ODI World Cup 2023: రేపటి నుంచి వన్డే ప్రపంచ కప్‌ పోరు.. 12 ఏళ్ల తర్వాత ఆతిథ్యమిస్తున్న ఇండియా

The ODI World Cup Will Start Tomorrow
x

ODI World Cup 2023: రేపటి నుంచి వన్డే ప్రపంచ కప్‌ పోరు.. 12 ఏళ్ల తర్వాత ఆతిథ్యమిస్తున్న ఇండియా 

Highlights

ODI World Cup 2023: ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్న రెండు జట్లు

ODI World Cup 2023: క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ సందడి మొదలైంది. మరో 2 రోజుల్లో తొలి మ్యాచ్‌తో వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభం కానుంది. లీగ్‌లోని మొదటి మ్యాచ్ గత ఛాంపియన్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. 12 ఏళ్ల తర్వాత ఇండియా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో కొన్ని వరల్డ్ రికార్డులు బ్రేకయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నీలో ఫేవరెట్స్ లో ఒకటిగా ఇండియా బరిలోకి దిగుతోంది.

ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌ నుంచి భారత జట్టు ప్రపంచకప్‌లోకి ఎంటర్ కానుంది. అక్టోబరు 8న చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మూడోసారి ప్రపంచకప్ గెలవడంపై ఆశలు పెట్టుకుంది. నిజానికి గత 10 ఏళ్లలో భారత జట్టు ఒక్క ఐసీసీ టోర్నీని కూడా గెలవలేకపోయింది. ఈ పరంపరకు స్వస్తి పలకాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ప్రస్తుతం టాప్ ప్లేస్‌లో ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది.

టీమిండియా ఫైనల్ చేరుతుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. సొంత గడ్డ మీద వరల్డ్ కప్ ఆడనున్న భారత్ హాట్ ఫేవరేట్ అనేది అందరూ చెబుతున్న మాట. వన్డే వరల్డ్ కప్ సెంటిమెంట్ సైతం ఇదే విషయాన్ని చెబుతోంది. వన్డే ప్రపంచ కప్‌ ముఖాముఖి పోరులో.. భారత జట్టు ఇప్పటి వరకూ నాలుగు జట్లపై తిరుగులేని ఆధిపత్యం కనబర్చగా.. నాలుగు జట్లు టీమిండియాపై ఆధిక్యంలో ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్థా్న్‌పై టీమిండియాకు తిరుగులేని రికార్డ్ ఉంది. వన్డే వరల్డ్ కప్‌లో ఇరు జట్లూ ఇప్పటి వరకు ఏడుసార్లు ముఖాముఖి తలపడగా.. ఒక్కసారి కూడా పాకిస్థాన్ గెలవలేకపోయింది.

శ్రీలంకతో భారత్ వరల్డ్ కప్‌లో 8సార్లు ముఖాముఖి తలపడగా.. ఇరు జట్లు చెరో నాలుగుసార్లు గెలిచాయి. ఒకప్పటితో పోలిస్తే శ్రీలంక ప్రస్తుతం బలహీనంగా ఉంది. దీంతో ఈసారి శ్రీలంకపై భారత్ గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఇక భారత్ ఆస్ట్రేలియా జట్లు 12సార్లు ఫేస్ టు ఫేస్ తలపడగా.. ఆస్ట్రేలియా ఎనిమిదిసార్లు విజయం సాధించగా.. భారత్ నాలుగుసార్లు గెలుపొందింది. వరల్డ్ కప్‌లో టీమిండియాపై ఆసీస్‌కు మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వరల్డ్ కప్ కంటే ముందు ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో గెలిచింది.

భారత్ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో రెండు సార్లు విజేతగా నిలిచింది.1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో రెండోసారి వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింది. అయితే.. 1975లో క్రికెట్ వరల్డ్ కప్ ను ప్రారంభించినప్పటి నుంచి భారత్ జట్టు మొత్తం 89 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 53 మ్యాచ్ లలో విజయం సాధించగా.. 33 మ్యాచ్ లలో ఓడిపోయింది. మూడు మ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి.

మొత్తంగా ఈ సారి వరల్డ్ కప్‌లో ప్రపంచం దృష్టి అంతా భారత్ పైనే ఉంది. నెంబర్ -1 ప్లేస్‌లో కొనసాగుతుండటం, టీమిండియా ప్లేయర్‌ మంచి ఫామ్‌లో ఉండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories