మునుగోడులో తారుమారైన నవంబరు సెంటిమెంట్‌

BJPs November Sentiment Be Repeated In Munugode By Election
x

మునుగోడులో తారుమారైన నవంబరు సెంటిమెంట్‌

Highlights

Munugode Election Results 2022: ఒక్కొక్కరిది ఒక్కో సెంటిమెంట్‌.

Munugode Election Results 2022: ఒక్కొక్కరిది ఒక్కో సెంటిమెంట్‌. రాజకీయాల్లో సెంటిమెంట్‌ ఒక అయింట్‌మెంట్‌లా పనిచేస్తుంది. అందుకే ఆ సెంటిమెంట్‌ దెబ్బతినకుండా చూసుకుంటారు నాయకులు. అదే సెంటిమెంట్‌ కోసం ఎంత శ్రమకైనా సిద్ధపడుతారు. ఇదే సెంటిమెంట్‌ గడిచిన రెండు ఎన్నికల్లో కారు పార్టీని కంగారెత్తిస్తే.. కమలనాథుల్లో కదనోత్సాహం చూపించింది. కానీ అదే సెంటిమెంట్‌ ఈసారి రివర్స్‌ అయ్యి కమలాన్ని కంగు తినిపిస్తే... గులాబీ గూబ గుయ్‌మనిపించింది. ఇంతకీ అంత బలంగా పనిచేసిన ఆ సెంటిమెంట్‌ ఏమిటి?

దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో నవంబరు నెల అధికార పార్టీని నారాజు చేశాయి. అదే నవంబరు నెల కమలం క్యాంప్‌లో కదనోత్సాహాన్ని నింపింది. కానీ, ఈసారి అదే నవంబర్‌ సెంటిమెంట్‌ కాషాయాన్ని కంగారు పెట్టించగా, కారు పార్టీ కదనసీమలో రెచ్చిపోయింది. కిందటేడాది సరిగ్గా ఇదే నవంబరు నెలలో కారు పార్టీకి కంచుకోటలాంటి హుజూరాబాద్‌లో అనూహ్యంగా కమలం జెండా ఎగిరింది. సరిగ్గా ఏడాది తిరక్కముందే ఇదే నవంబరు నెల గులాబీకి మంచి పట్టున్న దుబ్బాకను కొల్లగొట్టింది. ఈసారి కూడా మునుగోడు బైపోల్‌, రిజల్ట్‌ నవంబరు నెలలోనే రావడంతో గులాబీ క్యాంప్‌ కాస్త గుబులు పడిందట. కమలం క్యాంప్‌ మాదే విజయమని అనుకుందట.

దుబ్బాక, హుజూరాబాద్‌ విజయాలతో ఊహించని విధంగా పుంజుకుంటున్న కమలం పార్టీ తమకు కచ్చితంగా నవంబరు నెల మునుగోడులో మొనగాడిని చేస్తుందని నమ్మింది. దుబ్బాక ఉపఎన్నిక 2020లో నవంబరు 3న జరగగా... అదే నెల 10వ తేదీన ఫలితం వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్‌‌రావు కారు పార్టీ కంచుకోటను బద్దలు కొడుతూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2021లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కూడా నవంబరులోనే జరిగింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్‌ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ రెండు చోట్ల ఉపఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌పై బీజేపీ గెలవడంతో నవంబరు నెల ఉప ఎన్నికల ఫలితాలు గులాబీ పార్టీకి చేదు అనుభవాలను మిగిల్చాయని, బీజేపీకి తీపి జ్ఞాపకాలను మిగిల్చాయని ప్రచారం జరిగింది.

కానీ, ఈసారి మునుగోడు విషయంలో నవంబరు సెంటిమెంట్‌ కమలం పార్టీని నారాజు చేసింది. రెండు ఎన్నికల విజయం అనూహ్యంగా కమలం ఖాతాలో పడటంతో మునుగోడులో కూడా తమదే విజయం అని నమ్మింది. దానికి తోడు కోమటిరెడ్డి ఫ్యామిలీకి మంచి పట్టున్న నియోజకవర్గం కావడంతో రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమనే అనుకుంది. కానీ, ఊహించిన విధంగా సీన్‌ రివర్స్‌ అయ్యింది. అదే నవంబరు సెంటిమెంట్‌ ఇదే కమలాన్ని వాడిపోయేలా చేసింది. అలా, తెలుగుదేశం పార్టీ ఆగస్టు సంక్షోభాలను ఎదుర్కొన్నట్లే టీఆర్‌ఎస్‌ నవంబరు నెలలో ఉపఎన్నికల గండాన్ని ఎదుర్కొంటోందన్న ప్రచారాన్ని గులాబీ నేతలు అటకెక్కించారు. ఏమైనా సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతున్న బీజేపీకి ఈ ఏడాది నవంబరు కలసి రాలేదన్నది క్లియర్‌. మొత్తంగా గతంలో నవంబరు నెలలో వచ్చిన దుబ్బాక, హుజూరాబాద్‌ ఫలితం మునుగోడులో రాకపోవడంతో కమలం పార్టీ కంగుతిన్నదన్నది నిజం.


Show Full Article
Print Article
Next Story
More Stories