కేసీఆర్ ఢిల్లీ టూర్..ప్రధానిని కలుస్తారా?

కేసీఆర్ ఢిల్లీ టూర్..ప్రధానిని కలుస్తారా?
x
Highlights

సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. కొద్దిరోజుల కిందే ముఖ్యమంత్రి కార్యాలయం.. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. రెండు మూడురోజుల పాటు...

సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. కొద్దిరోజుల కిందే ముఖ్యమంత్రి కార్యాలయం.. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. రెండు మూడురోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న కేసీఆర్ ప్రధాని మోడీతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక అటు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ కేసీఆర్ భేటీ కానున్నారని సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులపై.. ప్రధాని, ఆర్థికమంత్రితో చర్చిస్తారని తెలుస్తోంది.

కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. హస్తినకు వెళ్తున్న కేసీఆర్ అక్కడ రైతు ఆందోళనల్లో పాల్గొని వారికి సంఘీభావం తెలిపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయ్. ఈ మధ్య రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు మద్దతు తెలపడంతో పాటు రాష్ట్రంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లోనూ టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్ త్వరలోనే జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎలా సాగనుందన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది.

ఢిల్లీలోని వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేంద్రం స్థలం కేటాయించింది. అయితే అక్కడ ఆఫీస్ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కరోనా పరిస్థితులు కాస్తలో కాస్త మెరుగుపడుతున్న వేళ కేసీఆర్ ఢిల్లీ వెళ్తుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం డిసెంబర్ రెండోవారంలో జాతీయస్థాయి నేతలతో సమావేశం అవుతామన్న కేసీఆర్ హస్తిన వేదికగా అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories