ఇద్దరు మిత్రుల మధ్య మెట్రో పంచాయతీ రాజేస్తోందా.. నాడు భూసేకరణను అడ్డుకున్నది ఎవరు?

ఇద్దరు మిత్రుల మధ్య మెట్రో పంచాయతీ రాజేస్తోందా.. నాడు భూసేకరణను అడ్డుకున్నది ఎవరు?
x
Highlights

సీఎం కేసీఆర్‌, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రోను గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. కానీ కేసీఆర్‌కు అత్యంత మిత్రుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు మాత్రం, ఆగ్రహం...

సీఎం కేసీఆర్‌, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రోను గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. కానీ కేసీఆర్‌కు అత్యంత మిత్రుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు మాత్రం, ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ సర్కారుపై అసద్‌కు కోపమేంటి? రెండు పార్టీలూ అనేక ఎన్నికల్లో ఫ్రెండ్లీగా పోటీ చేశాయి కదా ఎందుకంత ఆగ్రహం? ఇద్దరు మిత్రుల మధ్య మెట్రో పంచాయతీ ఏంటి? అసలు పంచాతీయ కప్పిపుచ్చుకోవడానికే అసద్‌ విమర్శలా?

హైదరాబాద్‌ మహానగరానికి మణిహారమైన మెట్రో ప్రాజెక్టు చివరి కారిడార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌ పక్కనే నిర్మించిన మెట్రో స్టేషన్‌లో, మెట్రో రైలుకు పచ్చజెండా ఊపారు కేసీఆర్. జేబీఎస్‌ రూట్‌లో ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న సందర్భమిది. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన కామెంట్ కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌ మెట్రో రైలు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒవైసీ. ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ వరకు మెట్రో పనులు పూర్తి చేశారు గానీ ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నామా మార్గంలో పనులు ఎప్పుడు మొదలుపెడతారని ప్రశ్నించారు. 'దార్‌ ఉల్‌ షిఫా నుంచి ఫలక్‌నామా మెట్రో లైన్‌ సంగతి ఏంటి? జేబీఎస్‌ మార్గాన్ని పూర్తి చేశారు గానీ దక్షిణ హైదరాబాద్‌ విషయానికి వచ్చే సరికి మీ దగ్గర సమాధానం ఉండదు. ఇదైతే ఇంకా అద్భుతం జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మార్గాన్ని పూర్తి చేయడానికి నిధులు ఉన్నాయి. మరి ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా పనులు ఎప్పుడు మొదలు పెడతారు. ఎప్పుడు పూర్తి చేస్తార'ని అసదుద్దీన్‌ ట్విటర్‌ వేదికగా హైదరాబాద్‌ మెట్రో రైలు యాజమాన్యంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

అసదుద్దీన్‌ ఒవైసీ తన విమర్శలలో ఎక్కడా కేసీఆర్‌ పేరుగానీ, టీఆర్ఎస్‌ పేరుగానీ ప్రస్తావించలేదు. కేవలం మెట్రో యాజమాన్యాన్నే ప్రశ్నించారు. అయితే, కేసీఆర్‌ గ్రాండ్‌గా ప్రారంభించినవేళ, అసద్‌ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కేసీఆర్‌కే తగులుతున్నాయన్నంటున్నారు విశ్లేషకులు. మెట్రో యాజమాన్యాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సూచించేది, ఆదేశించేది, కేసీఆరే. కానీ టీఆర్ఎస్‌ అధినేత పేరును ఎక్కడా ప్రస్తావించలేదు అసద్. అయితే అసద్‌ బయటకు మెట్రో యాజమాన్యాన్ని తిడుతున్నా, పరోక్షంగా కేసీఆర్‌నే టార్గెట్‌ చేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే, మెట్రో చివరి కారిడార్‌పై, అసద్‌ చేస్తున్న కామెంట్ల వెనక వ్యూహముందంటున్నారు నేతలు.

జేబీఎస్, ఎంజీబీఎస్‌లను అనుసంధానం చేస్తూ మెట్రో కారిడార్ 2 నిర్మించారు. తొలుత జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 15 కి.మీ మేర మెట్రో ప్రతిపాదించినా, అది ఆగిపోయింది. దీంతో పాతబస్తీ రూట్‌‌లోని ఐదు కిలోమీటర్ల మినహా మొత్తం ఈ కారిడార్‌ పూర్తయ్యింది. ఫలక్‌నుమా ఐదు కిలోమీటర్ల మార్గం ఎందుకు ఆగిపోయిందన్నది తాజాగా, అసదుద్దీన్‌ ప్రశ్న. ఇందుకు సమాధానం కూడా ఆయనేనన్నది ఇతర పార్టీల విమర్శలు. ఎందుకంటే, అక్కడ స్థల సేకరణ మెట్రోకు చాలా కష్టమైంది. అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ప్రతిఘటన ఎదురైంది. పురాతనకాలం నాటి కట్టడాలు వున్నాయని, వీటిని మినహాయించి, రూట్‌ మార్చాలని నాడే బట్టుబట్టారు అసద్. వందలాదిమంది చిరు వ్యాపారులు జీవనం కోల్పోతారని, ఇళ్లు ధ్వంసమవుతాయని, అసద్‌, ఆ‍యన తమ్ముడు అక్బరుద్దీన్‌‌తో పాటు ఇతర ఎంఐఎం నేతలే అడ్డుపడ్డారన్న ఆరోపణలున్నాయి. ఒకానొక స్థాయిలో అసలు మెట్రోనే వీళ్లు వద్దన్నారన్న మాటలు వినపడ్డాయి. ఎంఐఎం డిమాండ్ల ప్రకారం వెళ్లాలంటే, స్థలసేకరణ, పరిహారం, ఖర్చు తడిసిమోపెడవుతుందని, నిర్మాణమే ఆపేసింది మెట్రో. అంటే, ఫలక్‌నుమా మెట్రో నిర్మాణం ఆగిపోయిందంటే, అందుకు ముమ్మాటికి కారణం అసదుద్దీన్ అండ్‌ బ్యాచేనన్నది నగరవాసుల విమర్శ. కానీ బయటకు మాత్రం, మరో మాట మాట్లాడుతున్నారు అసదుద్దీన్.

నాగోల్‌ టు రాయదుర్గ్‌, ఎల్బీనగర్‌ టు మియాపూర్‌ మార్గాలు ఇప్పటికే ఫుల్‌జోష్‌లో రన్‌ అవుతున్నాయి. ఇప్పుడు మరో కీలకమైన జేబీఎస్-ఎంజీబీఎస్‌ మార్గం పట్టాలెక్కింది. కానీ పాతబస్తీలోనే మెట్రో కూతలేదు. దీంతో మిగతా నగరమంతా మెట్రో వచ్చింది, తమకు మాత్రం రాలేదని పాతబస్తీవాసులు అసంతృప్తిగా వున్నారు. దీనికి తనే కారణమంటారని భావిస్తున్న అసద్, ఆ నెపాన్ని మెట్రో యాజమాన్యంపై నెట్టేయడానికే, ఇలాంటి ఎదురుదాడి చేస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పాతబస్తీ వెనకబడిపోవడానికి ఎంఐఎం కారణమన్న విమర్శలకు లెక్కేలేదు. అక్కడ ఏ అభివృద్దినీ జరగనివ్వకుండా, వీళ్లు అడ్డుకుంటారన్న విమర్శలున్నాయి. మెట్రో ఆగిపోవడానికీ వీరే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఆ పాపం తనపై పడకుండా, మెట్రో యాజమాన్యంపై నెట్టేయడానికే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి జేబీఎస్-ఎంజీబీఎస్‌ మెట్రో కారిడార్‌, కేసీఆర్‌ ప్రారంభించిన వేళ, అసదుద్దీన్ చేసిన కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిజంగా అసద్ కోపం, మెట్రో యాజమాన్యంపైనా, లేదంటే తన మిత్రుడు కేసీఆర్‌పైనా అన్నదానిపై ఎవరికివారు భాష్యాలు చెప్పుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories