ఇద్దరు సీఎంలు మాట్లాడుకున్నారు. అనేక అంశాలపై చర్చించారు. గోదావరికి కృష్ణా నది దారి చూపాలని మాట్లాడుకున్నారు. కొన్ని పత్రికల్లో అవే పతాక...
ఇద్దరు సీఎంలు మాట్లాడుకున్నారు. అనేక అంశాలపై చర్చించారు. గోదావరికి కృష్ణా నది దారి చూపాలని మాట్లాడుకున్నారు. కొన్ని పత్రికల్లో అవే పతాక శీర్షికలయ్యాయి. కానీ ఓ ప్రధాన పత్రికలో మాత్రం, కేంద్రం చిన్నచూపు, సీఎంల అసంతృప్తి అంటూ బ్యానర్ వచ్చేసింది. దీంతో వెంటనే, ఆంధ్రప్రదేశ్ సీఎంవో ప్రకటన విడుదల చేసింది. అలాంటి విషయాలేం చర్చించలేదంటూ వివరణ ఇచ్చింది. ఇంత ఫాస్ట్‌గా సీఎంవో ఎందుకు రియాక్ట్ అయ్యింది, పత్రికా ప్రకటనకూ అంతగా వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్నదే ఇప్పుడు, హాట్‌హాట్ డిస్కషన్‌గా మారింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తరచుగా సమావేశమవుతున్నారు. గతంలో చంద్రబాబు, కేసీఆర్‌లు కూడా చాలాసార్లు కలిసి చర్చించారు కానీ, మూడు, నాలుగు నెలల్లోనే జగన్, కేసీఆర్‌లు కలిసినంతగా కలవలేదు. అప్పుడప్పడు భేటి అవడం, మళ్లీ వెంటనే పోటాపోటీ ప్రకటనలు, విమర్శలు చేసుకోవడంతోనే సరిపోయేది. కానీ ఇప్పటికైతే, తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య ఉన్న సఖ్యత, స్నేహపూరిత వాతావరణం చాలా బాగున్నట్టు కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రాజెక్టులు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలు, ఇంకా ఎన్నో అపరిష్కృత సమస్యలపై చర్చలు బాగానే జరుగుతున్నాయి. తాజాగా, మరోసారి ప్రగతి భవన్‌లో ఇద్దరూ సమావేశయ్యారు. కానీ ఈసారి మాత్రం, వీరి సమావేశానికి సంబంధించి, బయట హాట్‌హాట్ డిస్కషన్లు మంటలు రేపుతున్నాయి.
కేసీఆర్, జగన్‌ల సమావేశం వివరాలు, అంతర్గతంగా జరిగిన చర్చలపై ప్రధాన పత్రికల్లో పలురకాలుగా కథనాలు వచ్చాయి. కృష్ణాకు గోదావరి జలాల తరలింపు కోసం వివిధ ప్రత్యామ్నాయాల పరిశీలనపై చర్చించారంటూ, కొన్ని పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్‌లు పెట్టాయి. అయితే ఓ ప్రధాన పత్రికలో మాత్రం, మరో కథనం పతాకశీర్షికైంది. తెలుగు రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఇద్దరు సీఎంలు అసంతృప్తి వ్యక్తం చేశారన్నది ఆ కథనం సారాంశం. రాష్ట్రాల పరిధిలోని అంశాలపై రాజకీయ ధోరణి ఏంటి అంటూ ఒకరకంగా నిరసనస్వరం వినిపించారన్న కథనం వెలువరించారు. దీంతో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. ఇద్దరు సీఎంలు కేంద్రం తీరుపై అసంతృప్తి గళం వినిపించారన్న చర్చ మొదలైంది. అయితే, ఈ కథనాలు తప్పు అంటూ, ఆంధ‌్రప్రదేశ్ సీఎంవో ప్రకటన విడుదల చేయడం, ఈ ఎపిసోడ్‌లో అసలు ట్విస్టు.
పత్రికలు, ఛానెల్స్, వెబ్‌సైట్లు వారివారి సోర్స్‌ను బట్టి, భేటిలో జరిగిన విషయాలను ఆరా తీస్తుంటాయి. వాటినే పతాక శీర్షికలు వేస్తుంటాయి. ఇందులో కొన్నిసార్లు నిజం వుండొచ్చు, అబద్దాలూ ఉండొచ్చు వారివారి సోర్స్‌ను బట్టి, పత్రికా ధోరణిని బట్టి హెడ్‌లైన్స్ మారిపోతుంటాయి. కేవలం చర్చ జరిగిందన్న విషయం తెలిసిందన్న కోణంలోనే, ఊహాజనిత కథనాలు ఇస్తుంటాయి. ఇప్పుడు ఓ పత్రిక ఇదే తరహాలో కథనం వండివార్చింది. అయితే, ఆ కథనంపై ఏపీ సీఎంవో ఒక్కసారిగా భగ్గుమంది. అలాంటి చర్చలే జరగలేదు, సదరు పత్రిక కథనం పూర్తిగా కల్పితమని ప్రకటన విడుదల చేసింది. దినపత్రిక కథనాన్ని ఖండిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నాం, ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందని ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు ఈ ప్రకటనే రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.
సీఎంవో అంటే, సాక్షాత్తు సీఎం అనుకోవాలి. అంటే సీఎం వైఎస్ జగన్ ప్రకటన విడుదల చేసినట్టుగా భావించాల్సి వుంటుంది. సదరు పత్రిక కథనాన్ని ముఖ్యమంత్రే ఖండించారనుకోవాలి. ఎందుకు ఇలాంటి ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. రివర్స్ టెండరింగ్, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల రద్దుపై, మొదటి నుంచి కేంద్రం, ఏపీ సర్కారు తీరు పట్ల అసహనంగానే వుంది. కేంద్రం చర్యలపై జగన్ సర్కారు కూడా కోపంగానే వుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో పాటు అనేక విభజన హామీల ఆలస్యంపై, ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోతోందన్న కోపం వుంది. దీంతో సహజంగానే, కేంద్రం తీరుపట్ల సీఎం అసంతృప్తిగా వున్నారన్న చర్చ జరిగింది. తెలంగాణలో దూకుడు పెంచుతున్న బీజేపీ తీరుపై, కేసీఆర్‌లోనూ కాస్త కసి వుంది. అంటే ఇద్దరికీ కేంద్రం తీరుపట్ల కాస్త అసంతృప్తి వుందన్న చర్చ వుంది. ఇదే విషయంపై ఇద్దరూ మాట్లాడుకున్నారన్న ఓ పత్రికా కథనంపై మాత్రం, ఏపీ సీఎంవో మండిపడటమే హాట్‌హాట్ డిస్కషన్‌కు దారితీస్తోంది.
సీఎంవో ఎందుకు అలాంటి ప్రకటన విడుదల చేసిందన్న చర్చ జోరుగా సాగుతోంది. కేంద్రంతో సఖ్యత కాకుండా, సమరానికి తొడకొడతే, మొదటికే ఇబ్బందని జగన్ భావిస్తున్నారా, అందుకే ఈ వివరణ ఇచ్చారా అన్న డిస్కషన్ జరుగుతోంది. కేంద్రంతో ఇప్పుడే యుద్ధం వద్దని జగన్ భావిస్తున్నారనడానికి, ఈ ప్రకటనే నిదర్శనమంటూ కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇంతకీ అసంతృప్తి అంటూ వచ్చిన ఓ కథనం, వైసీపీ ప్రభుత్వంలో ఇంతగా ఎందుకు కదలిక తెచ్చింది?
ఇప్పుడు రెండు రాష్ట్రాలకూ గవర్నర్లు మారారు. కరడగట్టిన బీజేపీవాదులు గవర్నర్‌లు అయ్యారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రానికి నివేదికలు ఇస్తున్నారు. ఇద్దరు సీఎంల అసంతృప్తి అంటూ వచ్చిన కథనాన్ని చూపుతూ, సెంటర్‌కు రిపోర్ట్ ఇఛ్చే అవవకాశముంది. ఇదే జరిగితే, తమకు కేంద్రంతో సంబంధాలు చెడే అవకాశం వుందని, అది విపరీత పరిణామాలకు దారి తీయొచ్చని వైసీపీ ప్రభుత్వం భావిస్తుండొచ్చన్న చర్చ జరుగుతోంది. అందుకే ఓ ప్రధాన పత్రికలో వచ్చిన అసంతృప్తి హెడ్‌లైన్‌పై వెంటనే రియాక్ట్ అయ్యింది సీఎం ఆఫీస్. ఖండన ప్రకటన విడుదల చేసిందన్న డిస్కషన్ సాగుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే, కేంద్రం పట్ల అసంతృప్తి వున్నా, అది బయటకు రాకూడదని జగన్ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. కేంద్రం విషయంలో మరింత సహనంగా వుండాలని అనుకుంటున్నారని అర్థమవుతోంది. చంద్రబాబు సీఎంగా వున్న టైంలోనూ, నాలుగేళ్లు ఇలాగే వెయిట్ చేసి చేసి, చివరికి కేంద్రంపై దుమ్మెత్తిపోసి ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. మరి కేంద్రం నుంచి, రాష్ట్రానికి సవతి తల్లి ప్రేమే ఎదురైతే, జగన్ ఎంతకాలం సహిస్తారు, లేదంటే ఎలా సాధిస్తారన్నది కాలమే సమాధానం చెప్పాలి. అంతవరకూ, అసంతృప్తి అయినా, ఆగ్రహమైనా లోలోపలే రగిలపోవాలే తప్ప, పొరపాటున కూడా బయటపడకూదని, జగన్ సర్కారు భావిస్తోందని, అందుకు సీఎంవో ప్రకటనే నిదర్శమని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire