గుహాలయంలో భర్గేశ్వరుడు ఎక్కడున్నాడో తెలుసా..?

గుహాలయంలో భర్గేశ్వరుడు ఎక్కడున్నాడో తెలుసా..?
x
Highlights

పల్లవుల శిల్పకళను వివరించే ఒక్క ముఖ్య ప్రదేశం భైరవకోన. దక్షిణ భారతదేశంలో మొట్టమొదట కనుగొన్న ప్రాచీన హిందూ దేవాలయాలు ఈ భైరవకోనలోనివే. భైరవకోనలో ఎనిమిది హైందవ దేవాలయాలున్నాయి.

పల్లవుల శిల్పకళను వివరించే ఒక్క ముఖ్య ప్రదేశం భైరవకోన. దక్షిణ భారతదేశంలో మొట్టమొదట కనుగొన్న ప్రాచీన హిందూ దేవాలయాలు ఈ భైరవకోనలోనివే. భైరవకోనలో ఎనిమిది హైందవ దేవాలయాలున్నాయి. ఇది 9వ శతాబ్దానికి చెందిన ఓ ప్రాచీన శివాలయం. కొండకోణల నడుమ పచ్చటి ప్రకృతి అందాల నడుమ ఈ గుహాలయం ఉంది. దాంతో పాటుగానే అత్యంత ప్రాచీన పల్లవ దేవాలయానికి ఆభిముఖంగా ఎనిమిది చిన్నచిన్న దేవాలయాలున్నాయి. భైరవకోనలోని మరో విశేషం అందాల జలపాతం. ఎత్త్తెన కొండలపైఉన్న లింగాల దొరువు నుంచి ప్రవహించి 200మీటర్ల ఎత్తునుంచి పడుతూ ఇక్కడకు వచ్చే యాత్రికులకు కనువిందు చేస్తోంది.

ఆలయం ఎక్కడ ఉంది..

భైరవ కోన ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామం దగ్గర ఉంది. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహంమీద కార్తీకపౌర్ణమిరోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాతపు సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు.


కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచీ ఉన్నదే.ఆంధ్రప్రదేశ్ లో వీటి జాబితా చాలానే ఉంది. గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ప్రకాశంజిల్లోని సీతారామపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖానికీ ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగానూ చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలూ వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండరాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు.

ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూతా కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.

ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరుపర్వత పంక్తిలోని రుద్రలింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వరిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం) రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామేశ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు.


ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఆశీనమై కనిపిస్తుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పుముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోబాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగానూ ప్రాచుర్యం చెందింది. అంతేకాదు ఈప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.

పల్లవ గుహాలయాలు..

ఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయనిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీ.శ. 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం... వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని అంచనా. ఇక్కడ ఈ గుహాలయాలతోపాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు; పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే నడక తప్పనిసరి.


ఆలయానికి ఇలా చేరుకోవచ్చే..

భైరవకోనకు వెళ్లాలంటే పామూరు లేక పోరుమామిళ్ల మీదుగా అంబవరం కొత్తపల్లి చేరుకుంటే ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అటవీప్రాంతం కాబట్టి నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు నిర్వాహకులు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది కానీ సౌకర్యాలు అంతంతమాత్రమే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories