హైదరాబాద్‌లో బీదర్ పోలీసులపై దొంగల కాల్పులు... సినీఫక్కీలో పోలీస్ ఆపరేషన్

హైదరాబాద్‌లో బీదర్ పోలీసులపై దొంగల కాల్పులు... సినీఫక్కీలో పోలీస్ ఆపరేషన్
x
Highlights

Armed robbers opened fire at Bidar cops in Hyderabad: హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. అఫ్జల్‌గంజ్‌లో తమను పట్టుకోవడానికి...

Armed robbers opened fire at Bidar cops in Hyderabad: హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. అఫ్జల్‌గంజ్‌లో తమను పట్టుకోవడానికి వచ్చిన కర్ణాటక పోలీసులపై అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా కాల్పులు జరిపింది. పోలీసులు కూడా తిరిగి ఎదురు కాల్పులు జరపడంతో నిందితుల్లో ఒకరు గాయపడ్డారు. గాయపడిన నిందితుడిని హుటాహుటిన పక్కనే ఉన్న ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దొంగల కోసం బీదర్ పోలీసులు సినీఫక్కీలో జరిపిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలోని బీదర్‌లో ఒక అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ఎస్బీఐ ఏటీఎం వద్ద భారీ చోరీకి పాల్పడింది. ఏటీఎంలో నగదు లోడ్ చేసేందుకు వచ్చిన వాహనంపై దాడి చేసి రూ. 93 లక్షల నగదుతో పరారైంది. గురువారం నాడు బీదర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వెంటనే ప్రత్యేక బృందాలుగా విడిపోయి దర్యాప్తు జరిపిస్తున్నారు. అంతలోనే ఆ దొంగల ముఠా బీదర్ నుండి తప్పించుకుని హైదరాబాద్ వచ్చినట్లుగా వారికి స్పష్టమైన సమాచారం అందింది.

ఆ దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసుల బృందం హైదరాబాద్ చేరుకుంది. అఫ్జల్‌గంజ్‌లో ఆ దొంగల ముఠా కదలికలు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. బీదర్ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించే క్రమంలోనే నిందుతులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు.

బీదర్ నుండి రాష్ట్ర సరిహద్దులు దాటి హైదరాబాద్‌కు

బీదర్‌లో గురువారం చోరీకి పాల్పడిన దొంగల ముఠా గంటల వ్యవధిలోనే హైదరాబాద్ చేరుకోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. కర్ణాటక నుండి అంతర్ రాష్ట్ర సరిహద్దులు దాటి వారు తెలంగాణలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. మరి నగదుతో వారు పారిపోయి వస్తుంటే మధ్యలో చెక్ పోస్టులో ఎందుకు పట్టుబడలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories