T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ పోటీల్లో విశ్వవిజేతగా భారత్

Team India Became T20 World Cup 2024 Champions
x

T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ పోటీల్లో విశ్వవిజేతగా భారత్

Highlights

T20 World Cup 2024: దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం

T20 World Cup 2024: ఎన్నాళ్లయింది భారత క్రికెటర్లలో ఈ ఆనందాన్ని చూసి... ఎన్నేళ్లయింది భారత క్రికెట్‌ అభిమానులు ఇలాంటి గెలుపు సంబరాలు చేసుకొని... అందినట్లే అంది చేజారిపోతున్న ఐసీసీ ట్రోఫీ విజయాలు... ఆఖరి మెట్టుపై తడబడిన ప్రపంచ కప్‌ సమరాలు... అన్నీ దాటి ఇప్పుడు ఆహా అనిపించే ప్రదర్శనతో భారత జట్టు సగర్వంగా నిలిచింది. ఏడు నెలల క్రితం రాల్చిన కన్నీటి చుక్కల స్థానంలో ఇప్పుడు ఆనంద భాష్పాలు... నియంత్రించలేని భావోద్వేగాలు... ఎన్నోసార్లు చేరువగా వచ్చిన ట్రోఫీని దూరమైన బాధను పూర్తిగా మరిచేలా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌గా చేతిలో వాలిన కప్‌... సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ చేజారిన తర్వాత ఈ సారైనా టీ20 ప్రపంచకప్‌ ఒడిసి పట్టుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా అజేయంగా అద్భుతాన్ని చేసి చూపించింది.

నిరాశ ఆవహించింది... దుఃఖం తన్నుకొచ్చింది... ఓటమి తప్పదన్న భావన మెలిపెడుతోంది. ఏడు నెలల కిందే వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన పరాభవం గుర్తొస్తుంటే బాధ రెట్టింపవుతోంది. టీవీల ముందు కూర్చున్న ప్రతీ భారత అభిమానీ పరాభవానికి సిద్ధమైపోయాడు. నీళ్లు నిండిన కళ్లతో, బరువెక్కిన హృదయంతో.... ఒక్కరంటే ఒక్కరూ... రోహిత్‌సేన కప్పు గెలుస్తుందని ఊహించి ఉండరు... ఎందుకంటో ఫైనల్లో దక్షిణాఫ్రికా గెలవడానికి చేయాల్సింది 30 బంతుల్లో 30 పరుగులే. అలాంటి స్థితిలో ఓ జట్టు ఓడిపోతుందని ఎవరైనా కలలోనైనా అనుకుంటారా. అందులోని మిల్లర్ లాంటి బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉంటే... కానీ అద్భుతమే జరిగింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీంఇండియా... దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది.

లీగ్‌ దశలో వరుసగా మూడు విజయాలు, ఆ తర్వాత సూపర్‌–8లో కూడా మూడు విజయాలు. ఆస్ట్రేలియాలాంటి గట్టి ప్రత్యర్థి ని కుప్పకూల్చిన ఉత్సాహంతో సెమీస్‌లో ఇంగ్లండ్‌పై కూడా ఘన విజయం. తుది పోరుకు ముందు అజేయంగా నిలిచింది. వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా ఇలాగే వరుసగా పది విజయాల తర్వాత అజేయంగా ఫైనల్‌ చేరిన టీమ్‌ నిరాశచెందాల్సి వచ్చింది. అద్భుతంగా సాగిపోతున్న ఆటలో ఎక్కడైనా ఒక బ్రేక్‌ వస్తే... అదీ ఫైనల్లో అయితే ఎంతటి బాధ ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సారీ అలాంటిదే జరిగితే అనే ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ భారత్‌ అలాంటి స్థితిని అధిగమించింది...ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధగమించింది.

ఎన్నో మలుపులు... మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు... టైటిల్‌ వేటలో ఓ వైపు దక్షిణాఫ్రికా వేగంగా దూసుకుపోతుంటే... భారత అభిమానుల్లో నైరాశ్యం నిండుకుంది. 36 బంతుల్లో 54 పరుగులు చేయాల్సి ఉన్నా... గెలుపుపై ఆశలు సన్నగిల్లాయి. అక్సర్ వేసిన 15వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు కొట్టడంతో... ఇక మ్యాచ్ మనది కాదనుకున్నారు ఇండియన్లు. ఆ తర్వతా ఓవర్లో బుమ్రా మ్యాజిక్ చేసినా క్లాసెన్, మిల్లర్‌ లాంటి హిట్టర్లు ఉండటంతో భారత్‌ ఆశలు కోల్పోయింది. కానీ హర్దిక్ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్లో మ్యాజిక్‌ మొదలైంది. చచ్చిపోయిన భారత్‌ ఆశలకు హార్దిక్‌ జీవం పోశాడు. తొలి బంతికే క్లాసెన్‌ వెనుదిరగ్గా... 18 బంతుల్లో 10 పరుగులే వచ్చాయి. కథ క్లైమాక్స్‌కు చేరింది. 6 బంతుల్లో 16 పరుగులు కావాలి.

మిల్లర్‌ ఉండటంతో ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. కానీ పాండ్యా వేసిన తొలి బంతికే బౌండరీ వద్ద సూర్యకుమార్‌ అత్యద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అంతే... తర్వాతి ఐదు బంతులు లాంఛనమే అయ్యాయి. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఐదు ఓవర్లు పొదుపుగా బౌలింగ్ చేసి రెండో కప్పును భారత్‌కు అందించారు ఇండియా బౌలర్లు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. భారత్‌ ప్రపంచ విజేతగా హోరెత్తే సంబరాల్లో మునిగిపోయింది. దీంతో 17 ఏళ్ల నిరీక్షణ అనంతరం పొట్టికప్‌ను భారత్ ముద్దాడింది.

జట్టు కష్టాల్లో పడిందా... ఓటమి కోరల్లో చిక్కుకుందా.... అయితే అతనికి బంతి అందించాల్సిందే. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగుతున్నారా.... మ్యాచ్‌ చేజారే పరిస్థితి వచ్చిందా... అయితే అతను బౌలింగ్‌కు రావాల్సిందే. అసాధ్యమనుకున్న దాన్ని అందుకోవాలన్నా... పరాజయాన్ని దాటి విజయాన్ని చేరుకోవాలన్నా... అతను బంతితో సత్తాచాటాల్సిందే. అతనే టీంఇండియా ఆపద్బాంధవుడు జస్‌ప్రీత్‌ బుమ్రా. ప్రపంచంలోనే మేటి పేసర్లలో ఒకడు. బుమ్రా తన కంటే వెయ్యి రెట్లు నయం అని దిగ్గజం కపిల్‌ దేవ్‌ అన్నాడంటేనే అతని సామర్థ్యాలను అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఐసీసీ టైటిళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత్‌ ముగింపు పలకడంలో ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ బుమ్రాది కీలక పాత్ర. కేవలం వికెట్లు తీయడమే కాదు పరుగులు కట్టడి చేసి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడం అతనికి బంతితో పెట్టిన విద్య. ముఖ్యంగా తుదిపోరులో ఓటమి దిశగా సాగుతున్న జట్టును 18 ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి... ఓ వికెట్‌ తీసిన బుమ్రా భారత్‌ను గెలుపు వైపు మళ్లించాడు.

ఆ తర్వాత బాధ్యత అర్ష్‌దీప్‌ తీసుకున్నాడు. బుమ్రా నుంచి స్ఫూర్తి పొందాడో, ఎలాగైనా దేశాన్ని గెలపించాలని సంకల్పించుకున్నాడో.. శక్తులన్నీ కూడదీసుకుంటూ అత్యంత కట్టుదిట్టంగా, బ్యాటర్‌కు కాస్తయినా స్వేచ్ఛ ఇవ్వకుండా బంతులేశాడు. కేవలం 4 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్‌ ఫేవరెట్‌గా మారిపోయింది. ఉత్కంఠ ఊపేస్తుండగా భారాన్నంతా మోస్తూ, ఒత్తిడిని జయిస్తూ హార్దిక్‌ చిరకాలం గుర్తుండిపోయేలా బౌలింగ్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి సూర్యకుమార్ అందుకున్న క్యాచ్‌కు మిల్లర్‌ నిష్క్రమించడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు తిరిగింది. సిక్స్‌ వెళ్లడం ఖాయమనుకున్న బంతిని బౌండరీ లైన్‌ వద్ద అతడు కళ్లు చెదిరే రీతిలో అందుకున్న తీరు అభిమానుల స్మృతిపథంలో చాన్నాళ్లు ఉండిపోతుంది. హార్దిక్‌ తర్వాతి బౌంతికి బౌండరీ ఇవ్వగా.. మూడు, నాలుగు బంతులకు బైలు వచ్చాయి. హార్దిక్‌ వైడ్‌ వేసినా.. ఆ వెంటనే రబాడను ఔట్‌ చేయడంతో భారత్‌ విజయం ఖాయమైపోయింది. ఆఖరి బంతి పడగానే భారత ఆటగాళ్లు, అభిమానుల సంబరాలు మిన్నంటాయి.

2007 టీ20 ప్రపంచకప్‌లో శ్రీశాంత్‌ క్యాచ్‌.. 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని సిక్సర్‌.. భారత క్రికెట్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సందర్భాలివి. ఈ ప్రపంచకప్‌లోనూ అలాంటి చిరస్మరణీయమైన క్యాచ్‌ను సూర్యకుమార్‌ అందుకున్నాడు. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమవగా.. హార్దిక్‌ వేసిన తొలి బంతిని మిల్లర్‌ గాల్లోకి లేపాడు. అది సిక్సర్‌ వెళ్లేలా కనిపించింది. అది కానీ బౌండరీ దాటి బయటపడి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో! కానీ వైడ్‌ లాంగాఫ్‌ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన సూర్య ఒక్క ఉదుటన బంతి అందుకున్నాడు. కానీ నియంత్రణ కోల్పోయి బౌండరీ గీత దాటాడు. అయితే అంతలోపే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి వచ్చి ఆ బంతిని అందుకుని జట్టును ఆనందంలో ముంచెత్తాడు. అద్భుతంగా ఆ క్యాచ్‌ పట్టిన సూర్య టీంఇండియా విజయంలో కీలకమయ్యాడు.

రెండోసారి విశ్వ విజేతగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 2007లో తొలి టైటిల్‌ నెగ్గిన తర్వాత ఆరు ప్రయత్నాల్లో విఫలమైన టీమిండియా ఇప్పుడు మళ్లీ ట్రోఫీని అందుకుంది. అప్పుడెప్పుడో కపిల్‌ వన్డే కప్‌ 1983 తెచ్చినపుడు మనలో చాలామందికి తెలీదు. అదొక వార్తగానే తెలుసుకున్నాం. కానీ ధోని తొలి టి20 ప్రపంచకప్‌ను టీవీల్లో చూశాం. తెగ సంబరపడ్డాం. సొంతగడ్డపై మళ్లీ అదే ధోని 2011లో వన్డే విశ్వవిజేతను చేస్తే పెద్ద పండగ చేసుకున్నాం. మళ్లీ మళ్లీ ఎంత ప్రయత్నించినా సెమీస్‌ లేదంటే ఫైనల్స్‌తోనే సరిపెట్టుకున్నాం. కానీ ఇప్పుడు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టీ20 ప్రపంచకప్‌ జట్టులోని సభ్యుడు రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా కరీబియన్‌ గడ్డపై సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. రోహిత్‌ బృందం జగజ్జేతగా అవతరించడంతో యావత్‌ భారతం సంబరాల్లో మునిగిపోయింది.

ఓ వైపు మ్యాచ్ గెలిచిందని ఆనందంలో ఉండగానే సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు ఇద్దరు బ్యాట్స్‌మెన్లు. హిట్టర్లైన కోహ్లి, రోహిత్ శర్మలు టీ20 ఫార్మట్‌కి గుడ్ బై చెప్పారు. పొట్టి కప్‌ను తీసుకువచ్చారని ఆనంద పడేలోపే... రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మరోవైపు భారత కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి సైతం ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం. 2007లో వన్డే వరల్డ్ కప్ పొగొట్టుకున్న చోటే... టీం ఇండియాకు పొట్టి వరల్డ్ కప్ బహుమానంగా ఇచ్చాడు రాహుల్ ద్రవిడ్.

వన్డేల్లో అయినా, టెస్టుల్లో అయినా ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరిన చరిత్రే లేదు దక్షిణాఫ్రికాకు. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురికావడం వల్లో, దురదృష్టం వెంటాడడం వల్లో ఆ జట్టు నిష్క్రమించడం మామూలే. అయితే ఈ ప్రపంచకప్‌లో మాత్రం నిలకడగా ఆడి ఫైనల్‌ చేరింది సఫారీ జట్టు. సూపర్‌-8లో ఇంగ్లాండ్‌ చేతిలో 6 వికెట్లు ఉండి 3 ఓవర్లలో 25 పరుగులే చేయాల్సి ఉన్న స్థితిలోనూ ప్రత్యర్థిని కట్టడి చేసి 7 పరుగుల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది దక్షిణాఫ్రికా. దీంతో సఫారీ జట్టు మారిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఫైనల్లో 6 వికెట్లు చేతిలో ఉండగా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో తడబడి మ్యాచ్‌ను భారత్‌కు అప్పగించేసింది సఫారీ జట్టు. దీంతో దక్షిణాఫ్రికా మారలేదని.. మంచి స్థితి నుంచి తడబడి కుప్పకూలే బలహీనతను విడిచిపెట్టలేదని మరోసారి రుజువైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories