మునుగోడులో బీజేపీ సభకు కేంద్రమంత్రి అమిత్‌షా

BJP Sabha In Munugodu Today
x

మునుగోడులో బీజేపీ సభకు కేంద్రమంత్రి అమిత్‌షా

Highlights

Munugodu: అమిత్ షా మునుగోడు షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

Munugodu: తెలంగాణలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ దూకుడు పెంచింది. నేడు మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహణతో తెలంగాణలో కొత్త ఉత్సహాన్ని నింపాలని భావిస్తోంది. చెప్పాలంటే.. మునుగోడు బహిరంగ సభతో తెలంగాణలో అధికార పీఠానికి మార్గం సుగమం చేసుకోవాలని కమలనాథులు భావిస్తోన్నారు. ఇక మునుగోడు సభలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం కూడా జరుగుతోంది.

బీజేపీ సభకు రానున్న అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగసభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు జరిగాయి. కాగా.. అమిత్ షా మునుగోడు షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. మధ్యాహ్నం 2గంటలకు స్పెషల్ ఫైయిట్‌లో ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. బేగంపేట్‌ నుంచి నేరుగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం బేగంపేట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడుకు వెళ్లనున్నారు అమిత్ షా. సభ అనంతరం మునుగోడు నుంచి రోడ్డు మార్గన హైదరాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకుంటారు. తిరిగి రాత్రి 10 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

మునుగోడు నుంచి చండూరు వెళ్లే దారిలో సభకు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే వేదిక నుంచి రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా.. నిన్న కృష్ణా జలాలపై సమాధానం చెప్పాలని నేరుగా అమిత్‌ షా ను సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు మోటార్లకు మీటర్లు పెట్టడం దగ్గర నుంచి అనేక అంశాలపై కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి వీటికి బీజేపీ నేతలు సమాధానం చెప్తారా..? లేక తమదైన స్టైల్‌లో రివర్స్‌ కౌంటర్ ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే.. కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై అమిత్‌ షా మాట్లాడుతారన్నారు బీజేపీ రాష్ట్ర ‎ఇంచార్జ్ తరుణ్ చుగ్.

బీజేపీ చేపట్టిన బహిరంగ సభపై కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు భయానికి గురవుతున్నారని విమర్శించారు టీ.బీజేపీ నేతలు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టాన్ని రుజువు చేస్తుందంటున్నారు. వచ్చే ఎన్ని్కల్లో గెలిచి బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమంటున్నారు. మొత్తానికి తెలంగాణలో పట్టుకోసం బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇక రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఉత్సహంగా పనిచేయాలని నేతలకు సూచిస్తున్న బీజేపీ అధిష్టానం.. 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేరుకోవాలని భావిస్తోంది.

ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో అవలంభించిన విధానాలను తెలంగాణలో కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ని ముమ్మరం చేస్తూ రాష్ట్రంలో ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలతో మంతనాలు సాగిస్తోంది. మునుగోడు సభను దృష్టిలో ఉంచుకుని పార్టీలో చేరికలు ఉండేలా ప్లాన్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories