Telangana: తెలంగాణలో 61% మందిలో యాంటీబాడీలు

61 Percent People Have Antibodies in Telangana
x

Sero survey Report (file image)

Highlights

Telangana: రెండు డోసులతో 94% యాంటీబాడీలు * 6-9 ఏళ్ల పిల్లలు 55% మందిలో ప్రతినిరోధకాలు

Telangana: టీకా తీసుకున్నవారిలో యాంటీబాడీలు అభివృద్ది చెందాయని.. ఎలాంటి సంకోచం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఐసీఎంఆర్‌ - ఎన్‌ఐఎన్ సూచించింది. కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారికి 94 శాతం యాంటీబాడీలు సమకూరాయని పరిశోధనలో తేలింది. ఒక్క డోసు తీసుకున్న వారిలో 78.5 శాతం యాంటీబాడీలు వృద్ధి చెందాయని సర్వే తెలిపింది. ఇలా తెలంగాణలో మొత్తమ్మీద 60.01 శాతం మందిలో యాంటీబాడీలు సమకూరాయని ఎన్‌ఐఎన్‌ తెలిపింది. త్వరగా అందరూ వ్యాక్సిన్‌ వేసుకునేలా ప్రభుత్వ యంత్రాంగం ప్రోత్సహించాలని నిపుణులు సూచించారు. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన నాలుగో విడత సర్వేలో తొలిసారిగా 6-9 ఏళ్ల చిన్నారులను పరీక్షించామని.. 55 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించామని తెలిపారు. యుక్తవయసువారికి 61 శాతం యాంటీబాడీలు సమకూరాయన్నారు.

రాష్ట్రంలోని జనగామ, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో జాతీయ పోషకాహార సంస్థ నిర్వహించిన నాలుగో విడత సీరో సర్వేలో 61 శాతం ప్రజల్లో కరోనా యాంటీబాడీలున్నట్లు తేలింది. ఈసారి 6 నుంచి 9 ఏళ్ల మధ్య వయసు పిల్లలపైనా అధ్యయనం సాగించారు. ఈ విభాగంలో 55 శాతంమందిలో ప్రతినిరోధకాలు గుర్తించారు. పెద్దల్లో 61 శాతం, టీకా వేసుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో 82.4 శాతం యాంటీబాడీలున్నట్లు స్పష్టమైంది.

గత మూడు విడతలతో పోల్చితే ప్రస్తుత సర్వేలో యాంటీబాడీలున్నవారి శాతం గణనీయంగా పెరిగింది. 2020 మేలో నిర్వహించిన తొలి సర్వేలో 0.33 శాతం, ఆగస్టులో చేసిన రెండో సర్వేలో 12.5 శాతం, డిసెంబరులో నిర్వహించిన మూడో సర్వేలో 24 శాతం మందిలో యాంటీబాడీలున్నట్లు గతంలో ప్రకటించారు. టీకా ఒక్క డోస్‌ వేయించుకున్నవారిలో 78.5 శాతం, రెండు డోసులు పొందినవారిలో 94 శాతం ప్రతినిరోధకాలున్నట్లు సర్వేలో స్పష్టమైంది. అసలు వ్యాక్సిన్‌ తీసుకోనివారిలో 51.3 శాతం ప్రతినిరోధకాలు గుర్తించారు. కాగా, డిసెంబరులో ఇదే జిల్లాల్లో చేసిన మూడో సర్వేలో 24 శాతం మందిలో యాంటీబాడీలున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అది 61 శాతానికి పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories