తెలంగాణలో భారీ చేరికలకు ముహూర్తం ఫిక్సయ్యిందా?

తెలంగాణలో భారీ చేరికలకు ముహూర్తం ఫిక్సయ్యిందా?
x
Highlights

తెలంగాణలో కనివిని ఎరుగని పార్టీ జంపింగ్స్ జరగబోతున్నాయా కాంగ్రెస్, టీడీపీల నుంచి ఉద్దండ నాయకులు పెట్టేబేడా సర్దుకుని కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారా...

తెలంగాణలో కనివిని ఎరుగని పార్టీ జంపింగ్స్ జరగబోతున్నాయా కాంగ్రెస్, టీడీపీల నుంచి ఉద్దండ నాయకులు పెట్టేబేడా సర్దుకుని కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారా ఈనెల 27 లేదంటే 28న బీజేపీ కీలక నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారా అసలు ఏయే నేత వెళ్లేందుకు రెడీ అవుతున్నారు చేరబోతున్నవారి లిస్టేంటి?

ఆపరేషన్‌ ఆకర్ష్. మొన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ ఆకర్ష్ ముగిసింది. ఇప్పుడు ఆపరేషన్‌ చేపట్టింది కమలం. కాంగ్రెస్, టీడీపీల నుంచి పవర్‌ఫుల్ లీడర్లను లాగేందుకు రంగం సిద్దం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా యుద్ధరంగాన్ని మార్చేందుకు సకల ఎత్తులూ వేస్తోంది.

మొదట టీడీపీ సంగతి చూద్దాం. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రమాదంలో పడింది. అయినా 2014 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లను కొల్లగొట్టి, బలమైన క్యాడర్‌ తనకుందని నిరూపించుకుంది తెలుగుదేశం. కానీ టీఆర్ఎస్‌ ఆపరేషన్ ఆకర్ష్‌‌తో చెల్లా చెదురైంది. 2018లో కేవలం రెండే రెండు ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. పార్లమెంట్‌ ఎన్నికల్లోనైతే అస్సలు పోటీ చేయలేదు. ఇప్పుడు ఏపీలో కూడా పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దీంతో తెలంగాణ టీడీపీకి ఉన్న ఒకే ఒక్క ఆశా పోయింది. అందుకే తెలంగాణలో బలం పుంజుకుంటున్న బీజేపీలోకి వెళ్లాలని తెలుగు తమ్ముళ్లు డిసైడయ్యారని, రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఎవరెవరు పార్టీ మారబోతున్నారు?

ఈ లిస్ట్‌ పెద్దగానే ఉంది. పార్టీలో అత్యంత సీనియర్లయిన పెద్దిరెడ్డి, బోడ జనార్దన్‌, కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతాదయాకర్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమని బలంగా వినిపిస్తున్నాయి ఊహాగానాలు. దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్‌ సైతం కాషాయ కండువా కప్పుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో రాంమాధవ్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ వేదికగా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయినట్టే.

తెలంగాణ కోటా నుంచి రాజ్యసభ ఎంపీ అయిన మాజీ కేంద్ర మంత్రి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి కూడా బీజేపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీకి వీడనంటూనే, బీజేపీకిలోకి వెళ్తే చంద్రబాబుకు చెప్పే వెళతానని అన్నారు సుజనా. ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వంలో సుజనా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఓటమిపై సుజనా చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్నిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై వెనకడుగు వేయడం కూడా ఓటమికి దారి తీసిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏపీలో ఉనికిలోలేని పార్టీకి దగ్గరవ్వటం, అదే సమయంలో ఉనికిలోలేని మరో పార్టీతో యుద్ధం చేయటంతోనే టీడీపీ ఓటమి పాలయ్యిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబును కొందరు తప్పుదారి పట్టించారని అన్నారు సుజనా. మొత్తానికి మొన్నటి వరకూ బీజేపీని సుతిమెత్తగా తిట్టిపోసిన సుజనా, తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణలో టీడీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి మొన్న ఢిల్లీ వెళ్లి సుజనా చౌదరితో సమావేశమయ్యారట. తెలంగాణ టీడీపీలో మిగిలిన నేతలను బీజేపీలోకి వెళ్లేందుకు ఒప్పించే బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారట సుజనా. మొత్తానికి అటు టీఆర్ఎస్‌లోకి పోకుండా మిగిలిపోయిన తెలంగాణ టీడీపీ నేతలు, బీజేపీలోకి వెళ్లాలరని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 27 లేదా 28 తేదీల్లో పార్టీ మారడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక కాంగ్రెస్ జంపింగ్‌ల కథ. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ కాదు బీజేపీయేనని మొన్న సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. అతిత్వరలో ఈయన కాషాయం తీర్థం పుచ్చుకోవడం గ్యారంటీ అని తెలుస్తోంది. ఈయనతో పాటు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లాలనే డిసైడయ్యారట. కానీ టైం కోసం చూస్తున్నారట. తమ్ముడు మొదట వెళ్లిపోయినా, తర్వాత పరిస్థితులను బట్టి తానూ వెళ్లేందుకు సిద్దమవుతున్నారట. తెలంగాణ పీసీసీ చీఫ్‌ తనకిస్తే సరి, ఒకవేళ రేవంత్‌రెడ్డికి ఇస్తే మాత్రం అదే రోజు బీజేపీలోకి వెళతారని, గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ నుంచి ఇంకా చాలామంది కాంగ్రెస్‌ సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు సైతం బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక మాజీ ఎంపీ వివేక్, మోత్కుపల్లి నర్సింహులు, శోభారాణి కూడా బీజేపీలో జాయిన్‌ కావడం పక్కా అన్న సమాచారం అందుతోంది. మరి అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్‌ నేతలను ఆపేందుకు పార్టీ అధిష్టానాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories