తెలంగాణ పార్లమెంట్ ఫలితాలు: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్

Big shock To BRS In Parliament Election 2024
x

తెలంగాణ పార్లమెంట్ ఫలితాలు: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్

Highlights

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ఎనిమిది చొప్పున ఎంపీ స్థానాల్లో విజయం సాధించాయి.

బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు 2024 షాకిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు గుండు సున్నాను చేతిలో పెట్టారు. పార్లమెంట్ ఎన్నికలను రెండు జాతీయ పార్టీల మధ్య యుద్ధంగానే ప్రజలు చూశారా అని ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్ధమౌతుంది.

తెలంగాణలో సమాన సీట్లను సాధించిన బీజేపీ, కాంగ్రెస్

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ఎనిమిది చొప్పున ఎంపీ స్థానాల్లో విజయం సాధించాయి. హైద్రాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం తన పట్టును నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా దక్కలేదు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 09 స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈ సారి మరో నాలుగు కలిపి ఎనిమిది స్థానాల్లో నెగ్గింది. 2019 లో కాంగ్రెస్ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈసారి ఆ పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధిక స్థానాల్లో గెలుపొందాయి. కానీ, గత ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా నష్టపోయింది. 17 పార్లమెంట్ స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్ధులు మూడో స్థానానికే పరిమితమయ్యారు. హైద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్ధి నాలుగో స్థానంలో నిలిచారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు రెండో స్థానంలో నిలిచారు. మిగిలిన అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు మూడోస్థానంలో నిలిచారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, చేవేళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుపొందారు. హైద్రాబాద్ ను ఎంఐఎం నిలబెట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 35.06 శాతం, కాంగ్రెస్ కు 40.10 శాతం, బీఆర్ఎస్ కు 16.69 శాతం ఓట్లు లభించాయి. బీఆర్ఎస్ 2019 పార్లమెంటు ఎన్నికల్లో 41.7 శాతం ఓట్లతో 9 స్థానాలు గెల్చుకుంది. ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం సగానికన్నా తక్కువకు పడిపోయింది. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

తెలంగాణలో కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చిన ఫలితాలు

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరునెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన ఫలితాలు సాధించడం కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన వార్నింగ్ ను ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లో విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచించింది. కానీ, ఆ పార్టీ ఎనిమిది స్థానాల వద్దే ఆగిపోయింది.

అసెంబ్లీ ఎన్నికల విజయం పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ తో సంపూర్ణం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. అయితే కాంగ్రెస్ ఆశలకు బీజేపీ రూపంలో గండిపడింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక్క వార్నింగ్ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పొరపాట్లు చేస్తే రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు బీజేపీ సిద్దంగా ఉంది.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తన పాలనకు ఈ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా భావిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆరు నెలల పాలననే రెఫరెండంగా భావించలేం. పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీల మధ్య పోరాటంగా ప్రజలు భావించినందున బీఆర్ఎస్ పోటీలో లేకుండా పోయిందని పౌరహక్కుల ఉద్యమకారుడు,సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు పార్టీలు సీట్లను పంచుకున్నాయని ఆయన చెప్పారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకున్నట్టుగా బీఆర్ఎస్ కన్పించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఆ పార్టీ చేసిన అలవికాని హామీలు చేయడమేనని బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ ను గెలిపించి పొరపాటు చేశామని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. తమ ఓటమికి తమ పార్టీ చేసిన తప్పిదాల గురించి ఒప్పుకోకుండా ఆ నెపాన్ని ఇతరులపై నెట్టే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ వ్యాఖ్యలను బట్టి అర్ధమౌతుంది.

కాంగ్రెస్ పార్టీ గెలవకూడదనే ఉద్దేశ్యంతో పరోక్షంగా బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ సహకరించిందనే విమర్శలు కూడా లేకపోలేదు. తెలంగాణలో బీజేపీ ఎనిమిది స్థానాల్లో బీజేపీ గెలుపునకు కొన్ని స్థానాల్లో పరోక్షంగా బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీకి బదిలీ చేశారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జీహెచ్ఎంసీ పరిధిలో అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపలేదు.

ఈ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీకి బదిలీ అయిందని ఈ ఫలితాలను చూస్తే అర్ధమౌతుందని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి ఆ పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆయన చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్ నష్టం చేసిందనే భావన కూడ ఆ పార్టీ ఓటమికి కారణమన్నారు.

తెలంగాణలో బీజేపీ ఎలా ఎదిగింది?

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ 8 సీట్లు గెల్చుకుంది. బీజేపీకి 2019 ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఎనిమిది స్థానాల్లో గెలుపు దక్కించుకుంది. బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీకి బదిలీ కావడం ఆపార్టీకి కలిసి వచ్చింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వలేకపోవడం కూడా పరోక్షంగా బీజేపీ వైపు బీఆర్ఎస్ ఓటింగ్ షిఫ్ట్ కావడానికి కారణమైంది. పార్లమెంట్ ఎన్నికలను రెండు జాతీయ పార్టీల మధ్య పోరుగా భావించి బీఆర్ఎస్ ను పరిగణనలోకి తీసుకోలేదు. బరిలో దింపిన అభ్యర్ధుల్లో కొందరు వ్యక్తిగత ఇమేజ్ కూడా కమలం పార్టీకి కలిసి వచ్చింది. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు లాంటి అభ్యర్ధుల వ్యక్తిగత ఇమేజ్ కూడా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలానికి కొంత కలిసి వచ్చింది. తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో బీజేపీ గెలవడాన్ని ఆ పార్టీ భావజాలానికి పడిన ఓటుగా భావించలేమని సామాజికవేత్త హరగోపాల్ చెప్పారు.

తెలంగాణలో బీజేపీ క్షేత్రస్థాయిలో బలం ఉంది. దేశంలో రెండు స్థానాలు గెలిచిన సమయంలో తెలంగాణ నుండి ఒక్క ఎంపీ సీటు ఆ పార్టీ ఖాతాలో పడింది. హైద్రాబాద్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీకి కొంత పట్టుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ బలహీనపడడం కూడా కమలం పార్టీకి కలిసి వచ్చింది.

ఏ పార్టీకి కూడా తెలంగాణ ప్రజలు వన్ సైడ్ లో తీర్పు ఇవ్వలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ నేతల తీరు మారలేదని, అందుకే ఓటరు మరింత బలంగా తీర్పు చెప్పారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయ రంగంలో కాంగ్రెస్, బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా అవతరించాయన్నది కాదనలేని వాస్తవం. మూడో స్థానానికి పడిపోయిన బీఆర్ఎస్ మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడం అన్నది మామూలు విషయం కాదు.


Show Full Article
Print Article
Next Story
More Stories