రేపే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. పంచాయితీ తేలేనా..?

AP CM Chandrababu And Telangana CM Revanth Reddy Meeting
x

Telangana:ఇవాళ సాయంత్రం 6గంటలకు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

Highlights

Telugu States: రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు రావాల్సిన అంశాలపై రేపు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల భేటీ కానున్నారు.

Telugu States: రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు రావాల్సిన అంశాలపై రేపు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల భేటీ కానున్నారు. విభజన చట్టానికి పదేండ్లు పూర్తి కావటంతో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల అధికారుల స్థాయిలో ఇప్పటివరకు జరిగిన 30 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటిలో ఇప్పటికీ అమలు కాకుండా ఉన్న అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించాల్సిన అంశాలతో భేటీ ఎజెండాపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.

తెలుగురాష్ట్రాల మధ‌్య అపరిష్కృత సమస్యలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు ముందడుగు వేశారు. విభజన సమస్యలపై రేపు తెలంగాణ ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలు ఏంటి..? రెండు రాష్ట్రాల మధ్య ఝఠిలమైన సమస్యలు ఏఏ అంశాల్లో ఉన్నాయి..? వాటిని ఎలా సాధించుకోవాలనే దానిపై చర్చించనున్నారు. రాష్ట్ర విభజన తరవాత ఏపీ సీఎంగా చంద్రబాబు.. తెలంగాణ సీఎంగా కేసీఆర్ తో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల మధ్య జరగాల్సిన సంప్రదింపులకు మధ్యలోనే బ్రేక్ పడింది. విభజన అంశాలపై 2017లో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం రాజ్‌భవన్లో అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఓ మీటింగ్ జరిగింది. ఆ తరువాత ఏ మీటింగ్‌లు జరగలేదు. ఆ సమావేశంలో షెడ్యూల్ 9కి చెందిన 8 కుల సంఘాల సంస్థల విభజనకు ఇరుపక్షాల అంగీకారం కుదిరింది. మిగిలిన అంశాలుపై ఇరురాష్ట్రాలు ఏకాభిప్రాయనికి రాలేదు.

ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వాటిలో ప్రధానమైంది షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన. షెడ్యూల్ 9 లో మొత్తం 91 సంస్థలు ఉండగా, షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. షెడ్యూల్ 9 సంస్థల విషయంలో షీలా భిడే సిఫారసుల మేరకు 68 సంస్థల విభజనకు తెలంగాణా సుముఖంగా ఉంది.. మరో 23 సంస్థల విభజనపై తన అభ్యంతరాలను కేంద్రానికి తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఇచ్చిన హెడ్ క్వార్టర్ నిర్వచనం మేరకు షెడ్యూల్ 9 సంస్థల ఆస్తుల విభజనకు తమకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదని తెలంగాణ ఇప్పటికే తేల్చి చెప్పింది. అటు మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ కూడా ముందు ఇరుపక్షాలకు అంగీకారం ఉన్న సంస్థల విభజనతో ప్రక్రియ మొదలు పెట్టాల్సిందిగా సూచించింది. ఇందుకు నిరాకరించిన ఏపీ, మొత్తం ఆస్తుల విభజన ఒకేసారి జరగాలని పట్టుబట్టింది. షెడ్యూల్ 9 ప్రాపర్టీస్ హెడ్ క్వార్టర్ తోపాటు ఎక్కడున్నా పంచాలనే డిమాండ్‌ను నిబంధనలకు విరుద్ధంగా ముందుకు తెచ్చింది.

షెడ్యూల్ 10 సంస్థల విషయంలో జూన్ 2, 2014 నాటికి ఉన్న నగదును పంచుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం షెడ్యూల్ 10 సంస్థల ఆస్తులు ఎక్కడివి అక్కడే ఉంచి, ఉద్యోగుల విభజన చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ కూడా ఏపీ తన మొండివైఖరిని ప్రదర్శిస్తూ చట్టానికి అతీతంగా ఆ ఆస్తుల విభజన జరగాలని కోరుతుంది. ఇక షెడ్యూల్ 9లోని దిల్, ఆర్టీసీ, హౌజింగ్ కార్పొరేషన్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థలకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వేల కోట్ల ఆస్తులున్నాయి. దిల్ సంస్థకు 5 వేల ఎకరాలు, SFCకి 400ల ఎకరాలు, హౌజింగ్, ఆర్టీసీలకు రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల విలువైన భూములు, ఇతర ఆస్తులు ఉన్నాయి.. ఇందులోనూ వాటాలు కావాలని ఏపీ డిమాండ్ చేస్తూ వస్తుంది.

రాష్ట్ర విభజన తరవాత ఆస్తుల పంపకాల కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దాదాపు 31 సమావేశాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రతీ సందర్భంలో ఏపీ అమలు కానీ కోరికలు కోరుతూ వస్తుంది అంటున్నారు తెలంగాణ అధికారులు. రేపు జరుగనున్న సమావేశంలో విభజన చట్టం హామీలపై ఏ విధంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారో అన్న అంశం ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories