Jasprit Bumrah: బ్యాటర్స్‌ను భయపెడుతున్న ఈ వరల్డ్ నెం. 1 బౌలర్ టీమిండియా కెప్టేన్ అయ్యేనా?

Jasprit Bumrah: బ్యాటర్స్‌ను భయపెడుతున్న ఈ వరల్డ్ నెం. 1 బౌలర్ టీమిండియా కెప్టేన్ అయ్యేనా?
x
Highlights

Jasprit Bumrah becomes nightmare for Australian batters ahead of Ind vs Aus 2nd test: జస్‌ప్రీత్ బుమ్రా బంతి వేస్తే క్రికెట్ ప్రియులకు పూనకాలే....

Jasprit Bumrah becomes nightmare for Australian batters ahead of Ind vs Aus 2nd test: జస్‌ప్రీత్ బుమ్రా బంతి వేస్తే క్రికెట్ ప్రియులకు పూనకాలే. జస్ప్రిత్ బుమ్రా రియల్ స్టోరీని ఒక సినిమా స్టోరీగా చెబితే ఎలా ఉంటుందంటే.. పుష్ప: ది రైజ్... పుష్ప: ది రూల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు జస్‌ప్రీత్ బుమ్రా పర్‌ఫార్మెన్స్ ఒక లెక్క.. ఆ తరువాత మరో లెక్క అన్నట్లు బుమ్రా బూమరాంగ్ చేస్తున్నాడు.

ఐసిసి ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ 1 బౌలర్ అనిపించుకున్న బుమ్రా తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టును తన బంతితో ఊచకోత కోస్తున్నాడు. బంతితో పిచ్‌పై బుమ్రా రాసే కోడింగ్ ఏంటో మహామహులకే అర్థం కావడం లేదు. ప్రత్యర్థి జట్టులో స్టార్ బ్యాటర్స్ సైతం ఇక చేసేదేం లేక చేతులెత్తుస్తున్నారు.

ఇంతకీ బుమ్రా ఎందుకు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు? బుమ్రాకే కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ ఎందుకు తెరపైకొచ్చింది? బుమ్రా పేరు గుర్తుకొస్తే ఆస్ట్రేలియా జట్టులో స్టార్ బ్యాటర్స్‌కు ఎందుకు తలలు పట్టుకుంటున్నారనేది తెలియాలంటే ఇదిగో ఈ డీటేయిల్డ్ స్టోరీ చూడాల్సిందే.

బుమ్ బుమ్ బుమ్రాపైనే అందరి ఫోకస్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. సొంత గడ్డపైనే న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో ఘోర పరాజయం పాలైన టీమిండియా ఆ ఓటమి భారంతోనే ఆసిస్ గడ్డపై అడుగుపెట్టింది. సొంత గడ్డపైనే గెలవలేకపోయాం... ఇక పరాయి గడ్డపై పరిస్థితి ఏంటో అనే భయాన్ని బయటపడనివ్వకుండా జాగ్రత్తపడింది. దానికితోడు పెర్త్‌లో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ లాంటి అనుభవజ్ఞుడైన కేప్టేన్ వెంట లేడు. సరిగ్గా ఆ సమయంలోనే బీసీసీఐ సెలెక్టర్లతో పాటు అందరి చూపు బుమ్ బుమ్ బుమ్రాపై పడింది. దాంతో ఫస్ట్ టెస్టుకు బుమ్రా కేప్టెన్ అయ్యాడు.

కంగారూలను కంగారు పెడుతున్న బుమ్రా

పెర్త్‌లో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ టీమిండియాకు నిజంగానే పెద్ద టెస్ట్. గత ఓటమి నుండి తేరుకుని "వీ ఆర్ బ్యాక్" అని మళ్లీ ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ టెస్టులోనే వారికి ఒక భారీ విజయం అవసరం. తొలి రోజు క్రీజులోకి వచ్చిన బ్యాటర్స్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అందరికీ టెన్షన్ తప్పలేదు. కానీ బౌలర్‌గా బంతిని చేతపట్టుకున్న బుమ్రా మ్యాజిక్ చేశాడు. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా బ్యాటర్స్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఫలితంగా టీమిండియా ఫస్ట్ టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆ విజయం వెనుకున్న ఘనత బుమ్రాదే. అందుకే ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆటగాడు ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మ్యాన్ ఆఫ్ ది టెన్షన్‌గా మారాడు.

బుమ్రా కోసమే ఆస్ట్రేలియా ఎత్తుకు పై ఎత్తులు

డిసెంబర్ 6 నుండి 10 వరకు అడిలైడ్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రెండో టెస్ట్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్న వారికి ఇప్పుడు బుమ్రా ఓ అంతుచిక్కని మిస్టరీ. ఎందుకంటే.. అతడు వేసే ప్రతీ బాల్ ఒక మిస్టరీనే. శత్రువు తమ కళ్ల ముందే కనిపిస్తున్నా.. అతడు విసిరే బంతిని టచ్ చేయలేని నిస్సహాయ స్థితి ఆసిస్ ఆటగాళ్లది.

రెండో టెస్టుకు ఎలా సిద్ధమవ్వాలా అనేదానికంటే ఎక్కువగా బుమ్రా రెండోసారి కూడా ఊచకోత కోయకుండా ఎలా ఎదుర్కోవాలా అన్నదానిపైనే ఆసిస్ బ్యాట్స్‌మెన్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఒక బాల్ ఇలా వేశాడు కదా అని తరువాతి బాల్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి అవతలి జట్టు ఆటగాళ్లది. సింపుల్‌గా ఒక్కముక్కలో చెప్పాలంటే జస్ప్రిత్ బుమ్రా వారికి ఒక తలనొప్పిగా మారాడు.

ఆసిస్ ఆటగాళ్లే ఆకాశానికెత్తుతున్నారు

ఒకప్పుడు స్టార్ బ్యాటర్స్ సచిన్ టెండుల్కర్, ఆ తరువాత ధోనీ, కోహ్లీ లాంటి వారికి మాత్రమే దేశాలతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండే వారు. కానీ ఇప్పుడు టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా కూడా ఆ జాబితాలో చోటు దక్కించుకుంటున్నాడు. బుమ్రాను అభిమానించే వారి సంఖ్య ఇతర దేశాలకు కూడా పాకిపోతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో స్టార్ బ్యాట్స్‌మేన్ అనిపించుకున్న వాళ్లు కూడా ఇప్పుడు బుమ్రా జపం చేస్తున్నారు.

ఆసిస్ స్టార్ బ్యాటర్సలో ఒకరైన ట్రావిస్ రెండో టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ బుమ్రాను పొగడ్తల్లో ముంచెత్తాడు. ప్రపంచం చూసిన ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా బుమ్రా నిలిచిపోతాడని ట్రావిస్ హెడ్ కితాబిచ్చాడు. బుమ్రాను ఎదుర్కోవడం కచ్చితంగా ఓ పెను సవాలేనన్న ట్రావిస్.. తాను అలాంటి ఆటగాడిని ఎదుర్కొన్నానని తన మనవళ్లకు గర్వంగా చెప్పుకుంటానని అన్నాడు. అందుకే అతడితో ఆడటం కూడా గొప్ప అనుభవమే అని ట్రావిస్ చెప్పుకొచ్చాడు.

ఇక ఆసిస్ వికెట్ కీపర్ అలెక్స్ కెరీ మాట్లాడుతూ.. బుమ్రా ఒక ఫెంటాస్టిక్ బౌలర్ అని ఆకాశానికెత్తాడు. అదే సమయంలో తమ ఆసిస్ ఆటగాళ్లు కూడా తక్కువేం కాదు. అందుకే ఈసారి బుమ్రాకు చెక్ పెడతాం అని బుమ్రా పేరు ఒక్కినొక్కానించి చెప్పడంలోనే వారి ఫోకస్ అంతా అతడిపైనే ఉందని అర్థమవుతోంది.

బుమ్రా ప్రత్యర్థులకు ఒక పీడకల - రికీ పాంటింగ్

ఒక్క ట్రావిస్ హెడ్, లేదా అలెక్స్ కెరీ మాత్రమే కాదు.. గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్స్ రికీ పాంటింగ్, మైఖెల్ క్లార్క్ వంటి ఆటగాళ్లు కూడా బుమ్రా గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పిన వారే.

జస్ప్రిత్ బుమ్రాకు ఇదేమీ ఓవర్ నైట్లో వచ్చిన సక్సెస్ కాదు. లేదంటే కేవలం ఆసిస్ పై ఫస్ట్ టెస్ట్ చూసి చెబుతున్న మాటలు అసలే కాదు. ఈ విజయం వెనుక గత కొన్నేళ్ల కఠోర శ్రమ దాగి ఉంది. ఆ మాటకొస్తే.. ఈ ఏడాది ఆగస్టులోనే ఐసిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ... జస్ప్రిత్ బుమ్రా ఏ బంతిని ఎలా స్వింగ్ చేస్తాడో ఊహించడం కూడా కష్టమే. అందుకే అతడు ప్రత్యర్థులకు ఒక పీడకలగానే కనిపిస్తాడని అన్నాడు. అంతేకాదు... బుమ్రాను ఆల్ టైమ్ దిగ్గజాలైన గ్లెన్ మెక్‌గ్రాత్, జేమ్స్ ఆండర్సన్ వంటి ఆటగాళ్లతో పోల్చారు.

ఆసీస్ మీదే బుమ్రా ఇంటర్నేషనల్ ఎంట్రీ

విచిత్రం ఏంటంటే... ఇప్పుడు ఆసిస్ ఆటగాళ్లను హడలెత్తిస్తోన్న ఈ ఫాస్ట్ బౌలర్ 2016 లో తొలిసారిగా టీమిండియాలో ఛాన్స్ కొట్టేసింది కూడా ఆసిస్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారానే. వచ్చీ రావడంతోనే ఆ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా అందరి కంట్లో పడ్డాడు. అదే అతడికి వన్డేల్లో, టెస్టుల్లోనూ ప్లేస్ పర్మినెంట్ చేసింది. 2013 అక్టోబర్ లో రంజీ ట్రోఫీలో గుజరాత్, విదర్భ జట్ల మధ్య మొదటిసారిగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన బుమ్రా.. అదే ఏడాది ముంబై ఇండియన్స్ తరుపున ఐపిఎల్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

ది గ్రేట్ లెజెండ్స్ సరసన చేరిన బుమ్రా

క్రికెట్‌లో ఎవరు ఔనన్నా .. ఎవరు కాదన్నా.. బ్యాట్స్‌మెన్లదే డామినేషన్. ఆ తరువాతే ది గ్రేట్ వరల్డ్ క్లాస్ బౌలర్స్ జాబితా వస్తోంది. వరల్డ్ క్లాస్ బౌలర్లలో ఆ రేంజ్ కరిష్మా సొంతం చేసుకున్న వాళ్ల జాబితా చాలా పెద్దదే ఉంది. కానీ అందులో ముందు వరుసలో ఉండే వారిలో ఒకప్పుడు కపిల్ దేవ్, గ్లెన్ మెక్‌గ్రాత్, జేమ్స్ ఆండర్సన్, ఆ తరువాత బ్రెట్‌లీ, పాకిస్థాన్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అఖ్తర్... ఇలా కొద్దిమంది పేర్లే కళ్ల ముందు కదలాడతాయి. ఇప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. దటీజ్ బుమ్రా... బుమ్ బుమ్ బుమ్రా

Show Full Article
Print Article
Next Story
More Stories