T20 World Cup: టీ20 ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో పాకిస్థాన్, టీమిండియా ఢీ

Pakistan and Team India Clash in T20 World Cup Cricket Match
x

T20 World Cup: టీ20 ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో పాకిస్థాన్, టీమిండియా ఢీ

Highlights

T20 World Cup: ఇరుజట్లకు ప్రతిష్టాత్మకంగా మారిన మ్యాచ్

T20 World Cup: టీ20 ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది. కాసేపట్లో క్రికెట్ అభిమానులను ఊర్రూతలూగించే మ్యాచ్ జరగబోతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో ఇవాళ పాకిస్థాన్, టీమిండియా హోరాహోరీ పోరుకు తలపడబోతున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరగబోతున్న ఈమ్యాచ్‌ను క్రికెట్ పరిశీలకులు హై ఓల్టేజ్‌ మ్యాచ్‌గా భావిస్తున్నారు. సూపర్ 12లో ఇరుజట్లు తొలిసారిగా పోటీపడుతున్నాయి. విజయంతో ఘనంగా ఆరంభించాలని టీమిండియా, పాకిస్థాన్ భావిస్తుండటంతో ఈ మ్యాచ్ హై ఓల్టేజ్​ మ్యాచ్‌గా మారింది.

వేదిక ఏదైనా సరే... మ్యాచ్‌లో పట్టు సాధించాలన్నదే.. రోహిత్ సేన లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దాయాదుల సమరంలో టీమిండియా చిరకాలప్రత్యర్థి పాకిస్థాన్‌ను ముచ్చెమటలు పట్టించాలనే వ్యూహంతో బౌలర్లు సిద్ధమయ్యారు. బ్యాట్స్ మెన్లు బ్యాటును ఝుళిపిస్తారా? బౌలర్లు బంతుల్ని సంధించి పాకిస్థాన్ దూకుడుకు కళ్లెం వేస్తారా? అనేది కాసేపట్లో తేలనుంది. ఇటీవల జరిగిన ఆసియాకప్ పోటీల్లో ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డాయి. భీకరపోరులో ఇరుజట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. మెరుగైన ప్రదర్శనతో విజేతగా నిలిచేందుకు సాగించిన పోరాటం అభిమానుల్ని ఆకట్టుకున్నాయి.

ప్రపంచకప్ పోటీలు ఇరుజట్లకు ప్రతిష్టాత్మకంకావడంతో మెరుగైన ప్రదర్శన విజేతను నిర్ణయించబోతుంది. బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనలో ఇరుజట్లూ ఎవరికివారు సమర్థవంతమైన జట్లుగా పటిష్టమైన ఆటతీరుతో పోటీపడుతున్నాయి. టీ20 క్రికెట్ మ్యాచుల్లో ఇప్పటిదాకా 11 సార్లు ఇరుజట్లు ముఖాముఖీగా తలపడ్డాయి. టీమిండియా 8 విజయాలతోనూ, పాకిస్థాన్ 3 విజయాలతో నిలిచాయి. టీమిండియాది పైచేయిగా ఉన్నప్పటికీ, కీలకమైన మ్యాచ్‌లో ఫలితాలను అనుకూలంగా మలచుకుంటేనే టోర్నమెంటులో మెరుగైన ప్రదర్శన చేసేవీలుంటుందనే భావన ఇరుజట్లల్లో వ్యక్తమవుతోంది.

ఇప్పటిదాకా జరిగిన టీ20 మ్యాచుల్లో టీమిండియాపైచేయి సాధించినప్పటికీ...గత సీజన్లో పాకిస్థాన్ ఘనవిజయం సొంతంచేసుకుంది. టీమిండియాపై ఓపెనర్లే ఆకాశమేహద్దుగా చెలరేగి ఆడటంతో పది వికెట్ల తేడాతో గెలుపు సాధించారు. ఈ మ్యాచ్ కీలకం కావడంతో విజయవకాశాలను చేజార్చుకున్న టీమిండియా టీ20 వరల్డ్‌ కప్ పోటీనుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

గత సీజన్లో టీ20 వరల్డ్ కప్‌లో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియా, ఈసీజన్లో పాకిస్థాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోడానికి అన్ని విభాగాల్లో జట్టును పటిష్టంచేసిన రోహిత్‌శర్మ తన వంతు మంచి భాగస్వామ్యం అందించేందుకు బ్యాటును ఝుళిపించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ఇవాళ మ్యాచ్‌లో అత్యంత కీలకమైన టాస్‌ ఎవరు గెలిచినా.. లక్ష్యాన్ని చేదించేందుకే ప్రధాన్యత ఇవ్వబోతున్నారు. ఎంత భారీ లక్ష్యాన్నైనా చేదించేందుకు చేసే ప్రయత్నంలో విరాట్ కోహ్లీ సత్తాచాటి మధురమైన విజయాలను అందించిన సందర్భాలున్నాయి. ఆల్‌ రౌండర్‌ హార్థిక్ పాండ్యా జట్టుకు వెన్ను దన్నుగా నిలవబోతున్నాడు. దినేశ్ కార్తిక్, సూర్యకుమార్ యాదవ్‌ విరుచుకుపడితే స్కోరు బోర్డు 200 దాటే అవకాశాలున్నాయని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగుతున్న టీమిండియా ఓపెన్లు ధాటిగా ఆడి పాకిస్థాన్‌పై ఒత్తిడి తెచ్చే ఇన్నింగ్స్‌ అత్యంత కీలకం కాబోతోంది. టాపార్డర్ అధ్భుతమైన ఆటతీరుతో మెరుగైన స్కోరు సాధించి, భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగలిగితేనే పాకిస్థాన్‌ను నిలువరించవచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, లోకేశ్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్ బ్యాటును ఝుళిపించగలిగితే ఆశాజనకంగా స్కోరు సాధించే వీలుంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, యుజువేంద్ర ఛాహల్ బౌలింగ్ ప్రదర్శనతో పాకిస్థాన్‌ను కట్టడి చేయగలిగితే... తక్కువ పరుగులకే పరిమితం చేయగలిగితే విజయవకాశాలను మెరుగుపరచుకునే అవకాశాలున్నాయనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories