హైదరాబాద్‌లో పొల్యూషన్ భూతం... 11 ఏళ్ళలో వాయు కాలుష్యానికి 5,552 మంది మృతి

Air pollution behind 7% of deaths in 10 cities in India
x

హైదరాబాద్‌లో పొల్యూషన్ భూతం... 11 ఏళ్ళలో వాయు కాలుష్యానికి 5,552 మంది మృతి

Highlights

హైద్రాబాద్ నగరం వాయు కాలుష్యంలో దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. దిల్లీ, ముంబై, బెంగుళూరు, పుణె, చెన్నై నగరాల తర్వాత హైద్రాబాద్ నిలిచింది.

హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం గత దశాబ్దకాలంలో 5,552 మంది మరణానికి కారణమైందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ మరణాలు 2008 నుంచి 2020 మధ్యకాలంలో చోటు చేసుకున్నాయి.

లాన్సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ విడుదల చేసిన ‘యాంబియెంట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ డెయిలీ మోర్టాలిటీ ఇన్ 10 సిటీస్ ఆఫ్ ఇండియా’ రిపోర్ట్ జర్నల్ అధ్యయనం ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది. హైదరాబాద్‌లో ఒక్క 2023లోనే వాయు కాలుష్యానికి సంబంధించిన మరణాల సంఖ్య 1,597కు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది.

వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న టాప్ -10 నగరాలలో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఈ వరుసలో దిల్లీ నంబర్ వన్ స్థానంలో ఉండగా, తరువాత స్థానాల్లో ముంబయి, బెంగళురు, పుణె, చెన్నై నగరాలున్నాయి.

దిల్లీలో వాయు కాలుష్యంతో ప్రతి ఏటా 12 వేల మంది మరణిస్తున్నారు. సిమ్లాలో 2008-2019 మధ్యకాలంలో 59 మంది చనిపోయారు.ఈ 11 ఏళ్లలో బెంగళూరులో 2,100 మంది, చెన్నైలో 2,900 మంది, ముంబైలో 5,100 మంది ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న కాలుష్య మరణాలు

వాయు కాలుష్యంతో హైద్రాబాద్‌లో ఏటా 1,597 మంది మరణిస్తున్నారని లాన్సెట్ రిపోర్ట్ తెలిపింది. గాలి నాణ్యత రోజు రోజుకు పడిపోతోన్నందున ప్రజలు శ్వాసకోశ వ్యాధులబారిన పడుతున్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని సనత్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కొంపల్లి, ఆబిడ్స్, గచ్చి బౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని సూచించే పార్టిక్యులేట్ మ్యాటర్.. పీఎం 2.5స్థాయి 80 నుంచి 100 రేంజిలో ఉంది.

భారత్‌కు చెందిన పరిశోధకులు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలోని టాప్ -10 నగరాల్లో వాయు కాలుష్యం డబ్ల్యు.హెచ్.ఓ నిర్దేశించిన పరిమితులకన్నా చాలా ఎక్కువగా ఉంది. ఒక క్యూబిక్ మీటర్ పరిధిలో 15 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా పీఎం 2.5 ఉండకూడదని డబ్ల్యుహెచ్ఓ సూచిస్తోంది. అయితే, హైదరాబాద్ తో పాటు ఈ పది నగరాల్లో ఏడాదిలో 99.8 శాతం రోజుల్లో కాలుష్యం ఇంతకన్నా ఎక్కువ ఉందని లాన్సెట్ రిపోర్ట్ తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం భారతదేశంలోని చాలా నగరాల్లో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా మారింది. గాలిలో పీఎం 2.5 కణాల స్థాయి అధికంగా ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, నరాల బలహీనత, గర్భధారణ సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక సూచిస్తోంది.

ప్రజా రవాణ వ్యవస్థను మెరుగుపర్చాలి

హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 80 లక్షలు దాటింది. పారిశ్రామిక కాలుష్యంతో పాటు వాహన కాలుష్యం ఇక్కడి జీవన ప్రమాణాలపై ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యను ఎంతో కొంత తగ్గించడానికి ప్రజా రవాణ వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవసరమైన మార్గాల్లో, తగిన సమయాల్లో బస్సులు, మెట్రో రైళ్లను తగిన సంఖ్యలో ప్రవేశ పెడితే వాయు కాలుష్యం తగ్గేందుకు అవకాశం ఉంది.

ప్రజా రవాణా వ్యవస్థలు తగినంతగా లేకపోవడం వల్లే ప్రజలు సొంత వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. ప్రజలు కూడా పర్యావరణ హితం కోసం తమవంతు సహకారం అందించాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా పురుషోత్తం రెడ్డి ప్రభుత్వానికి సూచిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉన్నట్లుగానే స్టేట్ హెల్త్ పాలసీని తీసుకురావాలని ఆయన అన్నారు.

కాలం చెల్లిన వాహనాలు కూడా నగర కాలుష్యానికి ప్రధాన కారణంగా మారాయి. కాలం చెల్లిన వాహనాలను వెంటనే సీజ్ చేయాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల స్థానంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను తీసుకు రావాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం. పద్మనాభరెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories