1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు సంచలన విషయాలు

1200 Phones Tapped Says Praneeth Rao
x

1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు సంచలన విషయాలు

Highlights

జడ్జీలు, రాజకీయ నేతలు, మీడియా పెద్దలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశాం- ప్రణీత్‌రావు

Praneeth Rao Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు పోలీసుల కస్టడీలో సంచలన విషయాలు వెల్లడించారు. దాదాపు పన్నెండు వందల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో తెలిపారు. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతల కుటుంబసభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిపారు. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు ప్రణీత్‌రావు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించగా.. మరో ఐదు ఫోన్లతో అనధికారికంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్లు తెలిపాడు. ప్రతిపక్షాలకు ఆర్థికంగా సహాయం చేస్తున్న వాళ్ల డబ్బులను ఎప్పటికప్పుడు పట్టుకున్నట్లు తెలిపాడు. ఇక పట్టుకున్న నగదును మొత్తం ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదుగా రికార్డుల్లో చూపించినట్లు కస్టడీ విచారణలో తెలిపారు.

ఇక ఫోన్ ట్యాపింగ్‌లో కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంత్‌ల సహాయంతో ట్యాపింగ్‌ను విస్తృతంగా చేసినట్లు విచారణలో పేర్కొన్నాడు. ప్రభాకర్‌రావు ఆదేశాలతో17 సిస్టమ్‌ల ద్వారా ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. రెండు లాగర్‌ రూమ్‌లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పేర్కొన్నాడు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచే ట్యాపింగ్‌ను నిలిపివేసినట్లు తెలిపాడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్‌రావు చెప్పాడన్నారు ప్రణీత్‌రావు. ప్రభాకర్‌రావు రాజీనామా చేసి వెళ్లిపోతూ ట్యాపింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని మొత్తం ధ్వంసం చేయాలని ఆదేశించాడని తెలిపాడు ప్రణీత్‌రావు. ప్రభాకర్‌రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్‌డిస్క్‌లను తీసుకొచ్చినట్లు తెలిపాడు. పాత వాటిలో కొత్త హార్డ్‌డిస్క్‌లను ఫిక్స్ చేసినట్లు విచారణలో తెలిపాడు ప్రణీత్‌రావు.

మరో వైపు అత్యంత కీలక సమాచారమున్న 17 హార్డ్‌డిస్క్‌లను కట్టర్‌తో కట్‌చేసి ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాడు. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్‌తో ఐడీపీఆర్ డేటా మొత్తాన్ని కాల్చివేసినట్లు తెలిపాడు. పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌, ల్యాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్న డేటా మొత్తాన్ని తొలగించినట్లు తెలిపాడు ప్రణీత్‌రావు. ధ్వంసం చేసిన హార్డ్‌డిస్కులన్నిటిని నాగోల్, మూసారాంబాగ్ మూసీ నదిలో పడేసినట్లు తెలిపాడు. ఫార్మాట్ చేసిన సెల్‌ఫోన్లు, పెన్ డ్రైవ్‌లన్నీ బేగంపేట్‌ నాలాలో పడేసినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు ప్రణీత్‌రావు.


Show Full Article
Print Article
Next Story
More Stories