రేపే మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్‌..!

by election counting tomorrow
x

రేపే మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్‌..!

Highlights

* రేపు ఉ.8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం.. స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గర సీఆర్పీఎఫ్‌ బలగాలతో భద్రత

Munugodu Bypoll: నవంబర్‌ 4 రాష్ట్రంలో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6న నల్లగొండ శివారు ఆర్జాలబావి స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాములో లెక్కింపు జరుగనున్నది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్‌ హాళ్లలో వసతుల కల్పన పూర్తయ్యాయి. ఒకే హాల్‌లో 21 టేబుళ్లపై 15 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు మొదలయ్యే కౌంటింగ్‌ మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం జరిగిన ఉపఎన్నికలో మొత్తం 2,41,855 ఓట్లకుగాను 2,25,192 ఓట్లు (93.16%) పోలైన విషయం తెలిసిందే.

పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపర్చారు. వీటి వద్ద రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి నేతృత్వంలో లెక్కింపు అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. కౌంటింగ్‌ టేబుళ్ల వద్ద అభ్యర్థులు లేదా పార్టీ ఏజెంట్లు కూర్చోవడానికి అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు అభ్యర్థులు లేదా ఎన్నిక ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లు తెరుస్తారు. తొలుత ఆర్వో టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఏడు మండలాల్లో మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాల్లో 298 ఈవీఎంలను వినియోగించారు. గంటకు 3 నుంచి 4 రౌండ్ల ఫలితాలు వెల్లడి కానుండగా, మధ్యాహ్నం 1 గంటకల్లా కౌంటింగ్‌ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, రిటర్నింగ్‌ అధికారి రోహిత్‌సింగ్‌తోపాటు కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్‌ కొనసాగనున్నది. లెక్కింపు నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయగా 24గంటల పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతున్నది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలి రౌండ్‌ చౌటుప్పల్‌ మండలం నుంచి మొదలుకానున్నది. తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల లెక్కింపు జరుగనున్నది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్‌ కేంద్రాల చొప్పున కౌంటింగ్‌ చేపడుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories