Telangana Elections: తెలంగాణలో కాకరేపుతోన్న పొలిటికల్ బెట్టింగ్స్

Betting On Assembly Elections In Telangana Who To Win
x

Telangana Elections: తెలంగాణలో కాకరేపుతోన్న పొలిటికల్ బెట్టింగ్స్

Highlights

Telangana Elections: దాదాపు వందల కోట్లలో బెట్టింగ్ కాచినట్టు వార్తలు

Telangana Elections: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. కాయ్ రాజా కాయ్ అంటూ జోరుగా బెట్టింగ్స్ కాస్తున్నారు. ఈ సారి పలానా పార్టీ అధికారంలోకి రాబోతోందని, పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి గెలవబోతున్నారంటూ భారీగా పందాలు వేస్తున్నారు. వందకు వెయ్యి, వెయ్యికి లక్ష అంటూ వేలం పాట పాడుతున్నారు బెట్టింగ్ బంగార్రాజులు. ఇక పెద్ద లీడర్లు తలపడుతున్న నియోజకవర్గాల్లో అయితే.. ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారని కూడా బెట్టింగ్స్ నడుస్తున్నాయట. లక్షలు కాదు.. కోట్లలో బెట్టింగ్స్ జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది. ఎవరు అధికారంలోకి రాబోతున్నారు. రాష్ట్రంలో ఎవరిని చూసినా ఇదే చర్చ. ఊరు వాడా, పల్లె పట్నం అని తేడా లేకుండా నలుగురు గుమిగూడితే చాలు పాలిటిక్స్‌పైనే గుసగుసలాడుకుంటున్నారు. ఈ సారి ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తుండటంతో.. జనాల అటెన్షన్ అంతా ఫలితాలపై ఉంది. తెలంగాణ ప్రజలతో పాటు.. చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2నెలల ప్రచారానికి తెర పడింది.

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పందెం రాయుళ్ల బెట్టింగ్‌ దందా కూడా జోరందుకుంది. విశేషమేంటంటే.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇక్కడి కంటే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అక్కడి బెట్టింగ్‌ బంగార్రాజులు రంగంలోకి దిగారు. ప్రధాన పార్టీల గెలుపోటములపై జోరుగా పందేలు కాస్తున్నారు. పార్టీలతో పాటు కీలక నేతల జయాపజయాలపై కూడా పందేలు కాస్తున్నారు.

సాధారణంగా బెట్టింగ్స్‌.. సర్వేలపై ఆధారపడి ఉంటాయి. అందుకే.. ఇప్పటి దాకా వచ్చిన సర్వేలు ఎన్ని? అందులో ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఎంత? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయ్‌? అనే అంశాలను పందెంరాయుళ్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాగే సర్వేలు చేసిన సంస్థల విశ్వసనీయత ఎంత? గతంలో అవి చేసిన సర్వేల వాస్తవిక ఫలితాలు ఎలా వచ్చాయి? అన్న విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ వివరాల ఆధారంగానే పందేలు కాస్తున్నారు.

అలాగే రాజకీయ నేతలతో టచ్‌లో ఉండే సర్వే సంస్థలను కొందరు స్వయంగా కలుస్తున్నారు. కచ్చితంగా గెలిచే పార్టీ ఏంటో ఒకటికి రెండుసార్లు అంచనాలు సరిచూసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకోవడానికి తెలంగాణలో ఉన్న తమ పరిచయస్తులు, స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రజల మూడ్‌ ఎలా ఉంది? ఎటువైపు గాలి వీస్తోందో ఆరా తీస్తున్నారు.

ఈ ఎన్నికల్లో విజయాపజయాలపై కొందరు వ్యక్తిగత స్థాయిలో పందేలు కాస్తుండగా.. మరికొందరు సిండికేట్‌గా మారి పందేలు కడుతున్నట్టు సమాచారం. అంటే.. అందరూ తాము పణంగా పెట్టాలనుకుంటున్న సొమ్మును సిండికేట్‌లో పెడతారు. గెలిస్తే అందులో వారి వాటా ఎంతో అంత వస్తుం ది. పోతే మొత్తం పోతుంది. వ్యక్తిగతంగా అయినా, సిండికేట్‌ ద్వారా అయినా.. చాలా మంది రూ.లక్షలు, కోట్లల్లో పందేలు కాస్తున్నారు. కొందరైతే.. వ్యవసాయ భూములు, ఇళ్లను కూడా పందెంగా పెడుతున్నట్టు సమాచారం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. ఇప్పటికే బెట్టింగ్‌ మార్క్ 100 కోట్లు దాటినట్టు సమాచారం. ఏపీకి చెందిన ఓ వర్గం ఖమ్మం జిల్లా బెట్టింగుల్లో కీలక పాత్ర పోషిస్తోందనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ముఖ్యంగా రెండు జనరల్ సీట్లు..రెండు ఎస్‌సీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయం మీద భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories