Telangana Polling Percentage: తెలంగాణలో 70.66 శాతం పోలింగ్‌ నమోదు

70.66 Percent Voting in Telangana
x

Telangana Polling Percentage: తెలంగాణలో 70.66 శాతం పోలింగ్‌ నమోదు

Highlights

Telangana Polling Percentage: ఆఖరి గంటలో అనూహ్యంగా పెరిగిన ఓటింగ్‌

Telangana Polling Percentage: రాష్ట్రంలో రానున్న అయిదేళ్ల పాలనను వేలికొనలతో నిర్ణయించేందుకు పల్లె ఓటర్లు బారులు తీరగా.. పట్టణాలు, నగరాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. చెదురుమదురు సంఘటనలు మినహా గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 70.66 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ల వివరాలను ఇంకా లెక్కలో చేర్చలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పరిధిలో కేవలం 46.56 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03 శాతం రికార్డయింది. తదుపరి స్థానాల్లో మెదక్‌ (86.69), జనగామ (85.74), నల్గొండ (85.49), సూర్యాపేట (84.83%) జిల్లాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో గరిష్ఠంగా 91.51 శాతం, యాకుత్‌పురలో అత్యల్పంగా 39.69 శాతం నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో 73.37 శాతం ఓటింగ్‌ నమోదైంది.

సుమారు 30 కేంద్రాలలో మొరాయించిన ఈవీఎంలు

మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నిక జరగగా.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డిఖానాపూర్‌లో రాత్రి 8 గంటల వరకు, షాద్‌నగర్‌ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని గూడూరు, తిమ్మాపూర్‌లలోని పోలింగ్‌ కేంద్రాలలో రాత్రి 8.30 దాటాక కూడా పోలింగ్‌ జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో 9.30 వరకు సాగింది. సాయంత్రం అయిదు గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉండటంతో వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. తీవ్రవాద ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ముగియగా అక్కడ కూడా అప్పటికే క్యూలలో ఉన్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కామారెడ్డి, జనగామ, ముథోల్‌, ఇబ్రహీంపట్నం, అచ్చంపేట, పినపాక, పాలేరు, వరంగల్‌ తూర్పు తదితర నియోజకవర్గాల్లో స్వల్ప సంఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు 25 నుంచి 30 కేంద్రాల పరిధిలో ఈవీఎంలు మొరాయించటంతో సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు పోలింగ్‌ ఆలస్యమైంది. పలు ప్రాంతాల్లో భారాస అభ్యర్థులు పార్టీ కండువాలతో కేంద్రాలకు రావటం వివాదమైంది. ఎన్నికల అధికారులు కేసులు నమోదు చేశారు.

ఉదయం నెమ్మదిగా ప్రారంభమై..

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ‘ఈనాడు’ పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించగా ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైనా హైదరాబాద్‌ నగరంతోపాటు శివారుల్లోనూ నెమ్మదిగానే ప్రారంభమయింది. 10 గంటల తర్వాత క్రమంగా పుంజుకుంది. మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 30 శాతం కూడా పోలింగ్‌ దాటలేదు. అయితే ఇదే నియోజకవర్గాల పరిధిలోని కందుకూరు, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలలో ఇదే సమయానికి 65 శాతం దాటింది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, గేటెడ్‌ కమ్యూనిటీ వాసులు, సాఫ్ట్‌వేర్‌ తదితర రంగాలకు చెందిన ఉద్యోగులు నగరంలోని పోలింగ్‌ కేంద్రాల్లో మధ్యాహ్నం తర్వాత పెద్ద సంఖ్యలో వరుసల్లో కనిపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పరిధిలోని పది పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 16 వేల ఓటర్లు ఉండగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో రద్దీ ఏర్పడింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని నార్సింగ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు కూడా మధ్యాహ్నం ఓటర్లు పోటెత్తారు. ఇక్కడ నిర్మాణాలు కొనసాగుతుండటంతో ఓటర్లు వచ్చిపోయేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. షామియానాలు ఏర్పాటు చేసినప్పటికీ చాలాచోట్ల వరుసలు భారీగా ఉండటంతో ఓటర్లు ఎండకు ఇబ్బందులు పడ్డారు.

తాయిలాల మోత

ఒకటి రెండు రోజులుగా ఓటర్లకు తాయిలాలు అందించిన కొన్ని పార్టీల నేతలు.. పోలింగ్‌ సమయంలోనూ నగదు పంపిణీకి పోటీ పడ్డారు. పట్టణాలు, గ్రామీణం అన్న వ్యత్యాసం లేకుండా ఇది సాగింది. చాలాచోట్ల మద్యం అందించి, చికెన్‌ భోజనం పెట్టారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం మండలాల్లో పలు కేంద్రాల వద్ద ఈ పరిస్థితి కనిపించింది. ఇతర ప్రాంతాల నుంచి ఓటేసేందుకు తరలివచ్చిన వారికి రూ.వెయ్యి వరకు నగదు ఇచ్చారని కందుకూరులో కొందరు తెలిపారు. ఓ ప్రధాన పార్టీ వారు కొందరికి నగదు ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంతో పలువురు ఓటేసేందుకు రాలేదని యాచారంలో పలు కేంద్రాల వద్ద ఓటర్లు తెలిపారు. డబ్బులు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ పార్టీలు వాహనాలు సమకూర్చి మరీ ఓటర్లను కేంద్రాలకు రప్పించాయి.

12 గంటల వరకు ఓటింగ్‌కు దూరం

తమ గ్రామాన్ని పంచాయతీగా ప్రకటించనందుకు నిరసనగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కొత్త వరిపేట, వరిపేట గ్రామస్థులు ఓటింగ్‌ను బహిష్కరించారు. గ్రామానికి అవసరమైన కనీస సదుపాయాలను కల్పించటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోథ్‌ నియోజకవర్గం పరిధిలోని గొల్లఘట్‌ గ్రామంవారు ఓటింగ్‌కు వెళ్లేందుకు నిరాకరించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అధికారులు గ్రామస్థులకు నచ్చచెప్పటంతో ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు.

స్వల్పంగా ఉద్రిక్తతలు

వరంగల్‌ తూర్పులో అయిదు గంటలు దాటిన తర్వాత వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతించకపోవటంతో ఓటర్లు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగజ్‌నగర్‌ పట్టణంలో భారాస ఏజెంట్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఇతర పార్టీల కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడగా చెదరగొట్టే క్రమంలో పోలీసు అధికారులకు కూడా గాయాలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories