Asaduddin Owaisi: జై పాలస్తీనా అంటూ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం, బీజేపీ అభ్యంతరం

Asaduddin Owaisi ‘Jai Palestine’ while taking oath BJP Protest
x

Asaduddin Owaisi: జై పాలస్తీనా అంటూ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం, బీజేపీ అభ్యంతరం

Highlights

Asaduddin Owaisi: జై పాలస్తీనా అనవద్దని రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు లేవన్నారు. చాలా మంది చాలా విషయాలు చెబుతున్నారు.. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని మాత్రమే చెప్పాను.. ఇది నిబంధనలకు ఎలా వ్యతిరేకమో చెప్పాలని ఆయన కోరారు.

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీ హైద్రాబాద్ ఎంపీగా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేస్తూ చివరలో జై పాలస్తీనా అనడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై కొందరు బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రొటెం స్పీకర్ ఈ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు.

పార్లమెంటులో మంగళవారం తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. వారిలో హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. ఆయన ఉర్దూలో ప్రమాణం చేశారు. హైద్రాబాద్ నుండి వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అసదుద్దీన్, ఈసారి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మాధవీలతను 3.38 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు

ఎంపీగా ప్రమాణం చేస్తూ చివరలో ఆయన ‘జైభీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అని అన్నారు. అసద్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే సమయంలో కొందరు బీజేపీ ఎంపీలు జైశ్రీరామ్ అని నినాదాలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ప్రమాణ స్వీకారం సమయంలో జై పాలస్తీనా అని తాను చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఓవైసీ సమర్ధించుకున్నారు. జై పాలస్తీనా అనవద్దని రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు లేవన్నారు. చాలా మంది చాలా విషయాలు చెబుతున్నారు.. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని మాత్రమే చెప్పాను.. ఇది నిబంధనలకు ఎలా వ్యతిరేకమో చెప్పాలని ఆయన కోరారు. ఇది తప్పని రాజ్యాంగంలోని ఏ నిబంధన చెబుతుందో చూపాలని ప్రశ్నించారు. పాలస్తీనా గురించి గాంధీ ఏం చెప్పారో చదవాలని ఆయన సూచించారు.

అయితే, బీజేపీ సభ్యులు అసద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఏ దేశాన్ని సమర్ధించమని, వ్యతిరేకించమని... సభలో ఏ దేశం పేరును ప్రస్తావించడం సరికాదని మాత్రమే చెబుతున్నామని పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.

ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జై పాలస్తీనా అంటూ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు శోభా కరంద్లాజే సహా కొందరు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాజ్ కు ఫిర్యాదు చేశారు. ఈ నినాదాన్ని రికార్డుల నుండి తొలగిస్తున్నట్టుగా ప్రొటెం స్పీకర్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే ప్రమాణం చేసే సమయంలో ఓవైసీ చేసిన నినాదం తప్పని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సభా నిబంధనలకు ఇది విరుద్దమని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ లో ఉంటూ భారత్ మాతాకీ జై అనడం లేదన్నారు. దేశంలో ఉంటూ రాజ్యాంగ విరుద్దమైన పనులు చేస్తున్నారని దీన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని కిషన్ రెడ్డి ఎఎన్ఐకి చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories