Tilak Varma: తిలక్‌ తుఫాన్ ఇన్నింగ్స్.. తొలి బ్యాటర్‌గా ఆల్‌టైమ్ రికార్డు!

Tilak Varma
x

Tilak Varma

Highlights

Tilak Varma: తెలుగు కుర్రాడు, టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ వరుస సెంచరీలు బాదుతున్నాడు.

Tilak Varma: తెలుగు కుర్రాడు, టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ వరుస సెంచరీలు బాదుతున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు బాదిన తిలక్.. మరో శతకం చేశాడు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ 2024లో హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగిన అతడు మేఘాలయపై సెంచరీ చేశాడు. 67 బంతుల్లోనే 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 151 పరుగులు బాదాడు. దీంతో టీ20ల్లో వరుసగా మూడు సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో తొలి బ్యాటర్‌గా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు.

మేఘాలయపై సెంచరీ బాదడంతో తిలక్‌ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన మొదటి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో తిలక్ శతకాలు బాదాడు. వరుసగా 107, 120 పరుగులు చేశాడు. అదే కంటిన్యూ చేస్తూ.. హైదరాబాద్ కెప్టెన్‌ తిలక్ మేఘాలయపై మరో సెంచరీ చేశాడు. సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరర్ శ్రేయస్‌ అయ్యర్ (147) రికార్డును తిలక్ అధిగమించాడు. అంతేకాదు టీ20ల్లో 150కి పైగా స్కోరు చేసిన తొలి భారత బ్యాటర్‌గానూ రికార్డుల్లో నిలిచాడు.

తిలక్ వర్మ అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అద్భుత ప్రదర్శన చేయడంతో వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు అతడిని తీసుకుంది. ముంబై తరఫున అరంగేట్ర సీజన్లోనే అదరగొట్టాడు. ఆ తర్వాత కూడా రాణించి.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. గతేడాది భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 20 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్‌.. వరుసగా 616, 68 పరుగులు చేశాడు. టీ20ల్లో 2 శతకాలు, 2 అర్ధ శతకాలు బాదాడు.

తిలక్‌ వర్మ భారీ సెంచరీ చేయడంతో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 248 రన్స్ చేసింది. తన్మయ్ అగర్వాల్ (55) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. రాహుల్ బుద్ది (30) ఫర్వాలేదనిపించాడు. అనికేత్ రెడ్డి (4/11), తన్మయ్ త్యాగరాజన్ (3/15) నిప్పులు చేరగడంతో ఛేదనలో మేఘాలయ 69 పరుగులకే కుప్పకూలింది. దాంతో హైదరాబాద్‌ 179 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories