బీజేపీ జాతీయ కమిటీలో సమూల మార్పులు.. రాష్ట్రం నుంచి ప్రాధాన్యత ఎవరికి..?

BJP Gears for Changes in National Committee
x

బీజేపీ జాతీయ కమిటీలో సమూల మార్పులు.. రాష్ట్రం నుంచి ప్రాధాన్యత ఎవరికి..?

Highlights

BJP: ప్రధానిగా మోడీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు.. అయన మంత్రివర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పార్టీ బాధ్యతల్లో ఉన్న పలువురు నేతలు కూడా ఉన్నారు.

BJP: ప్రధానిగా మోడీ మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు.. అయన మంత్రివర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పార్టీ బాధ్యతల్లో ఉన్న పలువురు నేతలు కూడా ఉన్నారు.దాంట్లో రాష్ర్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు... జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తారనే చర్చ జరుగుతోంది.. పార్టీ సంస్థాగత ఎన్నికలు అయ్యాక వస్తారా..? లేక ముందే వస్తారా..? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.. అయితే పార్టీ వర్గాలు మాత్రం త్వరలోనే జాతీయ కార్యవర్గంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక జరుగుతుందంటున్నారు ఒకవేళ కొత్త అధ్యక్షుడు వస్తే ప్రస్తుతం ఉన్న జాతీయ కమిటీ కూడా రద్దవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు పార్టీని ప్రక్షాళన చేసే నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు పూర్తిగా కొత్త కమిటీని నియమించుకుంటారు.

జాతీయ కమిటీలో డీకే అరుణ ఉపాధ్యక్షురాలిగా, బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ జాతీయ అధ్యక్షుడు మారితే.. వీరి పరిస్థితి ఏంటి..? కొత్త కమిటీలో అవకాశం ఉంటుందా..? ఉండదా...? అనే డిస్కషన్ రాష్ట్ర బీజేపీలో జరుగుతోంది. జాతీయ కార్యవర్గ సభ్యులుగా కొందరు ఉన్నారు వివిధ మోర్చాల్లో కూడా తెలంగాణ నేతలు ఉన్నారు. లక్ష్మణ్, డీకే అరుణకు మంత్రి పదవులు వస్తాయని ప్రచారం జరిగింది కానీ ఆ అవకాశం రాలేదు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అయ్యారు. ఆయనకు మళ్లీ పార్టీ పదవి వచ్చే అవకాశం లేదు. బీజేపీ నిబంధనల ప్రకారం పార్టీ పదవిలో మంత్రి పదవిలో రెండు పదవులు ఉండడం కుదరదు.

కొత్త కమిటీలో డీకే అరుణ, లక్ష్మణ్‌కు ప్రాధాన్యత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీకే అరుణను ప్రస్తుతం ఉన్న ఉపాధ్యక్ష పదవిలో కొనసాగించడమో..? లేక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఆమె రేసులో ఉన్నారనే చర్చ కూడా జరగుతోంది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి ఆమెకి ఇవ్వని పక్షంలో జాతీయ కమిటీలోకి తీసుకొని ఒకటి రెండు రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించవచ్చనే టాక్ వినిపిస్తోంది.

లక్ష్మణ్ గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు ఇప్పుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మళ్లీ ఆయనకు పార్టీ పదవి ఇవ్వొచ్చని తెలుస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శినో, లేక జాతీయ ఉపాధ్యక్షుడిగానో ఆయనకు బాధ్యతలు అప్పగించవచ్చని పార్టీలో గుసగుసలాడుకుంటున్నారు. పార్లమెంటరీ బోర్డు మెంబర్‌గా కూడా లక్ష్మణ్ కొనసాగుతున్నారు. లక్ష్మణ్ ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణలో సీనియర్ నేతగా ఉన్నారు అయితే కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఆశించారు ఆయన.. కానీ అవకాశం దక్కలేదు అయితే ఈసారి జాతీయస్థాయిలో లక్ష్మణ్‌కు పార్టీ పదవి దక్కుతుందని బీజేపీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

మొత్తానికి జాతీయ నాయకత్వం తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తుండడంతో ఖచ్చితంగా పార్టీ పరంగా రాష్ట్రానికి జాతీయ పదవులు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణకు జాతీయ స్థాయిలో ఎన్ని పదవులు వరించబోతున్నాయో ఏ ఏ పదవులు వరించబోతున్నాయనేది వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories