Loksabha Election 2024: ఎంపీ ఎన్నికల్లో కారు పార్టీ కొత్త లక్ష్యం

BRS Plans for Huge Turnout of Votes for Party Rather Seats
x

Loksabha Election 2024: ఎంపీ ఎన్నికల్లో కారు పార్టీ కొత్త లక్ష్యం

Highlights

Loksabha Election 2024: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి.

Loksabha Election 2024: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుకోవడం కోసం గులాబీ పార్టీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా ఓట్లను సాధించడం లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇక మిగిలిన వాటిలో బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు లోక్ సభ స్థానాల్లో విజయం సాధించాయి.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఆ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమరానికి సిద్ధమైంది. అధికారం కోల్పోయాక జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా ఓట్లపైనే బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొందింది. 39.40 శాతం ఓట్లను సాదించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో గెలుపొంది... 37.35 శాతం ఓట్లను సాధించింది. ఇలా రెండు పార్టీల మధ్య 1.85 శాతం ఓట్ల తేడా ఉంది. 92 లక్షల 35 వేల 833 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే... బీఆర్ఎస్ పార్టీకి 87 లక్షల 53 వేల 956 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 4 లక్షల 81 వేల 867 ఓట్లు తక్కువ వచ్చాయి. దీంతో లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లపైనే దృష్టి పెట్టింది బీఆర్ఎస్.

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో గెలిచింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 76 లక్షల 96 వేల 848 ఓట్లు వచ్చాయి. 41.71 శాతం ఓట్లను సాధించింది బీఆర్ఎస్ పార్టీ. ఇక బీజేపీ నాలుగు లోక్ సభ స్థానాల్లో గెలిచింది. 36 లక్షల 22 వేల 173 ఓట్లు వచ్చాయి. 19.65 శాతం ఓట్లను సాధించింది. మరి కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో గెలిచి 54 లక్షల 96 వేల 686 ఓట్లు వచ్చాయి. 29.79 శాతం ఓట్లను సాధించింది. దీంతో ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంపై దృష్టి సారించింది.

లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల తరపున గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్రను చేపట్టారు. రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ జరగ్గా లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది.

అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలను ఆర్ధిక భారం వెంటాడుతోందట. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండటంతో అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు కేసీఆర్ ఫైనాన్స్ చేసినా ఓటమిని ముందే గమనించి డబ్బులు ఖర్చు చేయలేదని కొన్ని నియోజకవర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులకు కేసీఆర్ ఫైనాన్స్ చేసినప్పటికీ ఖర్చు చేయడం లేదని గులాబీ కార్యకర్తల్లో టాక్ వినిపిస్తోంది. ఎండలో అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నప్పటికీ తమను పట్టించుకోవడం లేదని కేడర్ గుర్రుగా ఉందట. అధికారం కోల్పోయి ఆరు నెలలు కాక ముందే ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే తమ పరిస్థితి ఏంటని కేడర్ ప్రశ్నిస్తోంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరు ఇలానే ఉంటే... లోక్ సభ ఎన్నికల్లో ఫైనాన్స్ గండం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తుందనే చర్చ నడుస్తోంది.

ప్రస్తుత పరిస్థితిలో పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల కంటే ఓటు బ్యాంకు కాపాడుకోవడంపై దృష్టి సారించారట గులాబీదళం. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓట్లు పదిలం చేసుకునే పనిలో పడ్డారట. చూడాలి మరి గులాబీ పార్టీ ఓటు బ్యాంక్ ఎంత మేరకు పని చేస్తుందో. బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories