By-Elections: నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నిక వేడి

By-Elections Heat In Nagarjuna Sagar
x

కాంగ్రెస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

By-Elections: హాలియాలో కాంగ్రెస్‌ జనగర్జన * నాగార్జునసాగర్​కు తెరాస చేసింది శూన్యం: ఉత్తమ్‌

By-Elections: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తమ శ్రేణుల్ని సమాయత్తం చేస్తోంది. కాంగ్రెస్ పని అయిపోయింది అన్న ప్రచారాలకు తెరపడేలా.... నేతలు మాటల సమరానికి తెరలేపారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వ్యూహ, ప్రతి వ్యూహాలతో జానా రెడ్డి ఎన్నికల రణరంగంలో దూకుడు పెంచారు. హాలియా సభ నుంచి నేరుగా టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు.

నాగార్జునసాగర్‌ స్థానంలో తిరిగి పాగా వేయాలనే లక్ష్యంతో సాగుతున్న కాంగ్రెస్‌.. అందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. రెణ్నెళ్ల నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న జానారెడ్డి.. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ కూడగడుతున్నారు. అందరికంటే ముందుగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కాంగ్రెస్‌ జానారెడ్డిని గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. రాజకీయాల్లో విశేష అనుభవమున్న జానా ఇప్పటికే క్షేత్రస్థాయి నాయకులందర్నీ కలుసుకున్నారు. పార్టీ సీనియర్ నేతల్ని రప్పించి దిశానిర్దేశం చేసేలా.. శనివారం బహిరంగసభ నిర్వహించారు. నాగార్జునసాగర్​ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు అందించామని.. శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా సమారు 3 లక్షల ఎకరాలకు సాగు నీరందించామన్నారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్​ను గెలిపించాలన్నారు.

2023లో ప్రభుత్వ మార్పునకు నాగార్జునసాగర్‌లోనే నాంది పడాలన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ చేసింది శూన్యమని విమర్శించారు. ఇక్కడ బీజేపీకు డిపాజిట్‌ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడకు వెళ్లి వరాలు కురిపించి ప్రజలను మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని ఉత్తమ్​ చురకలంటించారు. ఈ ఆరేళ్ల కాలంలో సాగర్‌కు టీఆర్ఎస్‌ ఏం చేసిందో చెప్పాలని సవాల్‌ విసిరారు.

మూణ్నాలుగు నెలలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉప ఎన్నిక కోలాహలం కొనసాగనుంది. ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని ఉత్సాహంలో ఉన్న టీఆర్ఎస్‌ సాగర్‌నూ మళ్లీ నిలబెట్టుకోవాలని కసరత్తు చేస్తోంది. సాగర్‌లో సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. దీటైన పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ సాగర్ ఉపఎన్నిక ప్రచారాన్ని ఉధృతం చేశాయి. చూడాలి సాగర సమరం ఎవరికి వరంగా మారుతోందో.

Show Full Article
Print Article
Next Story
More Stories