5G స్పెక్ట్రమ్ ఆక్షన్‌కు కౌంట్‌డౌన్ మొదలు.. కొత్త టెక్నాలజీతో అద్భుతాలు ఖాయమా..?

5G Spectrum Auctions Will Take Place in India
x

5G స్పెక్ట్రమ్ ఆక్షన్‌కు కౌంట్‌డౌన్ మొదలు.. కొత్త టెక్నాలజీతో అద్భుతాలు ఖాయమా..?

Highlights

India's 5G: ఇంటర్నెట్.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది ఇదే. నెట్‌వర్క్ ఎంత వేగంగా ఉంటే ప్రపంచం కూడా అంతే వేగంగా దూసుకెళుతుంది

India's 5G: ఇంటర్నెట్.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది ఇదే. నెట్‌వర్క్ ఎంత వేగంగా ఉంటే ప్రపంచం కూడా అంతే వేగంగా దూసుకెళుతుంది. కోవిడ్ లాంటి ఊహించని సంక్షోభం నుంచి కూడా ప్రపంచం కోలుకుందంటే దానికి కారణం ఇంటర్నెట్టే. అలాంటి ఇంటర్నెట్ కాలంతో పాటు తన వేగాన్నీ పెంచుకుంటోంది. తాజాగా 5జీ రూపంలో భారత్‌లో సాంకేతిక సునామీ సృష్టించేందుకు సిద్ధమైంది. 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి మోడీ సర్కార్‌కౌంట్‌డౌన్ మొదలు షురూ చేయడంతో మరోసారి దేశ వ్యాప్తంగా 5జీ అంశం హాట్ స్పాట్‌గా మారింది. ఇంతకూ, ఇండియాలో 5జీ నెట్‌వర్క్ ఎంట్రీతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి.? టెక్ వరల్డ్‌లో అద్భుతాలకు సమయం ఆసన్నమైనట్టేనా..?

ఇంటర్నెట్ లేని రోజుల్లో కోవిడ్ కల్లోలం చెలరేగి ఉంటే ఏం జరిగి ఉండేది.? ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సింగిల్ వేవ్‌లోనే కొలాప్స్ ఐపోయేది. కానీ, అలా జరగకపోవడానికి కారణం ఇంటర్నెట్. కోవిడ్ సమయంలో ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలు వర్క్‌ఫ్రం హోమ్‌తోనే గట్టెక్కాయి. అలాంటి ఇంటర్నెట్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు నెట్‌వర్క్ జనరేషన్స్‌లో మార్పులను స్వాగతిస్తూ.. వేగంగా ముందుకు దూసుకుపోతున్నారు. ఇలాంటి తరుణంలోనే భారత్‌లోనూ 5జీ నెట్‌వర్క్ ఎంట్రీకి రంగం సిద్ధమయింది. ఇప్పటికే 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కౌంట్‌డౌన్ మొదలు కావడంతో త్వరలోనే మనదేశంలోను కొత్త టెక్నాలజీతో అద్భుతాలు జరగబోతున్నట్టు కనిపిస్తోంది. అయితే, 4 టెక్నాలజీకి మించి 5జీ నెట్‌వర్క్‌తో ఎలాంటి మార్పులు జరుగుతాయి..?

2012లో దేశంలో మొత్తం ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 2.3కోట్లు మాత్రమే. ప్రస్తుతం అది దాదాపు 90 కోట్ల మార్క్‌కు చేరింది. ఇందులో 79కోట్ల మంది సెల్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద 42శాతం ఇంటర్నెట్‌ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. ఇదే సమయంలో సగటు డేటా వినియోగం కూడా వృద్ధిచెంది, 2015 మార్చిలో 100ఎంబీ నుంచి 2021 మార్చి నాటికి 12.33 జీబీకి పెరిగింది. ఈ క్రమంలో డేటా వినియోగం పెరుగుతున్న కొద్దీ వేగం తగ్గకుండా ఉండేందుకు బ్యాండ్‌విడ్త్‌ను పెంచడం టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల బాధ్యత. నిజానికి ఇక్కడే భారత్‌ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. దేశంలో ఇంటర్నెట్‌ వేగం ఇంకా 2జీ-4జీ మధ్యలోనే ఉండిపోయింది. ఎలక్ట్రానిక్ పరికరాలు పెరిగేకొద్దీ నెట్‌వర్క్‌ల వేగం తగ్గిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకే ప్రపంచ దేశాల్లోని టెలికాం కంపెనీలు 5జీ వైపు అడుగులు వేశాయి. ఇప్పుడు వాటి బాటలోనే భారత్‌ కూడా నడుస్తోంది.

గతంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ కోసం 2జీ నెట్‌వర్క్‌ ఉండేది. దానితో ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌కి చాలా సమయం పట్టేది. ఆ తర్వాత ఇంటర్నెట్‌ వేగాన్ని పెంచుతూ 3జీ వచ్చింది ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నాం. ఇందులో 10 ఎంబీపీఎస్‌ నుంచి 100 ఎంబీపీఎస్‌ వేగంతో డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే, త్వరలో రాబోతున్న 5జీ నెట్‌వర్క్‌ 4జీ కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది. దీని వేగం కనీసం 100 ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీ వరకు ఉంటుందట. గరిష్ఠంగా 10జీబీపీఎస్‌ ఉండొచ్చని అంచనా. సింపుల్‌గా చెప్పాలంటే మూడు గంటల నిడివున్న క్వాలిటీ సినిమా మ్యాగ్జిమమ్ సెకన్ల వ్యవధిలోనే డౌన్‌లోడ్‌ అయిపోతుంది.

ఇలాంటి అంచనాలతోనే 5జీ టెక్నాలజీ భారత్‌లో ఊహించని మార్పులకు వేదిక కాబోతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి దేశంలోకి 5జీ ఎంటరైతే.. స్మార్ట్‌ఫోన్ల దగ్గర నుంచి మనం నిత్యం చేసే ప్రతి పనీ మరింత వేగంగా చేసేందుకు వీలుంటుంది. ఆగ్‌మెంటెడ్ రియాలిటీ, మొబైల్ వర్చువల్ రియాలిటీ, అధిక క్వాలిటీ వీడియోతో పాటు నగరాలను మరింత స్మార్ట్‌గా చేసే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటివన్నీ సాధ్యమవుతాయని టెక్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఒక్కమాటలో ఇప్పుడున్న సర్వీసులను మించిన కొత్త ఇంటర్నెట్ సర్వీసులు పుట్టుకొచ్చే వీలుంటుంది. ప్రధానంగా 5జీతో ప్రకృతి విపత్తుల సమయంలో గాలింపు, సహాయక చర్యలు, ట్రాఫిక్ పర్యవేక్షణ లాంటి వాటిని మునివేళ్లతోనే ఆపరేట్ చేసేయొచ్చు. అలాగే, ఇప్పుడున్న లైవ్ మ్యాపింగ్ లాంటివి మరింత వేగవంతమవుతాయి.

ఇక మొబైల్ వినియోగదారులకు డౌన్‌లోడ్, అప్‌లోడ్‌ సహా నెట్‌వర్క్ యూజింగ్‌లో బఫరింగ్ సమస్యలనేవే ఎదురు కావు. వీడియో కాల్స్ మరింత స్పష్టంగా ఉండడంతోపాటు కనెక్టివిటీ సమస్యలేవీ ఇబ్బంది పెట్టవు. శరీరం మీద ధరించే ఫిట్‌నెస్ డివైజ్‌లు మన ఆరోగ్యాన్ని నిరంతరం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తక్షణమే డాక్టర్లను అలర్ట్ చేస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేని వారికి ఫిట్‌నెస్ డివైజ్‌లు సేఫ్‌గా కాపాడుతాయి. ఇంటర్నెట్ తప్పక అవసరమయ్యే ఇలాంటి డివైజ్‌లకు 5జీ లాంటి వేగవంతం అయిన నెట్‌వర్క్ ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదొక్కటే కాదు మొబైల్ యూజర్స్‌ నుంచి వర్క్‌ఫ్రం హోం చేసేవారి వరకూ భారతీయుల జీవితాల్లో 5జీ వేగం ఊహించని మార్పులకు వేదిక కావడం ఖాయం అంటున్నారు టెక్ ఎక్స్‌పర్ట్స్.

నిజానికి.. పదేళ్లకు ముందు నుంచే 5జీ నెట్‌వర్క్‌పై ప్రయోగాలు మొదలయ్యాయి. అయితే, అమెరికా, దక్షిణ కొరియా, చైనా దేశాలు 2020 నాటికే 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. చైనాలో 376 నగరాల్లో, అమెరికాలో 284 నగరాల్లో, దక్షిణ కొరియాలో 85 నగరాల్లో 5జీ సేవలు కొనసాగుతున్నాయి. వీటితోపాటు అత్యధిక నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ ఉన్న దేశాల జాబితాలో యూకే, స్పెయిన్‌, కెనడా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇటలీ, ఫ్రాన్స్‌, థాయ్‌లాండ్‌, స్వీడెన్‌, ఇస్టోనియా, ఫిలిప్పీన్స్‌ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో 30శాతం అంటే దాదాపు 61 దేశాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, పూర్తిస్థాయిలో ఈ సేవలు అందడానికి ఇంకొంత సమయం పడుతుంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో అత్యధిక 5జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 415 ఎంబీపీఎస్‌గా ఉంది.

ఇక భారత్‌లోనూ 5జీ నెట్‌వర్క్‌ ఎంట్రీ కోసం కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే 5జీ పరీక్షలను నిర్వహించేందుకు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్‌ఎల్‌ టెలికాం సంస్థలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీంతో ఆయా టెలికాం సంస్థలు పలు నగరాల్లో 5జీ ట్రయల్స్‌ని కూడా నిర్వహించాయి. తద్వారా దేశంలోని 13 ప్రధాన నగరాల్లో ఈ ఏడాదిలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ నగరాల జాబితాలో హైదరాబాద్‌, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్‌నగర్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో 5జీ సేవలు విజయవంతంగా అమలైతే ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో జులై 26న జరిగే ఆక్షన్‌లో 5జీ ప్రాజెక్ట్‌ను ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఒక్కమాటలో ఫిఫ్త్ జనరేషన్ నెట్‌వర్క్ ఎంట్రీ భారత్‌లో ఎలాంటి మార్పులకు వేదికవుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories