అక్బరుద్దీన్‌ కేసులో బీజేపీ వ్యూహమేంటి?

అక్బరుద్దీన్‌ కేసులో బీజేపీ వ్యూహమేంటి?
x
Highlights

అవకాశమే లేకపోతే, అవకాశం సృష్టించుకుంటుంది అలాంటిది అవకాశమే కాళ్ల దగ్గరకు వస్తే, ఊరుకుంటుందా విజృంభిస్తుంది. తెలంగాణలో పాగా వేయాలని రకరకాల ఎత్తుగడలు...

అవకాశమే లేకపోతే, అవకాశం సృష్టించుకుంటుంది అలాంటిది అవకాశమే కాళ్ల దగ్గరకు వస్తే, ఊరుకుంటుందా విజృంభిస్తుంది. తెలంగాణలో పాగా వేయాలని రకరకాల ఎత్తుగడలు వేస్తున్న బీజేపీకి కూడా, అలాంటి ఆయుధమే దొరికినట్టయ్యింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా, సరికొత్త స్కెచ్‌ వేస్తోంది. ఇంతకీ కాషాయ వ్యూహమేంటి...?

ఏ ఒక్క అవకాశం చిక్కినా, విస్తరించడానికి వ్యూహాలు రచిస్తుంది భారతీయ జనతా పార్టీ. దూకుడు స్ట్రాటజీలతో శరవేగంగా పాకిపోతుంది. అసలు కాషాయ జెండానే ఎగరని నార్త్‌ ఈస్ట్‌లో ప్రభుత్వాలే ఏర్పాటు చేసిందంటే, బీజేపీ మెరుపువేగమేంటో అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణలోనూ, అలాంటి భావోద్వేగ వ్యూహాన్నే అమలు చేసేందుకు, బీజేపీకి ఒక అస్త్రం దొరికింది. లోక్‌సభ ఫలితాలతో ఫుల్ జోష్ మీదున్న బీజేపీ రానున్న మున్సిపాల్టీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని శతవిధాలా ఆలోచిస్తోంది. క్షేత్రస్థాయిలో బలపడి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కరీంనగర్‌లో సీఎం కేసీఆర్ ఇచ్చిన స్పీచ్‌ను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్న బీజేపీ, ఇప్పుడు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే తరహా ప్రణాళికతో ముందుకెళ్లాలని చూస్తోంది. అందుకోసం అక్బరుద్దీన్ స్పీచ్‌ అందివచ్చిన అస్త్రంగా మలచుకుంటోంది.

వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్, నోరు తెరిస్తే మంటల్లాంటి మాటలు దంచే ఎంఐఎం శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్‌ చేసిన ఒక ప్రసంగాన్ని, ఆయుధంగా సంధించేందుకు సానపడుతోంది బీజేపీ. కరీంనగర్‌లో అక్బర్‌ చేసిన కాంట్రావర్సీ స్పీచ్‌పై ఫోకస్ చేసిన బీజేపీ, పాత కేసును తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఆ పార్టీ, పోలీసులు కేసు బుక్ చేయకపోవడంతో స్వయంగా తమ పార్టీ నాయకుడి ద్వారా కోర్టును ఆశ్రయించి కేసు బుక్ అయ్యేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యింది.

ఇక టీఆర్ఎస్‌కు ఎంఐఎం మిత్రపక్షం కావటం వల్లే అక్బరుద్దీన్ విద్వేష పూరిత ప్రసంగం చేసినా పోలీసులు కేసు పెట్టలేదని ఆరోపిస్తోంది బీజేపీ. ఇద్దరూ కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపిస్తోంది. ప్రభుత్వ అండ చూసుకుని అక్బరుద్దీన్ రెచ్చిపోతున్నారని విమర్శిస్తోంది. ఇంత జరుగుతున్నా ముస్లిం ఓట్ల కోసమే కేసీఆర్ అక్బరుద్దీన్ కామెంట్లను పట్టించుకోవడంలేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇక ఇప్పుడు నిర్మల్ కేసును బీజేపీ తెరపైకి తీసుకువచ్చింది. 2013లో అక్బరుద్దీన్ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారంటూ కేసు నమోదు చేసిన పోలీసులు, అరెస్ట్ కూడా చేశారు. తర్వాత అక్బరుద్దీన్ బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు కరీంనగర్ ప్రసంగం సందర్భంగా అతడి వైఖరిలో మార్పు రాలేదని, అతడి బెయిల్‌ను రద్దు చేయాలని ఆ పార్టీకి చెందిన న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీంతో విద్వేష ప్రసంగం కేసు, మరోసారి మంటలు రాజేస్తోంది.

మొత్తం మీద అక్బరుద్దీన్ వ్యవహారంతో అటు అధికార పార్టీని ఇరుకునపెట్టడమే కాకుండా అటు ఎంఐఎంను దెబ్బతీయాలన్నది బీజేపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఓ వైపు మున్సిపాల్టీ ఎన్నికలతో పాటు జి హెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ ఈ వ్యవహారాన్ని బాగా ఉపయోగించుకోవాలని ఆ పార్టీ స్కెచ్ వేస్తోంది. ఏదేమైనా అక్బరుద్దీన్ వ్యవహారంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు టిఆర్‌ఎస్‌ ఇటు ఎంఐఎంలను ఇరుకున పెట్టి, క్షేత్రస్థాయిలో బలపడాలనుకుంటోంది బీజేపీ. మరి కాషాయ వ్యూహం ఫలిస్తుందా?


Show Full Article
Print Article
More On
Next Story
More Stories