ఆదిలాబాద్‌ గులాబీ నేతల కొత్త టెన్షన్‌‌కు కారణమేంటి?

ఆదిలాబాద్‌ గులాబీ నేతల కొత్త టెన్షన్‌‌కు కారణమేంటి?
x
Highlights

ఆ పార్టీది పాల పొంగేనన్నారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తమకు ప్రత్యర్థే కాదని నవ్వారు. ఇప్పుడదే పార్టీ కొరకురాని కొయ్యలా మారుతోంది. అదే అభ్యర్థి మేకులా...

ఆ పార్టీది పాల పొంగేనన్నారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తమకు ప్రత్యర్థే కాదని నవ్వారు. ఇప్పుడదే పార్టీ కొరకురాని కొయ్యలా మారుతోంది. అదే అభ్యర్థి మేకులా తయారయ్యారు అంతేకాదు, రెండు బలమైన పార్టీల నేతలకు, ఆ జాతీయ పార్టీ గాలం వేస్తుండటంతో, సదరు పార్టీల నాయకులు సైతం కలవరపడుతున్నారట.

సోయం బాపురావు. ఆదిలాబాద్‌ ఆదివాసీ సంఘం నాయకుడు. గిరిపుత్రుల హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాడిన, పోరాడుతున్న నాయకుడు. ఇప్పుడాయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్. బీజేపీ ఎంపీ. మొన్నటి వరకూ సోయం బాపురావును ఒక సాధారణ ఆదివాసీ నాయకుడిగానే చూసి, పెద్దగా పట్టించుకోలేదు రాజకీయ పార్టీలు. ముఖ్యంగా అధికార పార్టీలు. కానీ బీజేపీ తరపున సోయం గెలవడం చూసి, ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. అంతేకాదు, సోయం బాపురావు ద్వారా ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన బీజేపీ, ఇక జిల్లా నలుమూలలా విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తుండటంతో, కాంగ్రెస్‌ నేతలకే కాదు గులాబీ నేతల్లోనూ కలవరం పెరుగుతోంది.

ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి ఆదరణ అంతంత మాత్రమే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ సీన్ మారింది. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ఎంపీగా విజయం సాధించడంతో టీఆర్‌ఎస్ నాయకులు షాకయ్యారు. అదేవిధంగా జడ్పీ ఎన్నికల్లో సైతం బీజేపీ సత్తాచాటడం, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌-టీఆర్ఎస్‌ మధ్యే పోటీ అనుకున్నారు. కాని ఎంపీ, జడ్పీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారడం గులాబీ నాయకులకు మరింత గుబులు పుట్టిస్తోందట. ఏకులాంటి సోయం, మేకుగా మారుతున్నాడని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు, ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారట. ఇప్పడే పరిస్థితి ఇలా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి టీఆర్ఎస్‌కు ముప్పు తప్పదని, రాబోయే ప్రమాదం గురించి ముందుగానే అంచనా వేసుకుంటున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. లోక్‌సభ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాలు వస్తే, టీఆర్ఎస్‌ బాధ్యులకు అధిష్టానం నుంచి మొట్టికాయలు తప్పవన్న చర్చ కూడా జరుగుతోంది.

మరోవైపు బీజేపీలో చేరడానికి కొందరు టిఆర్ఎస్ నాయకులు టచ్‌లో ఉన్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు మరింత ఆందోళన పుట్టిస్తోంది. పైకి టీఆర్ఎస్ నేతలు, బీజేపీ లీడర్లతో టచ్‌లో ఉన్నారన్న వార్తలను ఖండిస్తున్నా ,లోపల మాత్రం కాస్త కంగారునే ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో బీజేపీ అభయం ఇస్తే, టీఆర్ఎస్‌ నుంచి చేరడానికి అసంతృప్తి నాయకులు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.

అలాగే టీఆర్ఎస్ నేతలే కాదు కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా కమలం గూటికి చేరడానికి సిద్దంగా ఉన్నారని ఆదిలాబాద్ జిల్లాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసిఫాబాద్, ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో కొంతమంది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరడానికి ట్రై చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బే. మొత్తానికి ఆదిలాబాద్‌ జిల్లాలో బీజేపీ దూకుడు టీఆర్ఎస్‌లో టెన్షన్‌ పుట్టిస్తోంది. భవిష్యత్తులో బీజేపీ ప్రధాన పోటీదారుగా మారే ఛాన్సుందని ఆందోళన పడుతోంది. సోయం బాపు రావుకు కూడా ఆదివాసీల్లో మంచి పట్టుంది. దీంతో ఈ టెన్షన్‌ మరింత ఎక్కువైంది గులాబీ నేతలకు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories