ఎమ్మెల్యేలకు ప్రలోభాల ఎర..

Bargaining for Purchase of four TRS MLAs In Telangana
x

ఎమ్మెల్యేలకు ప్రలోభాల ఎర..

Highlights

*తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు.. హైదరాబాద్ శివారు ఫామ్‌ హౌస్ వేదికగా బేరసారాలు

Telangana: ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాల అంశం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. డబ్బులు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బేరసారాలకు వేదికగా నిలిచిన హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్ నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగే తతంగాన్ని పోలీసులు రికార్డు చేశారు. రికార్డు చేసిన దృశ్యాలు మీడియాకు విడుదల చేయడంతో చర్చనీయాంశంగా మారింది.

టీఆర్ఎస్‌కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారనే సమాచారం అందుకుని బేరాసారాలు ఆడిన వారిని అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. 'డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ తమను కొందరు ప్రలోభపెడుతున్నట్లు తెరాస ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వగా సోదాలు నిర్వహించాం. అజీజ్‌నగర్‌లోని ఫాంహౌస్‌లో కొందరు సమావేశమయ్యారని తెలిసింది.

ఢిల్లీలోని ఫరీదాబాద్‌ ఆలయంలో ఉండే రామచంద్రభారతి అలియాస్‌ సతీశ్‌శర్మ వీరితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఫాంహౌస్‌లో రామచంద్రభారతితోపాటు తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజి, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ ఉన్నారు. నందకుమార్‌ వీరిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రలోభపెడుతున్నట్లు సమాచారం అందింది. దర్యాప్తు చేసి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ రవీంద్ర తెలిపారు.

అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించడం.. సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేయడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌ దగ్గర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి దాదాపు 11 గంటల వరకూ జరిగిన పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేకెత్తించాయి.

ఎమ్మెల్యేలకు ప్రలోభాల ఎర.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన పరిణామాలపై పోలీసులు స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు నాటకీయ పరిణామాలను తలపిస్తున్నాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యద్శి డీకేఅరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టంచేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ నాటకీయ పరిణామాలను గుర్తుచేశారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. పొలిటికల్ బ్లాస్‌ తంతుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారిస్తాయన్నారు. మరో వైపు రాజకీయ పరిణాలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎమ్మెల్యేలు, ప్రగతి భవన్ చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, ప్రగతి భవన్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ప్రగతిభవన్‌ను భారీగా మోహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories