట. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తనకు, పదవులు రాకపోవడం, నిన్న గాక‌ మొన్న వచ్చిన నేతలకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా మంచి పదవులు వచ్చాయని, తనకెపుడు పదవి అంటూ టిఆర్ఎస్ అధినేత ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారట చకిలం అనిల్ కుమార్.


Show Full Article
Print Article
Next Story
More Stories