గ్లోబల్‌ ఎలక్ట్రానిక్‌ హబ్‌గా భారత్‌.. భారత్‌లో పాగా వేయనున్న యాపిల్‌ సంస్థ..

Apple Contribution to Made in India Smartphone Shipments Reached 25%
x

గ్లోబల్‌ ఎలక్ట్రానిక్‌ హబ్‌గా భారత్‌.. భారత్‌లో పాగా వేయనున్న యాపిల్‌ సంస్థ..

Highlights

Apple: ప్రపంచ తయారీ హబ్‌గా ఎదగాలని భారత్‌ ఎప్పటి నుంచో కలలు కంటోంది.

Apple: ప్రపంచ తయారీ హబ్‌గా ఎదగాలని భారత్‌ ఎప్పటి నుంచో కలలు కంటోంది. అందుకు కొన్నేళ్లుగా శ్రమిస్తున్నది. ఈ క్రమంలో భారత్‌ సరికొత్త మైలురాయికి చేరుకుంది. తన ఉత్పత్తులను భారత్‌లో తయారుచేసేందుకు యాపిల్‌ కంపెనీ సిద్ధమైంది. అదే సమయంలో పూర్తిగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు యత్నిస్తోంది. అందుకు తాజాగా యాపిల్‌ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం... భారత్‌లో తయారైన యాపిల్‌ ఉత్పత్తుల ఎగుమతులు 162 శాతానికి పెరిగాయి. దీంతో భారత్‌ తదుపరి ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మారుతందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ యాపిల్. ఈ సంస్థ గతేడాది 120 కోట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించింది. ఈ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ.. భారత్‌లో తయారీకే మొగ్గుచూపుతోంది. ఇదంతా మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగానే యాపిల్ కంపెనీ భారత్‌లో తన ఉత్పత్తుల తయారీని గణనీయంగా పెంచుతోంది. గతేడాది భారత్‌లో తయారు చేసిన ఐఫోన్ల 65 శాతం మేర ఎగుమతి చేసింది. 2021తో పోలిస్తే.. ఈ ఎగుమతలు 162 శాతానికి పెరిగాయి.

భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో 25 శాతం వాటాను యాపిల్‌ సొంతం చేసుకుంది. గతేడాది భారత్‌ నుంచి ఐఫోన్ల ఎగుమతులను రెట్టింపు చేసింది. మొత్తం 250 కోట్ల డాలర్ల విలువైన మార్కును అధిగమించింది. భారత్‌లోని ఫాక్స్‌కాన్‌, పెగట్రాన్‌తో పాటు విస్ట్రన్‌ సంస్థల ఆధ్వర్యంలో యాపిల్‌ ఉత్పత్తులను తయారవుతున్నాయి. 2022లోని చివరి త్రైమాసికంలో భారత ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో అత్యంత వేగంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీల జాబితాలో ఫాక్స్‌కాన్‌, విస్ట్రన్‌ చేరాయి. అయితే యాపిల్ కంపెనీ ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ను ప్రారంభించి ఏడాదే అయ్యింది. ఈ లెక్కన చూస్తే.. యాపిల్‌ కంపెనీ ఉత్పత్తులను భారీగా పెంచినట్టు స్పష్టంగా తెలుస్తోంది. 2025 నాటికి భారత్‌లోని ప్రతి నాలుగు ఫోన్లలో ఒకటి భారత్‌లో తయారు చేయాలని భావిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఓ వెలుగు వెలుగోతోంది. ఈ విషయంలో యాపిల్‌ సంస్థకు స్పష్టమైన అవగాహన వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తన తయారీ కంపెనీలను విస్తృతం చేస్తోంది. అందులో భాగంగా.. దక్షిణాదిలోని కర్నాటక రాజధాని బెంగళూరు సమీపంలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు 300 ఎకరాలను కర్ణాటక ప్రభుత్వం కేటాయించింది.

కర్నాటకలో 70 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని ఫాక్స్‌కాన్‌ నిర్ణయించింది. వచ్చే పదేళ్లలో లక్ష మందికి ఫాక్స్‌కాన్‌ ద్వారా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ.. యాపిల్‌ సంస్థ మాత్రం అంతకు మించి చేయాలని భావిస్తోంది. తన విస్తరణకు ముందు కొన్ని కార్మిక చట్టాలను మార్చాలని మోడీ ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే ఇదంత సులువు కాదు. యాపిల్‌ కోరుతున్నది వివాదాస్పద చట్టాలను మార్చమని అడుగుతోంది. అలా అని.. యాపిల్‌ అడిగినవన్నింటికి భారత్‌ తలూపే అవకాశం లేదని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే కార్మిక చట్టాలను స్వల్ప మార్పులకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయి. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు యాపిల్‌ సంస్థకు స్వగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారత్‌ను యాపిల్‌ ఇష్టపడడానికి మరో కారణం చైనానే.. అమెరికా, చైనా మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయే దశకు చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య పరిస్థితులు తీవ్రమైతే.. చైనాలో తయారయ్యే అన్నింటిని అమెరికా బ్లాక్‌ చేసే అవకాశం ఉంది. ఇదే యాపిల్‌ను ఇబ్బంది పెడుతోంది.

ఇక జీరో కోవిడ్‌ పాలసీ పేరుతో చైనా విధించిన ఆంక్షలు.. యాపిల్‌ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపింది. వరుస లాక్‌డౌన్లతో సప్లయ్ చైన్‌ దెబ్బతినడంతో ఫాక్స్‌కాన్‌ కొన్నాళ్లు మూతపడింది. గతేడాది ఏకంగా 60 లక్షల యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయినట్టు యాపిల్‌ వెల్లడించింది. బీజింగ్‌-వాషింగ్టన్‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు, కోవిడ్‌ లాక్‌డౌన్ల కారణంగా.. భారత్‌వైపు యాపిల్‌ మొగ్గుచూపుతోంది. అదే సమయంలో స్మార్ట్‌ఫోన్‌ తయారీకంపెనీలకు మోడీ ప్రభుత్వం ఏకంగా 660 కోట్ల డాలర్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ భారత్‌లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నది. భారీ మార్కెట్‌, విస్తారమైన అవకాశాలను యాపిల్‌ అందిపుచ్చుకునేందుకు సిద్ధమైంది. దీంతో త్వరలోనే మేడిన్‌ ఇండియా ట్యాగ్‌తో ఐఫోన్‌ రానున్నది. భారత్‌లోనే ఐఫోన్లు తయారైతే.. ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఫాక్స్‌కాన్‌, పెగట్రాన‌‌, విస్టన్‌ కంపెనీలు విస్తరిస్తే మాత్రం.. భారత్‌ గ్లోబల్‌ ఎలక్ట్రానిక్‌ హబ్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories