బండి సంజయ్‌ ప్రోటోకాల్ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతోంది?

బండి సంజయ్‌ ప్రోటోకాల్ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతోంది?
x
Highlights

రెండు అధికార పార్టీల మధ్య ప్రోటోకాల్ వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఒక ఎంపీకిచ్చే మర్యాద ఇదేనా అంటూ ఒక అధికార పార్టీ ఫైరవుతుంటే, అన్నీ ఆరోపణలే అంటూ...

రెండు అధికార పార్టీల మధ్య ప్రోటోకాల్ వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఒక ఎంపీకిచ్చే మర్యాద ఇదేనా అంటూ ఒక అధికార పార్టీ ఫైరవుతుంటే, అన్నీ ఆరోపణలే అంటూ పవర్‌లో ఉన్న మరో పార్టీ తిప్పికొడుతోంది. ఇక సోషల్ మీడియాలోనైతే, ఆ రెండు పార్టీల అనుచరులు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. రెండు పవర్‌ సెంటర్ల మధ్య వార్‌, ఇంత సెన్సిటివ్‌గా మారడానికి, ప్రోటోకాల్‌కు మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా?

కరీంనగర్‌లో ప్రోటోకాల్ వివాదం రోజురోజుకి ముదురుతోంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌‌కు అధికారులు ప్రోటోకాల్ ఇవ్వడం లేదంటూ తెలంగాణ రాష్ట్ర సిఎస్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీకృష్ణ. అటు లోక్‌సభ స్పీకర్‌కు సైతం ఈ ఫిర్యాదును పంపించారు.

కరీంనగర్‌ నుంచి బండి సంజయ్ ఎంపీగా గెలుపొందిన తర్వాత టిఆర్ఎస్ బీజేపీ నడుమ సంఘర్షణ మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ప్రోటోకాల్ విషయంలో ఫిర్యాదు దాకా వెళ్లడంతో రెండు పార్టీల మధ్య నడుస్తున్న వివాదాలు మరింత రచ్చకెక్కాయి. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో జరిగిన అభివృద్ధి పనుల్లో తనకు ఆహ్వానం అందలేదని, ఈ విషయంలో అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు బండి సంజయ్. ప్రజా ప్రతినిధిగా బండి సంజయ్ గెలిచిన తర్వాత కూడా అధికారులు ఏ ఒక్క విషయంలోనూ ప్రోటోకాల్ పాటించడంలేదని మండిపడుతున్నారు బిజెపి కార్యకర్తలు, నేతలు.

కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలో ఇటీవల ఎమ్మార్వో ఆఫీస్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాక, ప్రారంభోత్సవానికి ఉపయోగించిన శిలాఫలకంలో ఎంపీ బండి సంజయ్ పేరు పెట్టలేదని మండిపడ్డారు బీజేపీ నేతలు. అలాగే సిద్దిపేట జిల్లా కోహెడలోను లోక్‌సభ సభ్యుడికి బదులు రాజ్యసభ సభ్యుడిగా శిలాఫలకంపై నిర్లక్ష్యంగా పేరు వేయించారని ఫైరయ్యారు. ఇటీవల జరిగిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి, కాలువల శంకుస్థాపనలో ఎంపీ బండి సంజయ్‌కి కనీసం సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు బీజేపీ నేతలు. దీంతోపాటు ఇప్పుడు సమయం అయిపోతున్న ఎంపీపీ సభలకు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ బండి సంజయ్‌కు ఆహ్వానం ఇవ్వడంలేదని కాషాయ నేతల విమర్శ. ఇలా ప్రతి దానిలో అధికారులు ఎంపీ బండి సంజయ్‌ను అవమానిస్తున్నారని జిల్లా కలెక్టర్‌కు సైతం గతంలో ఫిర్యాదు చేశారు. అయితే అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో ఇప్పుడు రాష్ట్ర సీఎస్‌తో పాటు లోక్‌సభ స్పీకర్‌కు సైతం కంప్లైయింట్ చేశారు.

మరోవైపు టిఆర్ఎస్ నుంచి నామినేటెడ్ పదవిలో ఉన్న ఈద శంకర్రెడ్డి, రాజేశం గౌడ్ లాంటి వారికి సహాయ మంత్రి హోదాలో ప్రోటోకాల్ ఇస్తున్నారని కూడా బీజేపీ ఆరోపిస్తోంది. ఎంపీగా వారి కంటే ముందు శిలాఫలకాలపై బండి సంజయ్ పేరుండాలి. అలా ఉండకుండా నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి పేర్లు ఎలా పెడతారంటూ బీజేపీ నాయకులు అధికారుల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులకు సైతం బీజేపీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల నుంచి కరీంనగర్‌లో మొదలైన బీజేపీ, టీఆర్ఎస్ గొడవ పార్లమెంట్‌ ఎన్నికల నాటికి మరింత ముదిరి, ఎన్నికలైన తర్వాత కూడా కంటిన్యూ అవుతోంది. ప్రోటోకాల్‌ అవమానంపై పెద్దస్థాయిలోనూ పోరాడతామని బండి సంజయ్ వర్గం అంటోంది. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం, బండి సంజయ్ ఆరోపణలను ఖండిస్తున్నారు. అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి వివక్షా చూపడం లేదని అంటున్నారు. ఇటు నాయకుల్లో పరిస్థితి ఇలా ఉంటే అటు కార్యకర్తలు మరింత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బూతులు తిట్టుకుంటున్నారు. చూడాలి బండి సంజయ్ ప్రోటోకాల్ రగడ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories