Parliament Elections: ఆరుపై.. కారు గురి.. పార్లమెంట్‌ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్‌

BRS Focus On Parliament Elections
x

Parliament Elections: ఆరుపై.. కారు గురి.. పార్లమెంట్‌ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్‌

Highlights

Parliament Elections: బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించే దిశగా కారు పార్టీ అడుగులు

Parliament Elections: అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు తలకిందులై అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్‌.. పార్లమెంట్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు తీవ్ర కసరత్తు చేస్తోంది కారు పార్టీ. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని పక్కా ప్రణాళికను రచిస్తోంది. అయితే రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాలుండగా.. బీఆర్ఎస్‌ పార్టీ కొన్ని స్థానాలపైనే ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో హైదరాబాద్‌ని మినహాయిస్తే 16 స్థానాలుంటాయి. బిఆర్ఎస్ 2014లో 11 స్థానాల్లో... 2019లో 9 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఆ రెండు సందర్భాల్లో మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు గులాబీ పార్టీ చేతిలో ఉన్నాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

అధికారం దూరం కావడం.. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే కారు పార్టీ ప్రభావం ఉండటంతో ఇప్పుడు గెలుపు అంత ఈజీ కాదు అనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం.. బీజేపీ ఓటు బ్యాంకు పెరగడం బీఆర్ఎస్‌కు సవాల్‌గా మారుతున్నాయి. దీంతో తమ ప్రభావం ఉన్న స్థానాల్లో గెలుపుపైనే అధికంగా ఫోకస్ చేస్తోంది బీఆర్ఎస్.

ఈసారి జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీనే ఉండబోతోంది. దీంతో ట్రయాంగిల్ ఫైట్‌ను తట్టుకుని గెలిచేలా గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయని ఓటర్లు సానుభూతితో ఈసారి తమకు ఓట్లు వేస్తారని అంచనాలో ఉంది కారు పార్టీ. అయితే ప్రధానంగా ఆరు కీలక స్థానాల్లో బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తామని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మిగిలిన పది స్థానాల్లో పోటీని సెకండ్ ఆప్షన్‌గా భావిస్తోంది బీఆర్ఎస్‌.

బీఆర్ఎస్‌ టార్గెట్‌గా పెట్టుకున్న ఆరు స్థానాల్లో మెదక్‌ ఒకటి. మొదటి నుంచి గులాబీ పార్టీకి మెదక్ కంచుకోటగా ఉంది. ఇక మల్కాజ్‌గిరి పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఆరు స్థానాలు కైవసం చేసుకోవడంతో ఈ రెండు స్థానాల్లో గెలుస్తామనే కాన్ఫిడెన్స్‌లో ఉంది కారుపార్టీ.

మొదటినుంచి ఉద్యమ పార్టీగా వరంగల్‌లో పట్టు ఉండటంతో.. ఆ స్థానంపై కూడా ఆశలు పెట్టుకుంది బీఆర్ఎస్. ఈ నాలుగు స్థానాలతో పాటు చేవెళ్ల, కరీంనగర్‌లో కూడా బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపి తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ ఆరు పార్లమెంట్ స్థానాల పరిధిలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వుండటంతో తమ కలిసొస్తుందని భావిస్తుంది బీఆర్ఎస్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories