ఆర్డర్లో లేని మిడిల్.. అదే టీమిండియా బలహీనత!

ఆర్డర్లో లేని మిడిల్.. అదే టీమిండియా బలహీనత!
x
Highlights

సాధారణంగా ఏ టీమైనా అందరూ రాణించాలని రూలేమీ లేదు. ఒక్కోసారి టాప్ క్లాస్ ఆటగాడు కూడా విఫలం కావచ్చు. కానీ, అటువంటి పరిస్థితుల్లో పోరాటం చేయాల్సిన తరువాతి...

సాధారణంగా ఏ టీమైనా అందరూ రాణించాలని రూలేమీ లేదు. ఒక్కోసారి టాప్ క్లాస్ ఆటగాడు కూడా విఫలం కావచ్చు. కానీ, అటువంటి పరిస్థితుల్లో పోరాటం చేయాల్సిన తరువాతి ఆటగాళ్లు కూడా చేతులెత్తేస్తే? అదే టీమిండియా బలహీనత. ఇపుడు ఓ మ్యాచ్ ఓడిపోయారని.. విమర్శించడం కాదు. రాబోయే మ్యాచ్ లో మన బలహీనత సరిచేసుకోవాల్సిన అవసరాన్ని తరచి చూసుకోవాల్సిందే. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా లోని ప్రధాన లోపం బయట పడింది. అదే మిడిల్ ఆర్డర్. మొదట్నుంచీ అనుకున్తున్నట్టుగానే.. నెంబర్ 4 తలనొప్పి పోలేదు. విజయ్ శంకర్ వరుస వైఫల్యాలతో జట్టులోకి వచ్చిన రిశాబ్ పంత్ పరుగులు చేసినట్టు బోర్డు మీద కనిపించింది కానీ, ఆ పరిస్థితికి తగ్గ ఆటతీరు మాత్రం పంత్ చూపించలేదు. ఆడినంత సేపూ అడ్డంగా బ్యాట్ ఊపడం తప్ప.. ఒక్కటంటే ఒక్కటీ క్రికెటింగ్ షాట్ పంత్ బ్యాటింగ్ లో కనిపించలేదు. అవతల భారీ లక్ష్యాన్ని చేదిన్చాలనుకున్నప్పుడు కనిపించాల్సిన కసి మిడిల్ ఆర్డర్ లో కనిపించలేదు. ఓపెనింగ్ భాగస్వామ్యం మొదట్లోనే విడిపోవాల్సి వస్తే ఎలా ఆడాలో సరిగ్గా అలానే ఆడి చక్కని దారిని రోహిత్, కోహ్లీ వేశారు. అయితే, తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ దాని మీద సరైన ప్రయాణం చేయలేదు. అచ్చం ఆఫ్ఘనిస్తాన్ తో ఏ రకంగా మిడిల్ ఆర్డర్ వైఫల్యం పీకల మీదకు తెచ్చిందో అలానే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లోనూ జరిగింది. అయితే, ఆఫ్ఘాన్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కావడం తో ఒత్తిడి లేకపోవడం.. తరువాత బౌలర్లు వికెట్లు తీసి తమ పని తాము చేయడంతో విజయం దొరికింది.వికెట్లు పడకుండా చూసుకోవాల్సిన మాట వాస్తవమే. కానీ దాని కోసం పరుగులు చేయడం కుదరదంటే ఎలా అవుతుంది. మన బ్యాట్స్ మెన్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో వికెట్లు కాపాడుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత పరుగులు చేయడానికి ఇవ్వలేదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. చెలరేగి ఆడాల్సిన సమయంలో ఆచి, తూచి ఆడితే.. చేయాల్సిన పరుగులు కొండంత మిగిలిపోయి.. తరువాత వచ్చే ఆటగాళ్ళ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. పాకిస్తాన్ మ్యాచ్ లోనూ అంతే.. మనకి దక్కిన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తే.. స్కోరు 350 దాటిపోయేది. అయితే, శంకర్, ధోనీ,జాదవ్ సమయోచితంగా ఆడలేదు. అందుకే.. 336 కు పరిమితమైపోయింది స్కోరు.

చివరి ఓవర్లలో.. బౌండరీల వర్షం కురుస్తుందని ఎవరైనా భావిస్తారు. కనీసం ఆదిశలో ప్రయత్నమైనా జరుగుతుందని అభిమానులు ఆశిస్తారు. కానీ టీమిండియా మిడిల్ ఆర్డర్ ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ లో పోరాటం చేస్తోందన్న అభిప్రాయం ఏ కోశానా కలుగలేదు. పాండ్య ఒక్కడే బాదుడు మంత్రం పతించాడు. ఒక్కడి వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? ధోనీ, జాదవ్ కనీసం షాట్లు ఆడే ప్రయత్నాలు కూడా చేయకపోవడం విచారకరం. వాళ్ళిద్దరూ 31 బంతులాడారు. 20 సింగిల్స్ తీశారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వారి ఆట తీరు. ఓవర్లు పూర్తి కాకుండానే వాళ్లే ఇండియా ఓడిపోతుందనే భ్రమని కలిగించేశారు. ఏదిఏమైనా.. కచ్చితంగా చెప్పాల్సింది మాత్రం టీమిండియా మిడిల్ ఆర్డర్ ఏమాత్రం అనుకున్న స్థాయిలో లేదు. దీనిని వెంటనే సరిచేసుకోకపోతే, నాకౌట్ దశలో ఇదే భారత్ కు చేటు చేస్తుందనడం లో సందేహం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories