Urvil Patel Record: ఉర్విల్ పటేల్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్‌ 2025కు సెలెక్ట్ అవ్వడం పక్కా..!

Urvil Patel Becomes 2nd Batter To Hit Fastest Century in T20 Cricket
x

Urvil Patel Record: ఉర్విల్ పటేల్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్‌ 2025కు సెలెక్ట్ అవ్వడం పక్కా..!

Highlights

Urvil Patel: గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ పటేల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2024లో ఇప్పటికే ఓ శతకం బాదిన ఉర్విల్.. తాజాగా మరో సెంచరీ చేశాడు.

Syed Mushtaq Ali Trophy 2024: గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ పటేల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2024లో ఇప్పటికే ఓ శతకం బాదిన ఉర్విల్.. తాజాగా మరో సెంచరీ చేశాడు. మంగళవారం ఎమరాల్డ్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. మొత్తంగా 41 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సర్లతో 115 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో గుజరాత్‌ తరఫున ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. ఆరు రోజుల క్రితం ఉర్విల్‌ త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

ఈ సెంచరీ ద్వారా గుజరాత్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో 40 బంతుల్లోపే రెండు శతకాలు బాదిన తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఈ రికార్డు నెలకొల్పలేదు. భారత్‌ తరఫున టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. త్రిపురపై 28 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అలానే టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన శతకం చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు ఎస్టోనియా ప్లేయర్ సాహిల్‌ చౌహాన్‌ పేరుపై ఉంది. 2024లోనే సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లోనే శతకం అందుకున్నాడు.

ఉర్విల్ పటేల్ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో భారత్‌ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. 2023లో అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు భారత్ మాజీ ఆటగాడు యూసఫ్‌ పఠాన్‌ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్‌ 40 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక మంగళవారం ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. ఉర్విల్ విధ్వంసంతో 183 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టీమ్ 13.1 ఓవర్లలోనే ఛేదించింది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో 26 ఏళ్ల ఉర్విల్ పటేల్ అన్‌సోల్డ్‌గా మిగిలాడు. అతడి కనీస ధర రూ.30 లక్షలు కాగా.. అతడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. అయితే ఉర్విల్ ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ప్లేయర్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్నా లేదా గాయం కారణంగా దూరమయినా.. ప్రాంచైజీలకు మరో ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంటుంది. వరుస సెంచరీలు బాదిన ఉర్విల్‌ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉర్విల్ ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌ జట్టులో ఉన్నాడు. బేస్ ధర రూ.20 లక్షలకు తీసుకున్నా.. ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories