తెలంగాణ కమలంలో కొత్త పంచాయతి.. తెరపైకి కొత్త డిమాండ్..

తెలంగాణ కమలంలో కొత్త పంచాయతి.. తెరపైకి కొత్త డిమాండ్..
x
అమిత్‌ షా
Highlights

తెలంగాణ కమలంలో కొత్త పంచాయతీ కాక రేపుతోంది. అధ్యక్షుడిగా కొత్తవారిని పెట్టాలా, పాతనాయకుడినే కొనసాగించాలా అన్న చర్చ, వాడివేడిగా సాగుతున్న నేపథ్యంలో,...

తెలంగాణ కమలంలో కొత్త పంచాయతీ కాక రేపుతోంది. అధ్యక్షుడిగా కొత్తవారిని పెట్టాలా, పాతనాయకుడినే కొనసాగించాలా అన్న చర్చ, వాడివేడిగా సాగుతున్న నేపథ్యంలో, కొత్త అంశం తెరపైకి వచ్చింది. అది అమిత్‌ షాకు తలనొప్పిగా మారింది.

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం జాతీయ నాయకత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. అయితే అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందని పార్టీ జరిపిన అభిప్రాయ సేకరణలో పలువురు సీనియర్లు నగరానికి చెందిన వారినే కాకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం కల్పించాలని కోరారట. ఈ ప్రతిపాదనకు మెజార్టీ సభ్యులు ఆమోదం తెలుపడమే కాకుండా, ఈసారి జిల్లాలకు చెందిన నాయకులకు అవకాశం కల్పించాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. దీంతో ఈ వ్యవహారం జాతీయ నాయకత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టినట్లయ్యిందని పార్టీలో చర్చ జరుగుతోంది.

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఊపందుకుంది. ఈ అంశంపై సీరియస్ గానే దృష్టి సారించిన జాతీయ నాయకత్వం, సమర్ధుడైన నాయకుడి కోసం అన్వేషణ ప్రారంభించింది. అయితే ఈ సమయంలో కొత్త పంచాయతీ పార్టీలో మొదలయ్యింది. గ‌డిచిన 19 ఏళ్ళ నుంచి వ‌రుస‌గా ఒకే ప్రాంతం నుంచి అధ్యక్షులు ఉండ‌టంతో పార్టీ కార్యక్రమాలు, నిర్మాణం కేవ‌లం ఒక్క ప్రాంతానికే మాత్రమే ప‌రిమితమయ్యిందన్న భావ‌న పార్టీలో నెల‌కొంది.

హైద‌రాబాద్ మిన‌హా రాష్ట్రవ్యాప్తంగా మిగ‌తా జిల్లాలు, మండలాల్లో బిజేపికి పెద్దగా ప్రాబల్యం లేదన్న అంశాన్ని, జాతీయ నాయ‌క‌త్వం ముందు సీరియ‌స్‌గా ప్రస్తావిస్తున్నారు పార్టీలోని సీనియర్ లీడ‌ర్లు. 19 ఏళ్ళ నుంచి కేవ‌లం హైదరాబాద్ నుంచి మాత్రమే రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఇంద్రసేనా రెడ్డి మల‌క్‌పేట్ ఎమ్మేల్యేగా ప‌ని చేసి, ఓడిపోయిన త‌రువాత 2000 నుంచి 2003 వ‌రకు రాష్ట్ర అధ్యక్షునిగా ప‌నిచేశారు. ఆ త‌రువాత సికింద్రాబాద్ ఎంపీగా ప‌నిచేసిన‌ ద‌త్తాత్రేయ రెండుసార్లు ఐదేళ్ల పాటు రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ద‌త్తాత్రేయ త‌రువాత అంబ‌ర్ పేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కిష‌న్ రెడ్డి రెండుసార్లు, అంటే ఆరు సంవ‌త్సరాలు రాష్ట్ర అధ్యక్షునిగా ప‌ని చేశారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొన్ని రోజుల పాటు కిష‌న్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ప‌ని చేశారు. ఆ త‌రువాత ల‌క్ష్మణ్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీక‌రించారు. నాలుగేళ్ళుగా ఆయ‌న‌ అధ్యక్షునిగా కొన‌సాగుతున్నారు. మూడేళ్ళకే గ‌డువు ముగియాల్సి ఉన్నా పార్లమెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో, ఆయ‌న‌నే అధ్యక్షుడిగా కొన‌సాగించింది అధిష్టానం. దీంతో ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ వ‌చ్చిన త‌రువాత కూడా హైద‌రాబాద్‌కు చెందిన వ్యక్తుల‌కే అధ్యక్ష పీఠం ద‌క్కుతూ వ‌చ్చింది. అయితే గ‌తంలో చాలా త‌క్కువసార్లు హైద‌రాబాద్ కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి పార్టీ ప‌గ్గాలు ద‌క్కాయి. దీంతో పార్టీ హైద‌రాబాద్ మిన‌హా తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో పెద్దగా ప్రాబల్యం పెంచుకోలేకపోయిందని పార్టీలోని కొందరు సీనియ‌ర్ల వాద‌న‌. అయితే, ఈ అంశాన్ని కూడా జాతీయ నాయ‌క‌త్వం సీరియ‌స్‌గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. కేవ‌లం హైద‌రాబాద్ నేత‌ల‌కే అధ్యక్షుడి పదవిని పరిమితం చేయడం ఎందుక‌న్న ప్రశ్న పార్టీలో కొందరు నాయకులు లేవ‌నెత్తడంతో, ఈసారి పార్టీ ఎదుగుదల దృష్టిలో పెట్టుకుని హైద‌రాబాదేతర వ్యక్తికి అధ్యక్ష ప‌ద‌వి క‌ట్టబెడితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో జాతీయ నాయ‌క‌త్వం ఉన్నట్టు తెలుస్తోంది.

ఉత్తర తెలంగాణ నుంచే ఇద్దరు ఎంపీలు అర‌వింద్, బండి సంజ‌య్ లు బలంగా అధ్యక్ష ప‌ద‌వి కోసం ప్రయ‌త్నాలు చేస్తుంటే, ద‌క్షిణ తెలంగాణ నుంచి మ‌హబూబ్ న‌గ‌ర్ జిల్లాకి చెందిన నేత‌లు డీకే అరుణ, జితేందర్ రెడ్డిలు ప‌ద‌విని ఆశిస్తున్నారు. వీరిలో ముగ్గురు ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారే ఉన్నారు. అధ్యక్ష ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న విషయం ప‌క్కన పెడితే ఒక్క హైద‌రాబాద్ కే, ఈ ప‌ద‌విని కట్టబెట్టడం ఏంట‌న్న ప్రశ్నలు త‌లెత్తడం జాతీయ నాయ‌క‌త్వానికి త‌ల‌నొప్పిగా త‌యారైంది. ఈ అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ల‌క్ష్మణ్ ను కాకుండా కొత్త వారికి అంటే, హైదరాబాదేతరులకు అవ‌కాశం క‌ల్పిస్తారా, లేదా మళ్లీ ల‌క్ష్మణ్ నే కొన‌సాగిస్తారా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే మరోవైపు నగరానికి చెందిన వారైతేనే ఎప్పుడూ అందుబాటులో ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడి వారికే అవకాశం ఇవ్వాలని సిటీకి చెందిన లీడర్లు తమ వాదన వినిపిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories