MSD birthday : మిస్టర్ కూల్ @ 39

MSD birthday : మిస్టర్ కూల్ @ 39
x
Highlights

MSD birthday : క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్‌గా మూడు ఐసీసీ టోర్నమెంట్‌లు గెలిచిన మొనగాడతను. అటాకింగ్ రైట్‌ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, వికెట్...

MSD birthday : క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్‌గా మూడు ఐసీసీ టోర్నమెంట్‌లు గెలిచిన మొనగాడతను. అటాకింగ్ రైట్‌ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్‌గా పేరు గడించాడు. టీమిండియాలో బాధ్యత ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా అతని మార్క్ తప్పనిసరి. భారత్‌కు 28 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ కప్‌ అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఎస్‌... అతనే మహేంద్ర సింగ్ ధోనీ. టీమిండియా మాజీ సారధి. 1981 జూలై 7న జన్మించిన ధోనీ ఈ రోజుకి 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ధోనీ జీవితంలో కొన్ని కీలక ఘట్టాలను గుర్తుచేసుకుందాం.

పవర్ హిట్టింగ్‌‌కి మారుపేరుగా నిలిచాడు. భారీ సిక్సర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. విదేశీ క్రికెటర్లకి ఏమాత్రం తీసిపోని విధంగా బంతిని బలంగా బాదగలనని నిరూపించాడు. అరంగేట్రం చేసిన కొద్దికాలానికే తానేంటో నిరూపించుకున్నాడు. వన్డేల్లో బెస్ట్‌ ఫినిషర్‌గా మారాడు. క్రికెట్‌ దిగ్గజాలు సైతం ప్రశంసించేలా ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. టీమ్ ఇండియా కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌‌గా ఘనత వహించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు.

1981 జూలై 7 న రాంచిలో జన్మించిన మహేంద్రసింగ్‌ ధోనీ చదువుకునే రోజుల్లో బాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌ వైపే ఎక్కువ ఆసక్తి కనబరిచాడు. ఫుట్‌బాల్‌ టీమ్‌లో గోల్‌ కీపర్‌గా ఉండేవాడు. స్కూల్‌ స్పోర్స్‌ ఇన్‌చార్జ్‌ ప్రోత్సాహంతో క్రికెట్‌వైపు మొగ్గు చూపాడు. 2004లో పూర్తి స్థాయిలో భారత జట్టులోకి వచ్చిన ధోనీ తక్కువ కాలంలోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. డిసెంబరు 23, 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన ధోని తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. కానీ.. ఆ తర్వాత పాకిస్థాన్‌పై మెరుపు శతకంతో వెలుగులోకి వచ్చాడు. అక్కడి నుంచి ధోనీకి ఏ దశలోనూ వెనుదిరిగిన చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

2004లో వన్డే జట్టులో చేరిన ధోనీ.. 2005లో టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు. శ్రీలంకతో తన తొలి టెస్ట్ ఆడాడు. ఒకవైపు టెస్టులు, మరోవైపు వన్‌డేలలో విజయాలతో దూసుకుపోతున్న ధోని 2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2007లో భారత్‌కి టీ20 ప్రపంచకప్ అందించాడు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌ని టీమిండియా గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్‌ని విజేతగా నిలిపి క్రికెట్ ప్రపంచంలోనే మూడు ఐసీసీ టోర్నమెంట్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు.

ధోని జీవిత చరిత్ర ఆధారంగా ఎం.ఎస్‌. ధోని ద అన్‌టోల్డ్‌ సోరీ.. అనే పేరుతో బాలీవుడ్‌లో సినిమా రూపొందింది. నీరజ్‌పాండే దర్శకత్వం వహించారు. ధోనీ జీవితం ఎంత విజయవంతంగా ఉందో...అతని జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కూడా అంతే విజయవంతం అయింది. బాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ధోనీ పాత్ర పోషించాడు. అద్భుతంగా నటించాడు. ధోనీ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. దాదాపు 50కి పైగా దేశాల్లో విడుదలైన ఈ చిత్రం ధోనీ గురించి తెలియవారికి సైతం తెలిసేలా చేసింది.

కెరీర్‌ ఆరంభంలో జులపాల జట్టుతో ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన ధోనీ భారత జట్టులో ప్రత్యేక ఆకర్షణగా మారాడు. రాంచీలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి క్రికెట్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపాడు. తన పవర్ హిట్టింగ్‌తో పాకిస్థాన్ ప్రధాని నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఎప్పటి కప్పుడు తన హెయిర్‌ స్టయిల్స్‌ మార్చుకుంటూ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ధోనీ డిఫరెంట్‌ లుక్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

జులపాల జుట్టుతో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ ఆ తర్వాత ఎన్నో హెయిర్‌ స్టయిల్స్‌ని మార్చాడు. అవన్నీ అభిమానుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. భారత జట్టులో హెయిర్ స్ట్రైల్ సంస్కృతికి నాంది పలికిన ఈ జార్ఖండ్ డైనమైట్ ఎప్పటికప్పుడు స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో పొడవాటి జుంపాల జుట్టుతో జట్టులోకి వచ్చిన ధోనీ హెయిర్‌ స్టైల్స్‌లో ఒక ట్రెండ్‌ను సృష్టించాడు. అప్పట్లో ధోనీ హెయిర్ స్టైల్‌కు పిచ్చ క్రేజ్ ఉండేది. చాలా మంది జుంపాల జట్టును పెంచుకొని అతని స్ట్రైల్‌ను ఫాలో అయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషార్రఫ్ సైతం ధోనీ హెయిర్ స్టైల్‌కు ముగ్ధుడయ్యాడు.ప్రశంసలతో ముంచెత్తాడు. 2006లో పాకిస్థాన్ పర్యటనలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందించే క్రమంలో ముషార్రఫ్ ధోని హెయిర్ స్టైల్‌‌కు ఫిదా అయ్యాడు. ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్‌ జరిగిన రోజున చాలా మంది ధోనీ హెయిర్‌ కట్‌ చేయించుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ విషయాన్ని గుర్తు చూస్తూ ముష్రాఫ్ ధోనీకి సరదాగా సలహా ఇచ్చారు. ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. హెయిర్ కట్ చేయించుకోకు అని నవ్వుతూ చెప్పాడు.

అలాంటి ధోనీ తర్వాత ఉన్న పళంగా జుంపాల జట్టును కత్తిరించాడు. విభిన్న హెయిర్ స్ట్రైల్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నాడు. 2011 ప్రపంచ కప్‌ గెలిచిన తర్వాత గుండు గీయించుకుని అందరికీ ఆశ్చర్యపరిచాడు. అక్కడి నుంచి వీలు చిక్కినప్పుడల్లా హెయిర్ స్టైల్స్ మారుస్తూ న్యూ లుక్‌తో కనిపిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం చెన్నై వచ్చిన ధోనీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఫామ్‌హౌస్‌కే పరిమితమై ధోని పూర్తిగా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. న్యూ లుక్ చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెరిసిన గడ్డంతో ధోని కనిపించడంతో కారణం ఏంటి..? సామాజిక మాధ్యమాల్లో ధోనీ లుక్‌పై ఇప్పుడు సరికొత్త చర్చ జరుగుతోంది. పుట్టినరోజు నాటికైనా ధోనీ తన లుక్‌ని మార్చాలని అభిమానులు కోరుతున్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి కోపం వచ్చే సందర్భాలు చాలా తక్కువ. మైదానంలోనూ చాలా కూల్‌గా ఉంటాడు. ఎలాంటి పరిస్థితులనైనా కూల్‌గా ఉంటూనే చక్కబెట్టేస్తాడు. అందుకే ధోనీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు. అభిమానులు ముద్దుగా మిస్టర్‌ కూల్‌ అని పిలుచుకునే ధోనీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు వివిధ రూపాల్లో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 90 టెస్టులాడిన ధోని 349 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. 300పైచిలుకు వన్డేలాడినా ఇప్పటికీ అతని బ్యాటింగ్ సగటు 50.58గా ఉంది. ఈ గణాంకాలే ధోనీ నిలకడ ఆటతీరుకి నిదర్శనంగా నిలుస్తున్నాయి. సిక్సర్లు బాదుతూ భారత క్రీడాభిమానులకు కొన్ని సంవత్సరాల పాటు వినోదాన్ని పంచాడు. హెలికాఫ్టర్‌ షాట్‌ను క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం చేశాడు. తనదైన హిట్టింగ్‌తో పరుగుల వరద పారించాడు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2011 వరల్డ్ కప్‌లో భారీ సిక్స్ కొట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ప్రపంచ కప్‌లో ధోనీ కొట్టిన ఆ సిక్సర్‌ భారత క్రీడాభిమానులకు ఎప్పటికీ ఒక మధుర స్మృతిగానే మిగిలిపోనుంది.

2011 భారత జట్టు గెలిచిన అనేక మ్యాచుల్లో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల కాలంలో కాస్త నెమ్మదించాడు. పరుగులు సాధించడంలో వెనకబడ్డాడు. పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మొత్తంగా టీమ్‌కి తాను అవసరం లేదు అనుకుంటే రిటైర్మెంట్ ప్రకటించడానికి క్షణం కూడా ధోనీ ఆలోచించడని ఇటీవల ఓ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

ఇక వికెట్ కీపర్‌గా కూడా ధోనీ రాణించాడు. మైదానంలో ఫీల్డర్లను మోహరించడంలో ధోనీ సిద్ధహస్తుడు. కీపర్‌గా కెరీర్‌ ఆరంభం నుంచి తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించాడు. క్షణాల వ్యవధిలో బెయిల్స్‌ను గీరాటేసే ధోనీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికలకి అనుగుణంగా బౌలర్లకి సూచనలు ఇవ్వగల సమర్ధుడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా ఇప్పటికే మైదానంలో ధోనీనే అనధికార కెప్టెన్. బౌండరీ లైన్ వద్ద కోహ్లీ ఫీల్డింగ్ చేస్తుంటే ఫీల్డింగ్ కూర్పులు, బౌలింగ్‌ మార్పుల్ని ధోనీనే స్వయంగా పర్యవేక్షింస్తుంటాడు. మైదానంలోనూ చాలా కూల్‌గా ఉంటాడు. ఎలాంటి పరిస్థితులనైనా కూల్‌గా ఉంటూనే చక్కబెట్టేస్తాడు. అందుకే ధోనీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా స్థంభించిపోయింది. క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్‌డౌన్ కారణంగా తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ధోనీ ప్రస్తుతం కుటుంబంతోనే ఎక్కువగా టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాడు. తనకు ఇష్టమైన పనులు చేస్తూ తీరక లేకుండా గడుపుతున్నాడు. భార్య సాక్షి, కూతురు జీవాతో కాలక్షేపం చేస్తున్నాడు. ధోనీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ధోనీ భార్య అప్‌డేట్‌ చేస్తున్నారు. దీంతో అభిమానులకు ధోనీకి సంబంధించిన అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో 39వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅభిమానులు, సహచరులు అభినందనలు తెలుపుతున్నారు. ట్విట్టర్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్‌‌ల ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories