Tokyo Olympics 2021: మరికొద్ది గంటల్లోనే ప్రపంచ క్రీడా పండుగ
Tokyo Olympics 2021: ఈ క్షణం కోసమే ప్రపంచ క్రీడాభిమానులంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
Tokyo Olympics 2021: ఈ క్షణం కోసమే ప్రపంచ క్రీడాభిమానులంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించేందుకు క్రీడాకారులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఏడాదిగా ఇదే పరిస్థితి. ఎట్టకేలకు ప్రేక్షకులు లేకుండానే తొలిసారి ఒలింపిక్స్ క్రీడలు జరగబోతున్నాయి. మరి కొద్ది గంటల్లోనే జపాన్ రాజధాని టోక్యోలో విశ్వ క్రీడా సంరంభం ప్రారంభం కాబోతోంది. ఒలింపిక్స్‌పై HMTV స్పెషల్ ఫోకస్.
జపాన్ రాజధాని టోక్యోలో గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు జరుగుతున్నాయి. ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పటికీ ప్రపంచమంతటా వ్యాపిస్తూనే ఉంది. కరోనా భయాల మధ్యే ఏడాది ఆలస్యంగా అయినా ప్రేక్షకులు లేకుండానే ఆటలు నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య నిర్ణయించింది. ఇప్పటికే టోక్యోలోని క్రీడా గ్రామంలో అనేక మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా ముగ్గురు క్రీడాకారులకు కూడా కోవిడ్ సోకినట్లు ప్రకటించారు. ప్రపంచం నలుమూలు నుంచీ క్రీడాకారులు వస్తున్నందున క్రీడా గ్రామంలో కోవిడ్ నిబంధనలు కచ్ఛితంగా పాటిస్తున్నారు. మహమ్మారి తమదేశంలో ప్రబలకూడదనే ఈసారి ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంల్లో పోటీలు నిర్వహించబోతున్నారు. జపనీయులకు మాత్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రీడలు చూసే అవకాశం కల్పించారు. ఇతర దేశాల క్రీడాభిమానులకు మాత్రం ప్రవేశాన్ని నిషేధించారు.
33 విభాగాల్లో 339 ఈవెంట్లు జరగబోతున్నాయి ఒలింపిక్స్‌లో. 2020లోనే జరుగుతాయని భావించడంతో ప్రతిసారీ మాదిరిగానే గ్రీస్‌లోని చారిత్రిక నగరమైన ఒలింపియాలోని హెరా దేవాలయంలో గత ఏడాది మార్చి 12న టోక్యో ఒలింపిక్స్ జ్వాలను వెలిగించారు. గ్రీస్‌లోని పనాథెనియక్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒలింపిక్ జ్వాలను జపాన్‌కు అందించారు. ఈ ఏడాది మార్చి 25నే జపాన్‌లో ఒలింపిక్స్ టార్చ్ రిలే మొదలైంది. 121 రోజుల పాటు 47 ప్రావిన్స్‌లలో ర్యాలీ అనంతరం ఈ ప్రదర్శన జులై 23న క్రీడలు ప్రారంభమయ్యే రోజున టోక్యోలో ముగుస్తుంది. జపాన్ ప్రజలు ర్యాలీ జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్లకిరువైపులా నిల్చుని చూడవచ్చని అయితే కోవిడ్ మార్గదర్శకాలు కచ్ఛితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. విశ్వ క్రీడలకు జపాన్ ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగోసారి. టోక్యో ఒలింపిక్స్ చిహ్నాన్ని మిరాయిటోవా అని పిలుస్తున్నారు. జపనీస్ భాషలో మిరాయ్ అంటే భవిష్యత్తు టోవా అంటే శాశ్వతమైనదని అర్థం. జపాన్ సంస్కృతి, ఆధునికతను ప్రతిబింబించేలా ఒలింపిక్స్ చిహ్నాన్ని రూపొందించారు. క్రీడాకారులకు ఇచ్చే పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో తయారు చేశారు.
ఈ నెల 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో 205 దేశాల నుంచి 11వేలకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరందరికీ జపాన్ ప్రభుత్వం టోక్యోలో అన్ని వసతులతో క్రీడా గ్రామాన్ని నిర్మించింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా ఖర్చయ్యే క్రీడలుగా టోక్యో ఒలింపిక్స్ నిలిచిపోనున్నాయి. ఏడాది వాయిదా పడటం వల్ల ఖర్చు 22 శాతం పెరిగింది. గత ఏడాది జరిగితే 1260 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పుడైతే 1540 కోట్ల డాలర్లు అవుతుందని భావిస్తున్నారు. అసలు టోక్యో నగరాన్ని ఎంపిక చేసినపుడు 2013లో వేసిన అంచనా వ్యయం 750 కోట్ల డాలర్లు మాత్రమే. ఇప్పటివరకు కేవలం ధనిక దేశాలు మాత్రమే ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశాన్ని పొందుగలుగుతున్నాయి. ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమయ్యాక ఇప్పటివరకు అమెరికా ఆధిపత్యమే కొనసాగుతోంది. 1896 నుంచి చూస్తే...అమెరికాకు మొత్తం 2542 పతకాలు లభించగా రెండవ స్థానంలో ఉన్న రష్యాకు 1556 పతకాలు లభించాయి. సోవియట్ యూనియన్ పతనం అయ్యాక రష్యా ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాలు స్వతంత్ర దేశాలుగా అవతరించడంతో సోవియట్ యూనియన్ ప్రాబల్యం పూర్తిగా పోయింది. గత కొన్ని సార్ల నుంచి అమెరికా తర్వాత రెండో స్థానంలో చైనా కొనసాగుతోంది. మొత్తం పతకాల పట్టికలో చైనా 7వ స్థానంలో ఉండగా జపాన్ పదో స్థానంలో ఉంది.
టోక్యో ఒలింపిక్స్ పలు రకాలుగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొత్తగా ఐదు విభాగాలను ఈసారి ప్రవేశపెట్టారు. సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, కరాటే, బేస్‌బాల్ క్రీడలను ఒలింపిక్స్‌లో భాగంగా మార్చారు. ఇటీవలి కాలంలో రద్దయిన టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్, జూడో మిక్స్‌డ్ టీమ్‌ను పునరుద్దరించారు. స్విమ్మింగ్ పోటీల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇంకా పలు క్రీడల్లో కూడా మార్పులు చేశారు. ఈసారి ఒలింపిక్స్‌లో విశ్వవిజేత ఎవరో రెండు వారాల్లో తేలిపోతుంది. ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో పోటీ పడుతున్న చైనా ఈసారి కూడా రెండో స్థానానికే పరిమితమవుతుందో..? అమెరికా తలదన్నుతుందో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire