Moinabad Farmhouse Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం..!

Moinabad Farmhouse Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం..!
x
Highlights

* రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు

Moinabad Farm House Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో మొయినాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతి ఇచ్చింది. రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను ఇవాళ, రేపు పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు.

ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని ఆ తర్వాత తిరిగి చంచల్​గూడ జైలుకు పంపించాలని న్యాయస్థానం షరతు విధించింది. దీంతో పోలీసులు చంచల్‌గూడలో జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి స్వామీజీలను కస్టడీలోకి తీసుకొనున్నారు. ముగ్గురు నిందితులను ప్రశ్నించడం ద్వారా కేసులో పురోగతి సాధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కానీ కోర్టు నిందితులను రెండు రోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ముగ్గురు నిందితులు ఉన్నారు. ఇక నిందితుల బెయిల్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది నాంపల్లిలోని ఏసీబీ కోర్టు.

మరోవైపు ఫామ్ హౌజ్ కేసుపై విచారణ కోసం సిట్ ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన మరునాడే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం గమనార్హం. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సిట్ పనిచేయనుందని సర్కారు ఉత్తర్వుల్లో తెలిపింది. సిట్ లో సీవీ ఆనంద్ తో పాటు ఆరుగురు పోలీసు ఉన్నతాధికారులను నియమించింది. సిట్ సభ్యుల్లో నల్లగొండ SP రమా రాజేశ్వరి, సైబరాబాద్ DCP కపిలేశ్వర్, శంషాబాద్ DCP జగదీశ్వర్ రెడ్డి, నారాయణ్ పేట్ SP వెంకటేశ్వర్లు, రాజేంద్ర నగర్ ACP గంగాధర్, మొయినాబాద్ CI లక్ష్మిరెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories